కేసీఆర్ పై రేవంత్ టార్గెట్ ఇదేనా ?
x
Revanth and KCR

కేసీఆర్ పై రేవంత్ టార్గెట్ ఇదేనా ?

తాజాతీర్పుతో ఫిరాయింపులపై అనర్హత వేటు లేదు, ఉపఎన్నికలు లేవు, బీఆర్ఎస్ గెలిచేది లేదన్న విషయం అర్ధమైపోయింది.


పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలపై సుప్రింకోర్టు అనర్హత వేటు వేస్తుంది..పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు తప్పవు..మొత్తం అన్నీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేస్తుంది..రేవంత్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది..ఇలాంటి మాటలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ని వందలసార్లు చెప్పుంటారో లెక్కేలేదు. అఫ్ కోర్స్ తన మాటలను నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పేందుకు లేదు. ఇదంతా ఎందుకంటే ఫిరాయింపులపై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినా సుప్రింకోర్టులో పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల పనిబడతాం అంటు కేటీఆర్, హరీష్ రావు, కొందరు ఎంఎల్ఏలు నానా రచ్చ చేశారు. తీరా ఏమైంది ? ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై బీఆర్ఎస్ వేసిన కేసులను సుప్రింకోర్టు గురువారం కొట్టేసింది. తాజాతీర్పుతో ఫిరాయింపులపై అనర్హత వేటు లేదు, ఉపఎన్నికలు లేవు, బీఆర్ఎస్ గెలిచేది లేదన్న విషయం అర్ధమైపోయింది.

కేసును సుప్రింకోర్టు ఎందుకు కొట్టేసింది అంటే ఫిరాయింపు ఎంఎల్ఏల మీద తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పిచ్చేసిన తర్వాత ఇక తాము విచారించేది ఏముంటుంది ? అని కేసులను కొట్టేసింది. కోర్టు తీర్పుతో ఏమైందంటే బీఆర్ఎస్ పరువుకాస్త పోయింది. తాము అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఏ ఫిరాయింపులను అయితే ప్రోత్సహించారో ఇపుడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా అచ్చంగా అదే గేమ్ ఆడుతున్నాడు. అందుకనే ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేకుండా పోయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్, టీడీపీల నుండి 23 మంది ఎంఎల్ఏలు, 18మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను లాగేసుకున్నారు కేసీఆర్. అప్పట్లో కేసీఆర్ ఫిరాయింపు రాజకీయం దెబ్బకు కాంగ్రెస్, టీడీపీలు విలవిల్లాడాయి.

2023 ఎన్నికల్లో ఓడిపోయి బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే అదే ఫిరాయింపు రాజకీయాలను అమల్లోకి తెచ్చిన రేవంత్ దెబ్బకు బీఆర్ఎస్ విలవిల్లాడుతోంది. స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ తో పాటు సుప్రింకోర్టు కూడా కేసులను కొట్టేయటంతో తొందరలోనే మరిన్ని ఫిరాయింపులు ఊపందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకపుడు మంచిజోరుమీదున్న ఫిరాయింపు రాజకీయాలకు సుప్రింకోర్టులో కేసు విచారణ కారణంగా బ్రేకులుపడ్డాయి. ఇపుడు బీఆర్ఎస్ వేసిన కేసులను సుప్రింకోర్టు కొట్టేయటంతో మళ్ళీ ఎంఎల్ఏల ఫిరాయింపులు జోరందుకునే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

తాజా పరిణామాలతో బీఆర్ఎస్ మరింతగా గింజుకోక తప్పదని అనిపిస్తోంది. ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ దాఖలుచేసిన కేసులను సుప్రింకోర్టు కొట్టేయటంతో రేవంత్ రాజకీయానికి మరింత బలం ఇచ్చినట్లవుతుంది. దాంతో యధేచ్చగా రేవంత్ మరిన్ని ఫిరాయింపులకు తెరలేపే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించే ఆలోచన ఉన్న ఎంఎల్ఏలు సుప్రింకోర్టు విచారణ కారణంగా వెనక్కుతగ్గినట్లున్నారు. కోర్టు విచారణలో ఏమిచెబుతుందో చూసి తర్వాత ఏంచేయాలో నిర్ణయించుకుందామని ఆగిపోయారు. అలాంటిది ఇపుడు ఫిరాయింపులకు వ్యతిరేకంగా దాఖలైన కేసులను సుప్రింకోర్టు కొట్టేయటంతో ఫిరాయింపు ఆలోచనలు ఉన్న ఎంఎల్ఏలకు ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది అనటంలో సందేహంలేదు.

ఇకపైన ఫిరాయించే ఎంఎల్ఏలకు వ్యతిరేకంగా కేసులు వేయాలన్నా బీఆర్ఎస్ కు కూడా ఏమంత ఇంట్రస్టు ఉంటుంది ? కేసులు వేసినా కోర్టు కొట్టేయదు అన్న గ్యారెంటీ ఏమీలేదు. ఇపుడు కేసులు వేసి పరువును సాంతం పోగొట్టుకున్నది. కాబట్టి ఎంతమంది ఎంఎల్ఏలు ఫిరాయించినా పట్టించుకోనట్లుగా ఉన్నా ఆశ్చర్యంలేదు. కాబట్టి తొందరలోనే మరింతమంది ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించి కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత అన్న క్యాబినెట్ హోదాను ఊడగొట్టడమే లక్ష్యంగా రేవంత్ చెలరేగిపోవటానికే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story