
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు: అనర్హత కేసులో మలుపు
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులు మరో కీలక దశకు చేరాయి. తాజా పరిణామంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పీకర్ దశలవారీగా విచారణ చేపట్టారు. ఈ ప్రక్రియలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నట్లు స్పీకర్ గుర్తించారు.
అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్‌కు సంబంధించిన పిటిషన్లు అప్పటివరకు పెండింగ్‌లో కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందంటూ ఈ నెల 19న సుప్రీంకోర్టు స్పీకర్‌కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. పిటిషన్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ పరిణామాల తరువాత పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ముందుగా దానం నాగేందర్‌కు నోటీసులు జారీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్‌పై ఎంపీగా పోటీ చేసిన అంశం అనర్హత పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ తీసుకునే తదుపరి చర్యలు ఆసక్తిగా మారాయి. అనర్హత వేటు అవకాశం నేపథ్యంలో దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీసుకునే నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. ఈ కేసుల్లో జరిగే విచారణలు, తదుపరి పరిణామాలు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

