
కేసీఆర్‌కు సీతక్క లీగల్ నోటీసులు, 48 గంటల గడువు
సోషల్ మీడియాలో దుష్ప్రచారం వివాదం, ఫోన్ కొనుగోలు ఆరోపణలపై మంత్రి చర్యలు, క్షమాపణ డిమాండ్, తదుపరి చర్యల హెచ్చరిక.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేశారు. తమమ సమాధానం ఇవ్వడానికి కేసీఆర్‌కు 48 గంటల గడువు ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నేపథ్యంలోనే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు సీతక్క స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించిన సీతక్క, ఫోన్ కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత పాటించామని స్పష్టం చేసినట్లు సమాచారం.
అంగన్‌వాడీలకు పంపిణీ చేసిన ఫోన్ల విషయంలో వివాదం మొదలైంది. ఒక్కో ఫోన్‌ను రూ.11,650కే కొనుగోలు చేశామని, ఇది సరైన ప్రక్రియలో జరిగినదేనని మంత్రి పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి కమీషన్లు తీసుకున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై స్పందించిన మంత్రి, ఈ ప్రచారం తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడ్డారు.
నోటీసుల్లో, బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ దుష్ప్రచారానికి బాధ్యత కేసీఆర్‌దేనని మంత్రి భావిస్తున్నట్లు వెల్లడైంది. 48 గంటల్లో పోస్టులు తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని నోటీసుల్లో హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వివాదం రాజకీయంగా మరింత చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
తమపై వచ్చిన ఆరోపణలపై సీతక్క ఘాటుగా స్పందించారు. అవినీతి అంటూ మాట్లాడితే “చెప్పు తెగుతుంది” జాగ్రత్త. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై స్కాం అంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్దేశించిన స్పెసిఫికేషన్స్, ధరల ప్రకారం ఓపెన్ టెండర్ ద్వారా GeM పోర్టల్‌లోనే కొనుగోలు చేశామని తెలిపారు.
తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఫోన్లను ఎక్కువ ధరగా చూపిస్తూ ఊహాజనిత కథనాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు ఇకపై తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

