
రేవంత్ దావోస్ ట్రిప్‌పై కవిత విసుర్లు
దావోస్ నుంచి వచ్చి పెట్టుబడుల ప్రచారం చేయడం తప్ప ఏమీ ఉండదంటూ చురకలు.
రేవంత్ రెడీ అవుతున్న దావోస్ ట్రిప్ ఒక దండగ పని అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చాక ప్రచారాలు తప్పితే పెట్టుబడులు ఉండవంటూ చురకలంటించారు. దావోస్ ట్రిప్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో రేవంత్ దావోస్ ట్రిప్ దండగ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దావోస్‌కు రేవంత్ వెళ్లడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదని, పైగా పోనూ, రానూ టికెట్ ఖర్చులు వృధా అంటూ కవిత ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘ఎక్కే విమానం - దిగే విమానం .. రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి సీఎం సార్. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో వచ్చినట్టు మీరు, మీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది’’ అని గుర్తు చేశారు.
‘‘మొన్నటికి మొన్న కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఊదరగొట్టారు. దావోస్ సమ్మిట్ లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో చేసుకున్న ఎంవోయూలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి.. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్తూ శ్వేతపత్రం విడుదల చేయండి’’ అని డిమాండ్ చేశారు.
దావోస్‌తో తెలంగాణ ధ్యేయాలు
జనవరి 20 నుంచి ప్రారంభం కానున్న దావోస్‌లో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రముఖ సంస్థల సీఈఓలు, అంర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్త్రృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి అనేక సంస్థ అధినేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

