
‘మోదీ సాబ్.. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఒకటి కాదు’
మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ వేర్వేరు అంశాలని స్పష్టం. దక్షిణ రాష్ట్రాలపై ప్రభావం, జాతీయ ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయం.
లోక్‌సభ సీట్ల డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు రెండూ రెండు వేరువేరు అంశాలను ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వాటిని వేరువేరుగానే చూడాలని అన్నారు. మహిళా రిజర్వేషన్లకు దేశమంతా మద్దతు ఇస్తుందాని, కానీ డిలిమిటేషన్ పద్దతిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని మోదీ గుర్తించాలని రేవంత్ కోరారు. దీంతో లోక్‌సభ సీట్ల డిలిమిటేషన్ అంశంపై రాజకీయ చర్చ మళ్లీ వేడెక్కింది. ఈ అంశంపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.
మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ డిలిమిటేషన్ రెండు వేర్వేరు అంశాలని ఆయన స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లకు దేశవ్యాప్తంగా మద్దతు ఉందని, అయితే జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల పునర్విభజనపై అనేక ఆందోళనలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దక్షిణ, చిన్న రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని రేవంత్ భావించారు. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేస్తే దేశం స్వాగతిస్తుందని సూచించినట్లు తెలిసింది.
మహిళా రిజర్వేషన్ అంశాన్ని వేరే విధానాలకు అనుసంధానం చేయడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్లడం తక్షణ రాజకీయ ప్రయోజనం ఇవ్వొచ్చని, కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టం కలిగించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. జాతీయ ప్రయోజనం పార్టీ ప్రయోజనాల కంటే ముఖ్యమని రేవంత్ పేర్కొన్నారు. సరళమైన ప్రోరాటా విధానానికి బదులుగా ఇతర మోడళ్లను పరిశీలించాలని సూచించారు. ఈ అంశంపై అన్ని పార్టీలతో చర్చించి జాతీయ స్థాయి ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

