
రైతుభరోసా నిధులు విడుదలచేసిన రేవంత్
మరో 45రోజుల్లో మిగిలిన రు.5400 కోట్లు కూడా రైతులఖాతాల్లో జమవుతాయని ప్రకటించారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేటజిల్లా నర్మెట్ట వేదికగా రైతుభరోసా నిధులను విడుదలచేశారు. 70లక్షలమంది రైతులకు రు.3,600 కోట్లను రేవంత్ విడుదలచేశారు. నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభంచిన తర్వాత ఫ్యాక్టరీని రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు విడుదలచేసిన నిదులు సోమవారంలోగా రైతులఖాతాల్లో జమవుతాయన్నారు. మరో 45రోజుల్లో మిగిలిన రు.5400 కోట్లు కూడా రైతులఖాతాల్లో జమవుతాయని ప్రకటించారు. రైతులకళ్ళల్లో ఆనందం చూడటంకోసమే రైతుభరోసా నిధులు మంజూరు చేసినట్లు రేవంత్ తెలిపారు. రైతుసంక్షేమం కోసం గడచిన రెండేళ్ళల్లో ప్రతి నెలా సగటున రు. 5500 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు చెప్పారు.
అకాలవర్షాలు, తుపాను ప్రభావం, వడగండ్ల వానల కారణంగా నష్టపోయిన రైతుల కోసం రు. 1.40 లక్షల కోట్లు తమ ప్రభుత్వం వ్యయంచేసినట్లు గుర్తుచేశారు. రైతును రాజును చేయటం కోసమే తమ ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు సీఎం చెప్పారు. పంటలకు మద్దతుధరతో పాటు రు. 500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పామాయిల్ పంట విస్తీర్ణం 3 లక్షలకు చేరుకున్నట్లు చెప్పారు. పామాయిల్ పంట విస్తీర్ణం 10 లక్షలకు చేరుకున్నా మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయటానికి సిద్ధంగా ఉన్నదని రేవంత్ తెలిపారు. రియల్ ఎస్టేట్ కారణంగా రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా పంటల విస్తీర్ణం తగ్గిపోతోంది అన్నారు. అందుకనే కూరగాయలు, పాలను ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన అగత్యం పట్టిందన్నారు.
వరిపంటను తగ్గించి రైతులు ఇతర పంటలను పండించే విషయమై ఆలోచించాలని సూచించారు. విదేశాలకు వరిని ఎగుమతి చేయాలన్నా గిట్టుబాటు ధరలు లేవన్నారు. అందుకనే పంటలమార్పిడి పథకాల విషయమై రైతులు ఆలోచించాలన్నారు. 50 లక్షల టన్నులకన్నా వరిని కొనలేమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని రేవంత్ అన్నారు. పంటలమార్పిడి పథకాలపై అందరు ఆలోచించి ప్రణాళికను సిద్ధంచేయాలి అన్నారు. ఇలాంటి ప్రణాళికలను తీసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి చర్చలు జరపాలన్నారు. సిద్ధిపేటలో కట్టిన రిఫైనరీ ఫ్యాక్టరీలాంటిదే తన నియోజకవర్గం కొడంగల్ లో కట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రేవంత్ విజ్ఞప్తిచేశారు.
వ్యవసాయేతర ఆదాయంపై సూచిస్తు అంకాపూర్ చికెన్ గురించి ప్రస్తావించారు. అంకాపూర్ చికెన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. అదేపద్దతిలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రైతులు పంటలకు ప్రత్యామ్నాయంగా చికెన్ లాంటి లాభసాటి వ్యాపారాలగురించి కూడా ఆలోచించాలి అని సూచించారు. అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తెస్తుందన్నారు. పండించిన పంటలను ఎగుమతి చేయటానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పండే ప్రతి పంట, ప్రతి గింజ బంగారుతెలంగాణలో భాగస్వామ్యం కావాలన్నారు.
పనిలోపనిగా మహిళాభివృద్ధికి తమ ప్రభుత్వం అందిస్తున్న చేయూతను కూడా వివరించారు. స్వయంసహాయ గ్రూపుల ద్వారా ఆర్ధికంగా ప్రోత్సాహించటం, పెట్రోల్ బంకులు కేటాయించటం, ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేయటం, ఇందిరమ్మ ఇళ్ళను మహిళలపేరుతోనే కేటాయించటం, ఉచితబస్సు ప్రయాణాలను గుర్తుచేశారు. ప్రభుత్వ స్కూళ్ళను ప్రైవేటు స్కూళ్ళకన్నా మిన్నగా డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. స్కూళ్ళను డెవపల్ చేసే ఉద్దేశ్యంతోనే పాఠశాల విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్నట్లు చెప్పారు. చెప్పులతయారీ, ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యూటీ బొటిక్ లాంటి అనేక వృత్తుల్లో నైపుణ్యాలను సంపాదించుకుంటే ప్రతి నెలా వేలాది రూపాయలను సంపాదించుకోవచ్చని చెప్పారు. సంప్రదాయ విద్యకన్నా సాంకేతిక విద్యలో ప్రావీణ్యంతో పాటు మూడు భాషల్లో పట్టుసాధించి మాట్లాడటం నేర్చుకుంటే ఉద్యోగాలు, ఉపాధి తమ దగ్గరకే వస్తుందని రేవంత్ తెలిపారు.
ఎరువులు, యూరియా కొరతను ఎదుర్కోవటానికి కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలతో కలిసి నరేంద్రమోదీని కలవాలని మంత్రి తుమ్మలకు వేదికమీదనే రేవంత్ సూచించారు. ఎన్నికల సమయంలో గెలుపుకు పోటీపడినా తర్వాత అందరు కలిసి రాష్ట్రాభివృద్ధికి పనిచేయాలన్నారు. తాను ఎవరి విషయంలోను ఏ రూపంలోను వివక్ష చూపటం అలవాటు లేదన్నారు. పేదలకు మంచిచేయటమే లక్ష్యంగా పనిచేస్తానని రేవంత్ చెప్పారు. 2029 ఎన్నికల్లో సిద్ధిపేట అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవారిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని రేవంత్ ప్రకటించారు. సిద్ధిపేటలో ఎంఎల్ఏను మార్చి మార్పుకోసం మంచి జరుగుతుందో లేదో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

