
కమ్యూనిస్టు సభలో కాంగ్రెస్ చరిత్ర వినిపించిన రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో సీపీఐ పాత్రకూడా ఉందన్నారు
ఖమ్మంలో ఆదివారం జరిగిన సీపీఐ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బహిరంగసభలో రేవంత్ మాట్లాడుతు కమ్యూనిస్టులు-కాంగ్రెస్ భాయ్ భాయ్ అన్నారు. రెండుపార్టీలు కలిసే ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో సీపీఐ పాత్రకూడా ఉందన్నారు. నరేంద్రమోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సీపీఐ సహకారం ఉండాలని కోరారు. పేదల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుపార్టీలు దేశానికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. రైతు కూలీల హక్కుల కోసం కమ్యూనిస్టుల చేసిన పోరాటాలకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు.
పేదల హక్కులను కాలరాయటానికే కేంద్రంలోని బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఇందులో భాగంగానే ముందు ఓటుహక్కు తీసేయటానికి ఎస్ఐఆర్(స్పెషల్ ఇన్సెటివ్ రివిజన్)ను అమలుచేస్తున్నట్లు మండిపడ్డారు. పేదలకు ఓటు హక్కులు ఉండకూడదని ఎన్డీయే ప్రభుత్వం కుట్రచేస్తున్నట్లు రేవంత్ ఆరోపించారు. సర్ ప్రక్రియను దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కు కమ్యూనిస్టుల మద్దతు చాలా అవసరమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున జరుగుతున్న పోరాటానికి కమ్యూనిస్టుపార్టీలు కలిసిరావాలని పిలుపిచ్చారు.
కొద్దిసేపు మాత్రమే రేవంత్ మాట్లాడినప్పటికీ అందులో ఎక్కువగా కాంగ్రెస్ ఘనత గురించే చెప్పుకున్నారు. స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పాత్రను, మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ తదితరుల పాత్రల గురించి చెప్పారు. తన ప్రసంగంలో ఎక్కువసేపు కాంగ్రెస్ ఘనతగురించే రేవంత్ వివరించారు.

