
Sensation : టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
కేటీఆర్ కు తాజా నోటీసుతో ట్యాపింగ్ కేసులో సంచలనం జరగబోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి
టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో అనుకున్నంతా అయ్యింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శనివారం విచారణకు హాజరుకావాలని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్(SIT) శుక్రవారం నోటీసులు జారీచేసింది(Telephone Tapping). ట్యాపింగ్ కేసులో కేటీఆర్(KTR) పాత్రకూడా కీలకమే అని సిట్ అనుమానిస్తోంది. బుధవారమే పార్టీలో కీలక నేత తన్నీరు హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అప్పుడు హరీష్ హాజరైతే రేపు కేటీఆర్ వంతు. జూబ్లీహిల్స్ లోని పోలీసుస్టేషన్లో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో సిట్ స్పష్టంచేసింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ అయ్యాయి.
తనకు సిట్ నుండి నోటీసులు అందిన విషయాన్ని కేటీఆర్ అంగీకరించారు. తాను రేపటి విచారణకు హాజరవబోతున్నట్లు తెలిపారు. కేటీఆర్ కు తాజా నోటీసులో ట్యాపింగ్ కేసులో సంచలనం జరగబోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తమ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని గతంలో కేటీఆర్ ఒకసారి ఒప్పుకున్నారు. ప్రతి ప్రభుత్వంలోను ట్యాపింగ్ జరుగుతునే ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ప్రతి ప్రభుత్వంలోను ట్యాపింగ్ జరగటం వేరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్ వేరు. ఈ విషయాన్ని కేటీఆర్ అంగీకరించటంలేదు.
మావోయిస్టులు అన్న ముసుగు వేసి సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారాలు, జర్నలిస్టులు, రాజకీయ ప్రత్యర్ధులు, ఉన్నతాధికారులు, తమపార్టీలోనే అనుమానిత నేతలు, కూతురు కవిత, ఆమె భర్త అనీల్ కుమార్ తో పాటు చివరకు జడ్జీలు, వాళ్ళ కుటుంబసభ్యుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేయించారు. ట్యాపింగ్ బాధితుల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు. రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ లాంటి అనేక కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాపయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో వేలాది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించింది అని ఇప్పటికే అరెస్టయిన పోలీసు అధికారులు విచారణలో అంగీకరించారు. మరి రేపు కేటీఆర్ విచారణలో ఏమి జరుగుతుందో చూడాలి.

