
ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో సుప్రింకోర్టు సీరియస్
రెండువారాల్లోపు ఫిరాయింపు ఎంఎల్ఏలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఆ పనేదో తానే చేస్తానని సుప్రింకోర్టు సీరియస్ గానే చెప్పేసింది
ఫిరాయింపు ఎంఎల్ఏలపై నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ వైఖరిపైన సుప్రింకోర్టు శుక్రవారం చాలా సీరియస్ అయ్యింది. రెండువారాల్లోపు ఫిరాయింపు ఎంఎల్ఏలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఆ పనేదో తానే చేస్తానని సుప్రింకోర్టు సీరియస్ గానే చెప్పేసింది. ఎంఎల్ఏల అనర్హత విషయమై నిర్ణయం తీసుకునేందుకు ఇప్పటికే స్పీకర్ కు కావాల్సినంత సమయం ఇచ్చినట్లు గుర్తుచేసింది. చివరగా మరో రెండువారాలు గడువు ఇస్తున్నట్లు కోర్టు స్పష్టంచేసింది.
ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో స్పీకర్ విచారణ తీరుతెన్నులపై ఈరోజు సుప్రింకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ తరపున అభిషేక్ మను సింఘ్వీ, బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి తరపున దామోదర్ నాయుడు వాదనలు వినిపించారు. సింఘ్వీ మాట్లాడుతు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు మరో నాలుగువారాల గడువు కావాలని కోరారు. కంటికి ఆపరేషన్ చేయించుకున్న కారణంగా ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు మరింత సమయం అవసరమైందని చెప్పారు. అయితే సింఘ్వీ వాదలను నాయుడు వ్యతిరేకించారు. ఫిరాయింపులపై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేందుకు ఇప్పటికే స్పీకర్ కావాల్సినంత సమయం తీసుకున్నట్లు ధర్మాసనానికి గుర్తుచేశారు.
బీఆర్ఎస్ లాయర్ అభ్యంతరం
ఇప్పటికే చాలా కాలంగా విచారణ పేరుతో జాప్యం జరుగుతున్న కారణంగా ఎట్టి పరిస్ధితుల్లోను స్పీకర్ కు సమయం ఇచ్చేందుకు లేదని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ నేపధ్యంలోనే నాయుడు వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం స్పీకర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ తాత్సారం చేస్తున్నారన్న నాయుడు వాదనలతో ఏకీభవిస్తున్నట్లే వ్యాఖ్యానించింది. ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకుని స్పీకర్ ఇప్పటికే ఏడుగురు ఎంఎల్ఏల విషయంలో తీర్పు చెప్పిన విషయాన్ని ధర్మాసనానికి గుర్తుచేశారు. విచారణ చేయాల్సింది ఇక ముగ్గురు ఎంఎల్ఏల విషయంలో మాత్రమేనని అందుకనే నాలుగు వారాల సమయం కోరినట్లు చెప్పారు. కంటి చికిత్స నుండి కోలుకోగానే స్పీకర్ ముగ్గురు ఎంఎల్ఏల విచారణను కూడా పూర్తిచేసి నిర్ణయాన్ని ప్రకటిస్తారని సింఘ్వీ చెప్పారు.
చివరకు సింఘ్వీ వాదనలతో కన్వీన్స్ అయిన ధర్మాసనం రెండువారాలు మాత్రమే గడువిస్తున్నట్లు చెప్పింది. రెండు వారాల తర్వాత విచారణలో పురోగతిని చూసిన తర్వాత అదనంగా రెండు వారాల గడువిచ్చే విషయమై ఆలోచిస్తామని చెప్పి విచారణను రెండువారాలు వాయిదా వేసింది.
ఏడుగురికి క్లీన్ చిట్
ఇప్పటికే విచారణను పూర్తిచేసిన స్పీకర్ ఏడుగురు ఎంఎల్ఏలకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ, చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ టీ ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పార్టీలోనే ఉన్నారని కాంగ్రెస్ లోకి ఫిరాయించారనేందుకు బీఆర్ఎస్ ఆధారాలను చూపించలేకపోయిందని స్పీకర్ తీర్పిచ్చారు. ఇక మిగిలిన ముగ్గురు ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, జగిత్యాల్ ఎంఎల్ఏ సంజయ్ కుమార్ విషయంలోనే స్పీకర్ నిర్ణయం ప్రకటించాల్సుంది. వీరిలో కూడా స్పీకర్ విచారణకు సంజయ్ హాజరై తన వాదనలను వినిపించారు. దానం, కడియం మాత్రమే ఇప్పటివరకు స్పీకర్ విచారణకు హాజరుకాలేదు. స్పీకర్ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏదో కారణంచెప్పి పై ఇద్దరు ఎంఎల్ఏలు విచారణకు గైర్హాజరవుతునే ఉన్నారు.
మరి సుప్రికోర్టు తాజా ఆగ్రహం కారణంగా దానం, కడియం, సంజయ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఈ ముగ్గురిలో కూడా దానం, కడియంపైన అనర్హత వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దానం బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటూనే సికింద్రాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంఎల్ఏగా పోటీచేసిన కడియం కావ్యకు ప్రపోజర్ల సంతకాల్లో కడియం శ్రీహరి కూడా సంతకం చేశారు. కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసిన కూతురు కావ్యకు బీఆర్ఎస్ ఎంఎల్ఏగా శ్రీహరి ఎలాగ సంతకం చేస్తారు ? ఈ రెండు కారణాలతోనే దానం, కడియంపై వేటు తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. మరి సంజయ్ విషయంలోనే స్పీకర్ నిర్ణయం ఆసక్తిగా మారింది. రెండువారాల్లోపు స్పీకర్ పై ముగ్గురి విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

