
పరకాలలో సుస్మిత ‘టికెట్’ చిచ్చు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో పోటీచేయబోయేది, గెలిచేది కూడా తానే అని బుధవారం ప్రకటించారు
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఇంతే. ఏదో విషయంలో వివాదాలు రేపనిది పార్టీ నేతలకు నిద్రపట్టదు. సుస్మితాపటేల్ చేసిన తాజా ప్రకటనను కూడా ఇలాగే చూడాలి. ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో పోటీచేయబోయేది, గెలిచేది కూడా తానే అని బుధవారం ప్రకటించారు. గీసుకొండ మండలంలో కొమ్మాల జాతరలో పాల్గొన్న సుస్మిత పై ప్రకటన చేశారు. నిజానికి ఇపుడీ ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళుంది. ఈమూడేళ్ళల్లో ఎప్పుడేమవుతుందో కూడా ఎవరు చెప్పలేరు. అలాంటిది మూడేళ్ళ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీగురించి ఇపుడే పోటీచేస్తాననే ప్రకటన చేయటం అంటే కావాలని నియోజకవర్గంలో చిచ్చు రేపటంకాక మరేమిటి ?
పరకాల నియోజకవర్గంలో ఇపుడు రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏ రేవూరిని కాదని వేరేవారికి టికెట్ దక్కేది అనుమానమే. అయితే టికెట్ ఆశిస్తున్న సుస్మిత మామూలు వ్యక్తికాదు. ఈమె దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ కూతురు. సురేఖ ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం ఎంఎల్ఏ. ఈమె భర్త కొండా మురళి మాజీ ఎంఎల్సీ. తల్లి, దండ్రుల బలమైన బ్యాకప్ ఉంది కాబట్టే పరకాల నియోజకవర్గంలో పోటీగురించి సుస్మిత తరచూ ఏదో ఒక ప్రకటన చేస్తునే ఉన్నది. దీంతో ఎంఎల్ఏ రేవూరితో పాటు ఆయన వర్గం తీవ్రంగా మండిపోతోంది. ఎంఎల్ఏగా తాను ప్రతినిధ్యం వహిస్తుండగా సుస్మిత ఎలాగ పోటీచేస్తుందని రేవూరి ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంఎల్ఏని సుస్మిత ఏమాత్రం లెక్కచేయటంలేదు. మంత్రి వ్యతిరేక గ్రూపులో రేవూరి ఉండటమే అసలైన సమస్య.
కూతురు ప్రకటనపై తల్లి, మంత్రి సురేఖ మాట్లాడుతు రాజకీయాల్లో ఎంట్రీతో పాటు ఎక్కడనుండి పోటీచేయాలనే స్వేచ్చ తన కూతురికి ఉందన్నారు. అలాగే తండ్రి, మాజీ ఎంఎల్సీ కొండా మురళి మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పరకాల నుండి తన కూతురిని పోటీచేయించటమే కాకుండా గెలిపిస్తానని ప్రకటించారు. దీంతో పరకాల నియోజకవర్గంలోని రేవూరి వర్గం భగ్గుమంటోంది. 2021లో టీడీపీలో నుండి ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు రేవంత్ తో పాటు టీడీపీలో నుండి కీలకమైన నేతలు వేం నరేందర్ రెడ్డి, సీతక్క లాంటి వారితో రేవూరి కూడా కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరేటపుడే వీరంతా ఎంఎల్ఏ టికెట్ల హామీతోనే వచ్చారు.
ఈ విషయాలన్నీ కొండా సురేఖకు తెలీందికాదు. తెలిసినా సరే ఏదో పద్దతిలో పరకాల నియోజకవర్గంలో అశాంతిని రేకెత్తించి రేవూరిని తప్పించి తన కూతురికి టికెట్ ఇప్పించుకోవాలన్నది మంత్రి దంపతుల ప్రయత్నాలు. తాను పోటీచేస్తాను, గెలుస్తాను అని సుస్మిత ప్రకటించుకున్నా, తమ కూతురిని గెలిపిస్తామని మంత్రి దంపతులు ప్రకటించినా రేవూరికి వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే టికెట్లు ఖరారుచేసేది ఢిల్లీలోని అధిష్ఠానం కాబట్టి. అయితే టికెట్ కోసం తనకు బలమైన మద్దతున్న సుస్మిత పోటీ పడుతోందంటే కచ్చితంగా రేవూరిని కలవరపెట్టే అంశమే అనటంలో సందేహంలేదు.
తమ కూతురు రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని, పోటీ చేయించి గెలిపించాలని మంత్రి దంపతులకు కోరిక అంతబలంగా ఉండటంలో తప్పులేదు. అందుకని వేరే నియోజకవర్గంలో చిచ్చుపెట్టాల్సిన అవసరం ఎంతమాత్రంలేదు. కూతురి రాజకీయ ప్రవేశంపై అంత ఆసక్తిగా ఉంటే సురేఖ తాను పోటీచేస్తున్న వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో పోటీనుండి తప్పుకోవచ్చు. రాబోయే ఎన్నికల్లో తనకు బదులు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంనుండి తన కూతురునే పోటీచేయించి, గెలిపించుకోవచ్చు. అప్పుడు ఏనియోజకవర్గంలోను గొడవలుండవు. అలాకాకుండా తాను పోటీచేయటంతో పాటు తన కూతురుకి కూడా టికెట్ ఇవ్వాలని మంత్రి దంపతులు ప్రకటనలు చేస్తుండటమే వివాదానికి మూలకారణంగా మారింది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

