రాజ్యసభకు నామినేషన్లు వేయబోతున్న సింఘ్వీ, వేం
x
Vem Narendar Reddy and Abhishek Manu Singhvi

రాజ్యసభకు నామినేషన్లు వేయబోతున్న సింఘ్వీ, వేం

నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావటంతో ఇద్దరూ కాసేపట్లో నామినేషన్లను అసెంబ్లీ సెక్రటేరియట్ కార్యాలయంలో దాఖలు చేయబోతున్నారు


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దల సభకు వెళ్ళే ఇద్దరు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు వేయబోతున్నారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ అధిష్ఠానం పై ఇద్దరినీ తెలంగాణలో రాజ్యసభ ఎంపీ అభ్యర్ధులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన రావటం, గురువారమే నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావటంతో ఇద్దరూ కాసేపట్లో నామినేషన్లను అసెంబ్లీ సెక్రటేరియట్ కార్యాలయంలో దాఖలు చేయబోతున్నారు. ఇద్దరి నామినేషన్లను ప్రతిపాదిస్తు చెరొకళ్ళకు పదేసి ఎంఎల్ఏలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇప్పటికే కేటాయించారు. దాని ప్రకారం పదేసిమంది ఎంఎల్ఏలు ఇద్దరిని ప్రతిపాదిస్తు సంతకాలు కూడా చేశారు.



సింఘ్వీకి ఇది రెన్యువల్ కాగా వేం మొదటిసారి రాజ్యసభకు నామినేట్ అవుతున్నారు. తెలంగాణ నుండి మొదటిసారి సింఘ్వీ 2024లో నామినేట్ అయ్యారు. మామూలుగా రాజ్యసభ ఎంపీల కాలపరిమితి 6 ఏళ్ళని అందరికీ తెలిసిందే. అయితే స్టాప్ గ్యాప్ గా మాత్రమే 2024లో సింఘ్వీని అధిష్ఠానం రాజ్యసభకు రెండేళ్ళ కాలపరిమితకి పంపింది. అప్పట్లో పూర్తికాలం ఎంపీగా పనిచేయలేకపోయారు కాబట్టే ఇపుడు అదే సింఘ్వీకి అధిష్ఠానం రెన్యువల్ ఇచ్చింది. రాజస్ధాన్ కు చెందిన సింఘ్వీ సుప్రింకోర్టులోని ప్రముఖ లాయర్లలో ఒకళ్ళన్న విషయం తెలిసిందే.

సింఘ్వీ నేపధ్యం

రాజస్ధాన్ జోధ్ పూర్ లో సింఘ్వీ 1959, ఫిబ్రవరి 24వ తేదీన పుట్టారు. చదువుకునే రోజుల నుండి సింఘ్వీకి కాంగ్రెస్ తో అనుబంధం ఏర్పడింది. యూత్ కాంగ్రెస్ లోను తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించారు. ఒకవైపు లాయర్ గా పనిచేస్తునే మరోవైపు పార్టీలో కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు 1997లో అడిషినల్ సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. పార్టీలో జాతీయస్ధాయిలో అధికార ప్రతినిధిగా కూడా చాలాకాలం పనిచేశారు. మొదటిసారి 2006లో రాజస్ధాన్ నుండి రాజ్యసభకు ఎంపికయ్యారు. తర్వాత పశ్చిమబెంగాల్ ఆ తర్వాత 2024లో తెలంగాణ నుండి ఎంపికయ్యారు. ఇపుడు మళ్ళీ రెన్యువల్ అవుతున్నారు. ఎంపీగా పార్లమెంటు కమిటీల్లో కీలక బాధ్యతల్లో పనిచేశారు.

వేం నేపధ్యం

ఉమ్మడి వరంగల్ కు చెందిన వేం నరేందర్ రెడ్డి చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చాలా పాపులర్. సోదరుడు వేం పురుషోత్తమరెడ్డితో కలిసి 1982లో టీడీపీలో చేరారు. తెలుగు రైతు రాష్ట్ర సహాయ కార్యదర్శిగాను, తర్వాత టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు. 2001లో నల్లబెల్లి జడ్పీటీసీగా పోటీచేసి ఓడిపోయారు. 2004లో మహబూబాబాద్ ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత 2010లో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. 2015 ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా పోటీచేసి ఓడిపోయారు.

2017లో రేవంత్ తో కలిసి వేం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుండి పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. రేవంత్ కు కుడిభుజంగా వేం పార్టీలో బాగా ప్రచారంలో ఉన్నారు. 2018,23 ఎన్నికల్లో అసెంబ్లీకి టికెట్ వచ్చినా వదులుకుని రేవంత్ కోసం ఎన్నికల్లో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రేవంత్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదాలో నియమితులయ్యారు. ఇపుడు మొదటిసారి రాజ్యసభ ఎంపీ అయ్యారు.

Read More
Next Story