
6 గ్యారెంటీలకు భారీ నిధుల కేటాయింపు
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆరు పథకాల అమలుకు ప్రభుత్వం రు. 50, 713 కోట్లు కేటాయించింది
శుక్రవారం ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో 6 గ్యారెంటీలకు నిధులు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. 2023 ఎన్నికల సమయంలో రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలను గుప్పించిన విషయం తెలిసిందే. రైతుభరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి పథకం, చేయూత, యువవికాసం, ఇందిరమ్మ ఇళ్ళు ప్రధానమైనవి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆరు పథకాల అమలుకు ఈరోజు ప్రభుత్వం రు. 50, 713 కోట్లు కేటాయించింది.
ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులు 6 గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తున్న సమయంలోనే ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయలు కేటాయించటం గమనార్హం. ఈమొత్తంలో రైతుభరోసాకు అత్యధికంగా రు. 18వేల కోట్లు కేటాయించింది. మహాలక్ష్మి పథకానికి రు. 4,305 కోట్లు, గృహజ్యోతి పథకం అమలుకు రు. 2080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలుకు రు. 1,143 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఉచితబస్సు పథకంలో ఇప్పటివరకు 34.37 లక్షలమంది మహిళలు ప్రయాణించారు. ఇప్పటివరకు 270 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు బడ్జెట్లో ప్రభుత్వం చెప్పింది. దీనివల్ల మహిళలకు రు. 9,222 కోట్లు ఆదా అయ్యిందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూలైలో ప్రభుత్వం నుండి ఆర్టీసీకి రు. 6,600 కోట్లు చెల్లించింది. అప్పటినుండి ఈ యేడాది ఫిబ్రవరి వరకు రు. 2,913 కోట్లు చెల్లించింది.
ఉచిత గ్యాస్ పథకంలో 43 లక్షల మంది లబ్దిపొందుతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఏడాదికి మూడు సిలిండర్ల పథకంలో మహిళలు రు. 752 కోట్లు ఆదా అయినట్లు చెప్పింది. గృహజ్యోతి పథకం ద్వారా సుమారు 53 లక్షల మధ్య తరగతి కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలవుతున్నట్లు చెప్పింది. ఈ పథకంలో 11 కోట్ల సున్నా బిల్లులను ప్రభుత్వం జారీచేసినట్లు కూడా చెప్పింది. సబ్సిడీ కింద రు. 3,900 కోట్లను విద్యుత్ సంస్ధలకు చెల్లించినట్లు బడ్జెట్లో ప్రభుత్వం చెప్పింది. మహిళాశక్తి మిషన్ ద్వారా కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది లక్ష్యమని ప్రభుత్వం బడ్జెట్లో తెలిపింది. 5 ఏళ్ళల్లో మహిళలకు లక్ష కోట్లరూపాయలను రుణాలుగా ఇప్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే సుమారు రు. 58 వేల కోట్లను రుణాలుగా మహిళలకు ఇప్పించినట్లు ప్రకటించింది.
అలాగే రైతుసంక్షేమానికి తమ ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. రైతులకు పెట్టుబడిసాయంగా రైతుభరోసా పథకంలో ప్రతి సీజన్ కు రు. 6 వేల చొప్పున ఏడాదికి రు. 12వేలు సాయంఅందిస్తున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. 2024-25లో 1.27 కోట్ల ఎకరాల్లో 284 లక్షల 16 వేల మెట్రిక్ టన్నుల వరి పండినట్లు ప్రభుత్వం చెప్పింది. ఫిలిప్పీన్స్ కు సుమారు 23 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుండి ఎగుమతి అయ్యిందని చెప్పింది. దీనివల్ల బియ్యానికి డిమాండ్ పెరిగి రైతులకు మరింత మద్దతుధర పెరిగిందని ప్రభుత్వం వివరించింది. ప్రజాపంపిణీ వ్యవస్ధ ద్వారా 3.38 కోట్లమంది లబ్దిదారులకు తలా 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఆహారభద్రత కల్పించటంలో భాగంగా ప్రజలకు నాణ్యమైన పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు భట్టి చెప్పారు. తమ ప్రభుత్వ వచ్చిన తర్వాత కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులను మంజూరుచేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో 19 లక్షలమందిని చేర్చినట్లు తెలిపారు. మంత్రి చెప్పిన ప్రకారం రాష్ట్రంలో 1.5 కోట్ల రేషన్ కార్డులున్నాయి.

