
సంతోష్ పై గురిపెట్టిన సిట్
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ లో సిట్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేసింది
అనుకున్నట్లే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టెలిఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఫ్యామిలీకి ఉచ్చు బిగిస్తొంది. కేసీఆర్ మేనల్లుడు, రాజ్యసభ మాజీ ఎంపీ (BRS Santosh Rao)జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీచేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ లో సిట్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేసింది. (Telephone Tapping)ట్యాపింగ్ కేసును ఒక లాజికల్ ఎండ్ కు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) కొత్తగా సిట్-2 వేసిన విషయం తెలిసిందే. మొదటగా వేసిన సిట్ దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతోమందిని విచారించినా పెద్దగా పురోగతి కనబడలేదు. అందుకనే హైదరాబాద్ పోలీసు కమిషనర్(VC Sajjanar) వీసీ సజ్జనార్ నేతృత్వంలో సిట్-2ని ప్రభుత్వం నియమించింది.
సిట్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే సజ్జనార్ విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే మొదట హరీష్ రావును, తర్వాత కేటీఆర్ ను విచారించారు. రేపు సంతోష్ రావును విచారించబోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో సంతోష్ రావు కూడా చక్రంతిప్పాడనే ప్రచారం తెలిసిందే. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు నీడలాగ వ్యవహరించిన కారణంగానే ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలు మొత్తం సంతోష్ కు తెలీకుండా ఉండదు అనే భావనతోనే సిట్ విచారణకు నోటీసులు జారీచేసినట్లుంది. బీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత తన ఆరోపణలను హరీష్, సంతోష్ పైనే ఎక్కుబెడుతున్నారు. కాబట్టి ట్యాపింగ్ విషయం సంతోష్ కు తెలీకుండా ఉండదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయో చూడాలి.

