
బీఆర్ఎస్ కు కొత్తపేరు పెట్టిన రేవంత్
కౌన్సిలర్లుగా కాంగ్రెస్ పార్టీని కాకుండా ఇతర పార్టీల అభ్యర్ధులను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉండవని రేవంత్ చెప్పారు
మున్సిపల్ ఎన్నికల సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ను ‘బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి’గా అభివర్ణించారు. భూపాలపల్లిలో జరిగిన ‘ప్రజాపాలన-ప్రగతిబాట’ కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతు రాజకీయ ప్రత్యర్ధులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు అన్నీ వర్గాలకు చెందిన వాళ్ళని బెదిరించి వేలకోట్ల రూపాయలు సంపాదించింది కాబట్టే భారత రాష్ట్ర సమతి, బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని అన్నారు. వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేయటం ద్వారా వాళ్ళ వ్యవహారాలన్నింటినీ తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయల విలువైన భూములను తక్కువ ధరకే కొట్టేశారని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని రేవంత్ అభ్యర్ధించారు. కౌన్సిలర్లుగా కాంగ్రెస్ పార్టీని కాకుండా ఇతర పార్టీల అభ్యర్ధులను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉండవని రేవంత్ చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందన్నారు. దేశానికి నాయకత్వం వహించిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈ ప్రాంతంనుండే వచ్చారని గుర్తుచేశాడు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలకపాత్రగా చెప్పాడు. సింగరేణి కార్మికుల ప్రత్యేకత ఏమిటో తెలంగాణ ఉద్యమంలో చూసినట్లు చెప్పాడు. భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పాడు.
జిల్లాలను రద్దుచేసే ఆలోచన తమకు లేదన్నాడు. జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ చేయాలంటే ప్రజలతో చర్చించిన తర్వాతే చేస్తామని హామీ ఇచ్చాడు. 2004-14 మధ్య 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళను కట్టించి ఇచ్చినట్లు రేవంత్ తెలిపాడు. గడచిన పదేళ్ళల్లో ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందా ? అని జనాలను రేవంత్ ప్రశ్నించాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకు మాత్రం ఫామ్ హౌస్ లు వచ్చాయని ఎద్దేవాచేశారు. కేసీఆర్ కు పేదల ఇళ్ళగురించి ఎలాంటి పట్టింపు లేదని విమర్శించాడు. డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ళున్న ఊరిలో ఓట్లన్నీ బీఆర్ఎస్ కు..ఇందిరమ్మ ఇళ్ళున్న ఊరిలో ఓట్లన్నీ కాంగ్రెస్ కు వేయాలని ఆనాడు తాను చెబితే ఓట్లన్నీ కాంగ్రెస్ కు గంపగుత్తగా పడ్డాయని రేవంత్ గుర్తుచేశాడు.
ఏప్రిల్ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు రెండో విడత ఇస్తామని ప్రకటించాడు. దక్షణి కుంభమేళాగా సమ్మక్క-సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహించినట్లు చెప్పాడు. బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రు.1500 కోట్లు తీసుకున్నట్లు ఆరోపించాడు. పాపాల ఊబిలో బీఆర్ఎస్ కూరుకుపోయిందన్నాడు. కాళేశ్వరం అవినీతి, ఫార్ములా ఈ కార్ రేసు కేసుల నుండి కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను కాపాడుతున్నది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాదా అని జనాలను ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించాడు. విచారణలు జరగకుండా, శిక్షలు పడకుండా పైముగ్గురిని కాపాడుతున్నాడు కాబట్టే కిషన్ రెడ్డిని తాను కల్వకుంట్ల కిషన్ రావుగా పిలుస్తున్నట్లు ఎద్దేవాచేశాడు. సర్వం త్యాగం చేసిన గాంధీకుటుంబీకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను వేధిస్తున్న కేంద్రప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబంపై విచారణలు చేసి కేసులు పెట్టి ఎందుకు అరెస్టులు చేయటంలేదని సూటిగా నిలదీశాడు. ఈ సభలో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

