
సజ్జనార్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందా ?
ఆరోపణలకు ప్రవీణ్(RS Praveen kumar) రెండు రోజుల్లో ఆధారాలతో కూడిన సమాధానం ఇవ్వకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని కమిషనర్ హెచ్చరిక
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ప్రవీణ్ కు సజ్జనార్ నోటీసులు జారీచేశారు. తనపైన చేసిన ఆరోపణలకు ప్రవీణ్(RS Praveen kumar) రెండు రోజుల్లో ఆధారాలతో కూడిన సమాధానం ఇవ్వకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని కమిషనర్ నోటీసులో హెచ్చరించారు.
ఇంతకీ విషయం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. కేటీఆర్ ను విచారించిన సిట్ బృందానికి సజ్జనార్ చీఫ్ గా ఉన్నారు. ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారించటాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్యాపింగ్ విచారణ లోతుగా జరిగితే అగ్రనేతలంతా గట్టిగా ఇరుక్కుంటారనే ఆందోళన పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ముందు హరీష్ ను విచారించినపుడు తాజాగా కేటీఆర్ ను విచారించినపుడు కూడా నేతలు సిట్ అధికారులపై నోటికొచ్చినట్లు మాట్లాడారు.
నిజంగానే హరీష్, కేటీఆర్ కు ట్యాపింగ్ తో సంబంధాలు లేకపోతే ప్రశాంతంగానే ఉండచ్చు. కాని వాళ్ళు అలాకాకుండా సిట్ విచారణపై చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తు నేతలు, క్యాడర్ ను రెచ్చగొడుతున్నారు. వీళ్ళ ఆరోపణల్లోనే కేసు తాలూకు పర్యవసానాల భయం స్పష్టంగా బయటపడుతోంది. ఇందులో భాగంగానే సజ్జనార్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతు సిట్ చీఫ్ గా సజ్జనార్ పనికిరాడన్నారు. ఎందుకంటే సజ్జనార్ పైన ఏడు కేసులున్నట్లు ఆరోపించారు. 7 కేసులున్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా ఉంటారని ప్రవీణ్ ప్రశ్నించారు.
ప్రవీణ్ ఆరోపణలు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అందుకనే స్పందించిన సజ్జనార్ వెంటనే ప్రవీణ్ కు లీగల్ నోటీసులు జారీచేశారు. ట్యాపింగ్ కేసును పర్యవేక్షిస్తున్న సిట్ చీఫ్ గా తన ప్రతిష్టను దిగజార్చేలా ప్రవీణ్ ఆరోపణలు చేసినట్లు కమిషనర్ అభిప్రాయపడ్డారు. తనపైన చేసిన ఆరోపణలకు రెండురోజుల్లోగా పూర్తి వివరాలు ఇవ్వకపోతే క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తనపైన ఉన్న 7 క్రిమనల్ కేసుల నెంబర్లను, నమోదైన తేదీలు, విచారణ జరుపుతున్న కోర్టుల వివరాలు, ఎఫ్ఐఆర్ నెంబర్లను సమర్పించాల్సిందే అన్నారు.
నోటికొచ్చినట్లు ఏదిపడితే అది మాట్లాడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. రాజకీయ ఆరోపణలు వేరు, కచ్చితంగా కేసులున్నాయనే ఆరోపణలు వేరు. కేసులున్నాయి అన్నపుడు వాటి వివరాలను అందించాల్సుంటంది. అందించలేనపుడు ఇబ్బందులు తప్పవు. సజ్జనార్ నోటీసులకు ప్రవీణ్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. గతంలో ఐపీఎస్ అధికారిగా కూడా పనిచేసిన ప్రవీణ్ కు సజ్జనార్ గురించి తెలీకుండానే ఆరోపణలు చేసుంటారా ?
అధికారుల సంఘం ఖండన
పోలీసు అధికారులపై హరీష్, కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. విధులను సక్రమంగా నిర్విర్తిస్తున్న అధికారులను నేతలు టార్గెట్ చేయటం తగదని సంఘం ఘాటుగా స్పందించింది.

