రేవంత్‌ది ప్రజా పాలన కాదు స్వార్థ పాలన: జీవన్
x

రేవంత్‌ది ప్రజా పాలన కాదు స్వార్థ పాలన: జీవన్

రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ టచ్, కాంగ్రెస్‌లో అసంతృప్తి, రాజకీయ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.


తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన కాదని, అది పూర్తిగా స్వార్థ ప్రయోజనాల పాలన అని వ్యాఖ్యానించారు. రేవంత్ తన అనుచరుల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. సొంత రాజకీయ కుంపటి నిర్మించుకున్నారని పేర్కొన్నారు. వేంనరేంద్ర రెడ్డికి రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

బీజేపీతో రేవంత్ సంప్రదింపులు

అంతేకాకుండా రేవంత్ రెడ్డి బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం కోల్పోయారని విమర్శించారు. ఆయన ఎక్కువ కాలం కాంగ్రెస్‌లో ఉండరని, భవిష్యత్తులో బీజేపీలో చేరే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఈ పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన రేవంత్‌కు రాజకీయంగా మధ్యవర్తిగా ఉన్నారని ఆరోపించారు. రేవంత్ తనను చంద్రబాబు కాపాడతాడని భ్రమలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి రాష్ట్రానికి శనిలా మారారని, ఆయన పాలనపై తీవ్ర అసంతృప్తి ఉందని కూడా జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా రెండేళ్లు కొనసాగుతారో లేదో చెప్పలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన కారణాన్ని కూడా జీవన్ రెడ్డి వివరించారు. పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని, అందుకే కాంగ్రెస్‌ను వదిలినట్లు తెలిపారు. ఎవరినీ తొక్కుకుంటూ రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.

మంత్రి పదవికి నేనే రాజీనామా చేశా: జీవన్

జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ఆయనకు, కండువా కప్పగానే ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నాదెండ్ల భాస్కరరావు విషయంలో రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయనకు మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు.

తాను స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. తన నిర్ణయం వ్యక్తిగతమని, ఆ రోజు ఇందిరా గాంధీ సహా మొత్తం కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. ఈ విషయాలు రేవంత్‌కు తెలియకపోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే ఏపీ నాయకుల ప్రభావంలో రేవంత్ పనిచేస్తున్నారని, పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. 2015లో వేంనరేంద్ర రెడ్డిని ఎమ్మెల్సీగా చేయాలన్న ప్రయత్నాల్లో రేవంత్ పాత్రపై కూడా పాత అంశాలను ప్రస్తావించారు.

Read More
Next Story