కడియంకు స్పీకర్ నోటీసులు.. రేపటి వరకే గడువు
x

కడియంకు స్పీకర్ నోటీసులు.. రేపటి వరకే గడువు

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.


ఫిరాయింపు నేతల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులిచ్చారు. బుధవారం విచారణకు హాజరుకావాలని నోటసుల్లో పేర్కొన్నారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద గెలిచి తర్వాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణను నిర్ణయించారు.

ఈ కేసులో ఫిర్యాదు చేసిన వివేకానందకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే విచారణకు రావాలని సూచించారు. విచారణ సమయంలో కడియం శ్రీహరి వాదనలు, వివేకానంద వాదనలు స్పీకర్‌ విననున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు స్పీకర్ ముందు వచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్‌ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇప్పుడు కడియం శ్రీహరి పిటిషన్‌పై విచారణ జరగనుంది. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఫిరాయింపు పిటిషన్లపై శాసనసభలో చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తదుపరి విచారణలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.

నేను పార్టీ మారలే: కడియం

అయితే పార్టీ ఫిరాయింపు అంశంపై సెప్టెంబర్ 2025లోనే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారలేదని, కేవలం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని అన్నారు. అది కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని వివరించారు. తననియోజకవర్గానికి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి తాను పనిచేస్తున్నట్లు స్పష్టంచేశారు. దేవాదుల కాల్వలు బాగుచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి రేవంత్ అండగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి రేవంత్ నిధులు అందించినట్లు కూడా కడియం తెలిపారు. బీఆర్ఎస్ లో నుండి తాను కాంగ్రెస్ లోకి ఫిరాయించాను అని కడియం స్పష్టంగా చెప్పలేదు. కాకపోతే నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఉపఎన్నిక వచ్చినా గెలుపు నాదే

అంతేకాకుండా ఒకవేళ స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక వస్తే అన్న అంవంపై కూడా కడియం గతంలో స్పందించారు. ఉపఎన్నిక జరిగితే అందులో కూడా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఉప ఎన్నికలు వచ్చిన పక్షంలో కచ్చితంగా మళ్లీ పోటీ చేస్తా నేనే గెలుస్తా’’ అని గతేడాది నవంబర్‌లో వెల్లడించారు. ‘‘స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి పెద్దఎత్తున అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. కడియం శ్రీహరి ఎవ్వరికి భయపడడు’’ అని అన్నారు.

Read More
Next Story