స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం కోర్టు నోటీసులు
x

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్‌తో ఫిరాయింపు నేతల విషయంలో కీలక పరిణామం.


తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారరు. దానిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే గడ్డం ప్రసాద్‌కు నోటీసులు జారీ చేసింది.

పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం స్పీకర్ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను బీఆర్‌ఎస్ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి విచారించాలని నిర్ణయించింది. అన్ని పిటిషన్లపై సమగ్ర విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీరుపై గత వారం సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలలో చివరి ముగ్గురికి సంబంధించిన పిటిషన్లపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేస్తూ రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేసింది.

ఈ అంశంపై ఎనిమిది వారాల గడువు ఇవ్వాలన్న స్పీకర్ కార్యాలయ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటివరకు జరిగిన పురోగతి, తీసుకోబోయే నిర్ణయాలపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

విచారణ సమయంలో తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ మను సింఘ్వీ, నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. స్పీకర్ కంటి శస్త్రచికిత్స, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మార్పు, సమావేశాల కారణంగా జాప్యం జరిగిందని వివరించారు. ఇప్పటికే కొన్ని అంశాలపై పరిష్కారం చూపామని, మిగిలిన వాటికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. రెండు వారాల్లో పురోగతి కనిపిస్తే నాలుగు వారాల గడువు ఇస్తామని కోర్టు స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.

Read More
Next Story