అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎంఎల్ఏల సస్పెన్షన్
x
BRS MLAs suspended

అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎంఎల్ఏల సస్పెన్షన్

సమావేశాలు సజావుగా సాగకుండా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అడ్డుపడుతున్నారన్న కారణంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పదకొండుమంది సభ్యులను రెండురోజుల పాటు సభనుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు


తెలంగాణ అసెంబ్లీ నుండి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు చెందిన 11 మంది ఎంఎల్ఏలు సస్పెండ్ అయ్యారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగకుండా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పదేపదే అడ్డుపడుతున్నారన్న కారణంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పదకొండుమంది సభ్యులను రెండురోజుల పాటు సభనుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచనల ప్రకారం పదకొండుమంది సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్, సబితారెడ్డి, చింతా ప్రభాకర్, కొత్తా ప్రభాకర్, పద్మారావ్, మాదవరం కృష్ణారావు, గూడెం మహిపాల్ రెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డిలను సస్పెండ్ చేశారు. అలాగే సభలో కడియంశ్రీహరి పట్ల అనుచితంగా వ్యవహరించాడన్న కారణంగా పాడి కౌశిక్ రెడ్డిపై యాక్షన్ తీసుకునే విషయాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తు స్పీకర్ ప్రకటించారు.

ఈరోజు, రేపు సభనుండి సస్పెండ్ అయ్యారు అంటే ఇక ఈ సమావేశాల్లో సస్పెండ్ అయిన సభ్యులు పాల్గొనే అవకాశంలేదు. ఎందుకంటే సమావేశాలు 30వ తేదీతో ఆఖరన్న విషయం అందరికీ తెలిసిందే. శనివారం, ఆదివారం సభలో అక్రమమైనింగ్, భూకుంభకోణాల అంశాలు కుదిపేశాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు అక్రమమైనింగ్ కు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ సభ్యులు శనివారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజాలు నిగ్గుతేల్చేందుకు హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీళ్ళ ఆరోపణలకు, డిమాండుకు అధికారపక్షం నుండి అంతే ఘాటుగా ప్రత్యారోపణలు ఎదురయ్యాయి.

ఇక, ఆదివారం సభ మొదలైనప్పటినుండి భూకుంభకోణంపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దిరిల్లిపోయింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూకుంభకోణాలపై హౌస్ కమిటీ వేద్దామన్న రేవంత్ సూచనకు బీఆర్ఎస్ నుండి సమాధానం రాలేదు. దాంతో అక్రమమైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ ఒకవైపు, భూకుంభకోణాలపై హౌస్ కమిటీ వేయాలన్న రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏల డిమాండ్లు మరోవైపు సభలో పెద్ద దుమారాన్ని రేపాయి.

ఈ నేపధ్యంలోనే రేవంత్, మంత్రుల ప్రసంగాలకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పదేపదే అడ్డుతగిలారు. అందుకనే సభను సజావుగా జరగనీయకుండా అడ్డుతగులుతున్న కారణంగా బీఆర్ఎస్ లోని 11మంది ఎంఎల్ఏలను రెండురోజులు సస్పెండ్ చేయాలన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ సూచనకు స్పీకర్ స్పందించి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Read More
Next Story