
రేవంత్ చాలా అదృష్టవంతుడు
రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధిష్ఠానం దగ్గర రేవంత్ ‘వెయిట్’ కచ్చితంగా మరింత పెరుగుతుంది అనటంలో సందేహంలేదు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. తెలుగుదేశంపార్టీలో నుండి కాంగ్రెస్‌లో చేరటమే వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేరి కొంతకాలానికే పీసీసీ అధ్యక్షుడు అయిపోయాడు. అలాగే సీఎం పీఠం మీద కూర్చున్నాడు. వీటన్నింటికీ మించి ఇపుడు కేరళం కాంగ్రెస్‌అభ్యర్ధుల విజయానికి గట్టిగా ప్రచారం చేస్తున్నాడు. కేరళం కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి రేవంత్‌కు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా ? కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి తప్పదని ఇప్పటికే చాలాసర్వేలు జోస్యం చెప్పాయి. అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ స్ధానంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కు పాలనాపగ్గాలు అందబోతున్నట్లు కొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. అదే జరిగితే రేవంత్ అదృష్టవంతుడే. తన ప్రచారంవల్లే కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రేవంత్ క్లయిమ్ చేసుకోడు. కాని స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తనపేరు కూడా ఉందికాబట్టే రేవంత్ రెగ్యులర్ గా కేరళంలో ప్రచారం చేస్తున్నాడు.
ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రచారం చేశాడు. మొదటిసారి వెళ్ళినపుడు తిరువనంతపురంలో పెద్ద బహిరంగసభ తర్వాత భారీరోడ్డుషో జరిగింది. తర్వాత కోవళం, మావెలిక్కర, పత్తనపురంలో కూడా సభలు, రోడ్డుషోల్లో పాల్గొంటున్నాడు. మంగళవారం ఉదయం నుండి కోవళం, మావెలికరలో రోడ్డుషోల్లో పాల్గొంటున్నాడు. ఈరోజు సాయంత్రం బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటాడు. బహిరంగసభల్లో అయినా రోడ్డుషోల్లో అయినా రేవంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడనటంలో సందేహంలేదు.
నిజానికి రేవంత్ కేరళలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా ? రేవంత్ కేమైనా మళయాళం వచ్చా ? అనే సందేహాలు రావచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే రేవంత్ కు మళయాళం రాదుకాని ప్రధానంగా ముస్లింల ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్ళించటమే వ్యూహంగా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ ను కేరళంలో స్టార్ క్యాంపెయినర్ ను చేసింది. ముస్లింలతో మాట్లాడటంలో రేవంత్‌కు ఎలాంటి భాషా సమస్య లేదు. రాష్ట్ర జనాభాలో ముస్లింల జనాభా 26.5 శాతం అంటే సుమారు 89 లక్షలుంటారు. ప్రతినలుగురిలో ఒక ముస్లిం ఉంటాడని అనుకోవాలి. మళ్ళప్పురం జిల్లాలో ముస్లింలదే డామినేషన్. ఇక్కడ జనాభాలో 70శాతం ముస్లింలే. ఇక కోజీకోడ్ జిల్లాలో 39శాతం, కాసరగోడ్ జిల్లాలో 37శాతం, కన్నూర్ జిల్లాలో 29శాతం, పాలక్కాడ్/వయనాడ్ జిల్లాలో 29శాతం ముస్లింలున్నారు. ఈజిల్లాల్లోని ముస్లింఓటర్లను టార్గెట్‌గానే రేవంత్ తో మాట్లాడిస్తున్నారు. నార్త్ కేరళలో అంటే మలబార్ ప్రాంతంలో ముస్లింలు జనాభా ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
మొత్తంమీద 25నియోజకవర్గాల్లో ముస్లింలదే డామినేషన్ అనుకుంటే మరో 45నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటముల్లో కీలకపాత్ర పోషించగలరు. రేవంత్‌కు ఉన్న ప్లస్‌పాయింట్ ఏమిటంటే హిందీ అనర్గళంగా మాట్లాడగలడు. కేరళం ముస్లింలతో హిందీలో మాట్లాడగలడు కాబట్టే అధిష్ఠానం కూడా ఏరికోరి రేవంత్ ను స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. 140 అసెంబ్లీ సీట్లలో మెజారిటి గెలుపుకు ఇటు పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ విజయం కోసం గట్టిగా శ్రమిస్తోంది. పదేళ్ళ తర్వాత ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చితీరాలని కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూడా చెమటోడుస్తోంది. రెండుకూటముల మధ్య గెలుపోటములు చాలా క్లోజ్ గా ఉంటాయని కొన్ని సర్వేల ద్వారా అర్ధమవుతోంది.
జాతీయరాజకీయాల్లోని సమీకరణల కారణంగా కేరళం ముస్లింలు కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. పైగా ఈమధ్యనే జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో యూడీఎఫ్ మంచి ఫలితాలను సాధించటం, అందులో ముస్లింలు కాంగ్రెస్ అభ్యర్ధులను ఆధరించటం కూడా రేపటి ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్‌లో విశ్వాసం పెరిగిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకుతోడు కాంగ్రెస్‌కు ముస్లింలు దగ్గరవ్వటం, కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టో కారణంగా ఓటర్లు హస్తంపార్టీ వైపు మొగ్గుచూపుతున్నారనే సంకేతాలు కనబడుతున్నాయి. 71 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను ఏ కూటమి దాటితే దానిదే అధికారం. తమకు 100 సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. సీపీఎం నేతలేమో హ్యాట్రిక్ కొట్టడం, విజయనే మళ్ళీ సీఎం అవటం ఖాయమని అంటున్నారు.
పినరయికి రేవంత్ సమవుజ్జీనేనా ?
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను రేవంత్ పదేపదే టార్గెట్ చేస్తున్నాడు. విజయన్‌ను టార్గెట్ చేయగలిగిన సమవుజ్జీ రేవంత్ మాత్రమే అని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గట్టిగా నమ్ముతోంది. విజయన్ సీపీఎంపార్టీలో చాలా సీనియర్ నేత, పదేళ్ళుగా సీఎంగా పనిచేస్తున్నారు. అలాంటి విజయన్ ను ఢీకొనేందుకు రేవంత్ కేరళంలో ప్రచారం చేస్తున్నాడు. విజయన్ నేతృత్వంలో కేరళంలో జరగాల్సినంత అభివృద్ది జరగలేదని, సంక్షేమపథకాలు, అభివృద్ధి అంతా ఉత్త డొల్లేనని రేవంత్ చేస్తున్న ఆరోపణలకు మళయాళ యువత, మహిళలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
మామూలుగా ఎన్నికల సమయంలో చేసే ఆరోపణలు, ప్రత్యారోపణలను జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ కేరళం పర్యటనలో రేవంత్ చేస్తున్న ఆరోపణలను విజయన్ సీరియస్ గా తీసుకుని పే....ద్ద లేఖ రాశారు. తన లేఖలో కేరళంలో అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి తేడాను విజయన్ ప్రస్తావించారు. అంటే రేవంత్ ఆరోపణలకు విజయన్ బాగా ప్రాధాన్యత ఇచ్చారని అర్దమవుతోంది. అయితే విజయన్ లేఖలోని అంశాలను రేవంత్ తప్పుపడుతు తిరిగి సీఎంకు మరో లేఖ రాయటం సంచలనంగా మారింది. 60 ఏళ్ళ కేరళం అభివృద్ధిని, 14 ఏళ్ళ తెలంగాణను ఎలాగ పోలుస్తారనే పాయింట్ ఆధారంగా విజయన్‌కు లేఖలో రేవంత్ మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు.
రేవంత్ కు ఎందుకింత ప్రాధాన్యత
సుదీర్ఘ అనుభవం ఉన్న విజయన్‌ను ఢీకొనాలంటే యువకుడు, జనాల్లోకి చొచ్చుకుని పోగలిగిన చురుకైనవాడు, మాటకారి, భాషా సమస్యలేని రేవంత్ అయితేనే కరెక్టని అధిష్ఠానం గ్రహించింది. కర్నాటకలో సిద్ధరామయ్యకు విజయన్ కన్నా సుదీర్ఘమైన అనుభవం ఉన్నా రేవంత్ లాగ మాట్లాడగలిగిన నేతకాదు. అందుకనే కాంగ్రెస్ అధిష్ఠానం ఏరికోరి రేవంత్ ను కేరళంకు పంపింది. కేరళం కాంగ్రెస్ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టును కూడా రేవంత్ విడుదల చేశాడంటేనే తనకు అధిష్ఠానం ఇస్తున్న ప్రాధాన్యత అర్ధమవుతోంది. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధిష్ఠానం దగ్గర రేవంత్ ‘వెయిట్’ కచ్చితంగా మరింత పెరుగుతుంది అనటంలో సందేహంలేదు.

