
కేరళ ఎన్నికల రంగంలోకి శశి థరూర్ ఎంట్రీ..
ప్రచార కమిటీ సహ-చైర్మన్‌గా నియామకం..
రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రచార ఏర్పాట్లను వేగవంతం చేసింది. పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ప్రచార కమిటీ సహ-చైర్మన్‌గా నియమించడం ద్వారా ఆయనకు కీలక పాత్ర అప్పగించింది. రమేష్ చెన్నితల కమిటీ చైర్మన్‌గా ఉంటారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన కొద్ది రోజులకే థరూర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ తరఫున లోక్‌సభలో కూడా చురుకుగా మాట్లాడుతున్నారు.
కమిటీల ఏర్పాటు..
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ఆధ్వర్యంలో రెండు ముఖ్యమైన కమిటీలు - ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీలను పార్టీ ఏర్పాటు చేసింది. ఈ ప్రచార కమిటీల్లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. మేనిఫెస్టో కమిటీకి చైర్మన్‌గా బెన్నీ బెహనన్, సహ-చైర్మన్‌గా కోడిక్కున్నిల్ సురేష్ వ్యవహరిస్తారు.
అగ్రనేతలతో సమావేశం తర్వాత..
ఇటీవల కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో తనను పక్కన పెట్టారని భావించిన థరూర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అగ్రనేతలతో సమావేశం తర్వాత ఈ సమస్య పరిష్కారమైనట్లు కనిపిస్తోంది. దీంతో కేరళ ఎన్నికల ప్రచారంలో థరూర్ ప్రముఖంగా కనిపించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. ఈసారి వామపక్షాల నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్–మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముండటంతో.. దక్షిణాది రాష్ట్రంలో విజయం సాధించేందుకు పూర్తి స్థాయిలో పార్టీ సన్నద్ధమవుతోంది.

