హరీష్ రావు సిట్ విచారణ ఎలా జరిగిందో తెలుసా !
x

హరీష్ రావు సిట్ విచారణ ఎలా జరిగిందో తెలుసా !

ఆధారాలు లేని మాటలు, అడిగిందే అడగడం, సొళ్లు తప్ప ఇంకేమీ లేదన్న హరీష్ రావు


మాజీ మంత్రి హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌లో జరిగిన ఈ విచారణలో అసలు హరీష్ రావును ఏం ప్రశ్నలు అడిగారు? ఈయన ఏం చెప్పారు? అన్నది ప్రస్తతం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. విచారణ అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ ఏమో.. తనను ఏ ప్రశ్నలు అడగలేదని, ఇంకా తానే ఎదురు ప్రశ్నలు అడిగానని చెప్పారు. ఆఖరికి తనను ప్రశ్నించడానికి అధికారుల దగ్గర ప్రశ్నలు కూడా లేవని అన్నారు. గంటకోసారి వారికి ఫోన్లు వస్తున్నాయని, వారు ఫోన్ పట్టుకుని బయకు పోయి అరగంటకు లోపలికి వచ్చి ఏవేవో ప్రశ్నలు అడిగారని హరీష్ రావు చెప్పారు. ఏడు గంటల పాటు సొళ్లు పురాణం తప్ప ఏమీ లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విచారణ ఏమీ లేదు..

‘‘ఏడు గంటల విచారణలో నన్ను అడిగిందేమీ లేదు. ఆధారాలు లేని మాటలు, అడిగిందే అడగడం, సొళ్లు తప్ప ఇంకేమీ లేదు. ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇదంతా కూడా ప్రజల దృష్టి మళ్లించడానికే. సైట్ విజిట్ పేరుతో జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. రేవంత్ బామ్మర్ది బాగోతాన్ని బట్టబయలు చేయగానే సాయంత్రానికే నాకు సిట్ నోటసులు పంపారు. దీనిని నేను అవమానంగా భావించను. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వాటాల పంపకం బయటకు వచ్చింది. దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానిక సిట్టు, లట్టు, పొట్టు లాంటి నోటీసులు ఇచ్చారు. మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాం’’ అని అన్నారు.

ఉద్యమాలు మాకు కొత్త కాదు

ఈ సందర్భంగా హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు ఉద్యమాలు కొత్త కాదని, పారిపోయే రాజకీయాలు తమవి కాదని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలోనూ ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఇచ్చే నోటీసులను గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ‘‘ఉదయం మీ బావమరిది బాగోతాన్ని బయటపెడితే, సాయంత్రం నాకు నోటీసులు ఇచ్చారు. ఇదే మీ పాలన తీరా?’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రేవంత్‌రెడ్డికి నిజంగా ధైర్యం ఉంటే నోటీసులు ఇవ్వడం కాదని, రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్‌ విసిరారు. ‘‘నీ దోపిడీకి అడ్డు వస్తున్నామని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని హరీశ్‌రావు హెచ్చరించారు.

‘విచారణ వీడియో మొత్తం బయటపెట్టాలి’

తన విచారణపై ప్రభుత్వం మీడియాకు లీకులు ఇస్తుందని ఆరోపించిన హరీశ్‌రావు, ధైర్యం ఉంటే తాను ఎదుర్కొన్న ప్రశ్నలు–సమాధానాలన్నింటినీ వీడియో రూపంలో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘‘చిల్లర లీకులు కాదు.. వీడియో మొత్తం విడుదల చేయాలి. ఈ నోటీసులు మమ్మల్ని కాదు, మీ పతనాన్ని వేగవంతం చేస్తాయి’’ అని మండిపడ్డారు.

విచారణలో తాను ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వలేదని, అధికారులకే వందల ప్రశ్నలు వేసినట్లు చెప్పారు. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లతో పాటు శివధర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలను విచారణకు పిలవాలని తాను డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌కు నాకేం సంబంధం? నేను హోం మంత్రిని కాదుకదా’’ అని వ్యాఖ్యానించారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

సైట్‌ విజిట్‌ సర్టిఫికేట్‌ పేరుతో జరిగిన కుంభకోణాన్ని తామే బట్టబయలు చేశామని హరీశ్‌రావు తెలిపారు. చీటికి మాటికి సిట్‌లు వేస్తున్న ప్రభుత్వం, నిజాయతీ ఉంటే ఈ కుంభకోణాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మంత్రుల మధ్య టెండర్ల వాటాల కోసం జరుగుతున్న పోటీ అంతా ప్రజలకు తెలిసిపోయిందన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా తనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కక్షపూరితంగా తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Read More
Next Story