
కాంగ్రెస్ పార్టీ ‘సార్ట్ క్యాంపెయినర్’ గా రేవంత్...
ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల్లో అధిష్ఠానం రేవంత్ కు కీలకమైన బాధ్యతలను అప్పగించింది
రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇపుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కత్తికి ఎదురులేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జాతీయ రాజకీయాల్లో రేవంత్ జోరు అందరికీ అర్ధమైపోతుంది. ఇపుడు విషయం ఏమిటంటే తొందరలో జరగబోతున్న ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల్లో అధిష్ఠానం రేవంత్ కు కీలకమైన బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే రేవంత్ అనేకసార్లు ‘ఇండియా కూటమి’ సమావేశాల్లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే.
తొందరలోనే కేరళ, తమిళనాడు, అస్సోం, గోవా రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయయి. ఈ రాష్ట్రాల్లో పార్టీ అధిష్ఠానం రేవంత్ ను స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు రేవంత్ కూడా పైన చెప్పిన రాష్ట్రాల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈమధ్యనే జరిగిన మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో కూడా రాహుల్, ప్రియాంకతో పాటు రేవంత్ కూడా ర్యాలీలు, రోడ్డుషోలు, బహిరంగసభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
అందుకనే తొందరలోనే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళ ఓట్లకోసం అధిష్ఠానం రేవంత్ ను తురుపుముక్కగా ఉపయోగించుకోబోతోంది. అస్సోం, గోవా, కేరళలో ఎంతమంది తెలుగువాళ్ళున్నారో సరైన లెక్కలు లేవుకాని తమిళనాడు, పాండిచ్చేరిలో మాత్రం తెలుగువాళ్ళు లక్షల్లో ఉంటారని అందరికీ తెలిసిందే. పై రాష్ట్రాలకు రేవంత్ క్యాంపెయినింగ్ కోసం ఎప్పుడు వెళతారు ? ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

