తమిళనాడు: తొలి జాబితాను విడుదల చేసిన అన్నాడీఎంకే
x
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళని స్వామి

తమిళనాడు: తొలి జాబితాను విడుదల చేసిన అన్నాడీఎంకే

ఎన్డీఏలో సీట్ల పంపకం ఖరారు, 178 సీట్లలో పోటీ చేయనున్న ఏఐఏడీఎంకే


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలో బిజిబిజీగా గడుపుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష అన్నాడీఎంకే తొలి జాబితాలను ప్రకటించింది. 23 మంది అభ్యర్థులకు తొలి దశలో సీట్ల కేటాయింపు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, సేలం జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడి నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు.

ఏఐఏడీఎంకే నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) సోమవారం (మార్చి 23) తన సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఏఐఏడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 27, పీఎంకే 18, ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేస్తాయి.

తొలి జాబితాలో 23 మంది అభ్యర్థులు

తొలి జాబితాలో, ఏఐఏడీఎంకే తన అగ్ర నాయకులైన కేపీ మునుస్వామి, దిండిగల్ సి శ్రీనివాసన్, ఆర్‌బీ ఉదయకుమార్, నాతం ఆర్ విశ్వనాథన్‌లను తిరిగి అదే స్థానాలలో పోటీకి నిలిపింది. పశ్చిమ ప్రాంతంలోని ప్రముఖ నాయకులైన ఎస్పీ వేలుమణి, పి. తంగమణిలను తొండముత్తూరు, కుమారపాలయం నుంచి బరిలోకి దించింది.
ఉప ప్రధాన కార్యదర్శి కేపీ మునుస్వామి వెప్పనహళ్లి నుంచి, కోశాధికారి సి. శ్రీనివాసన్ దిండిగల్ నుంచి, మాజీ మంత్రి సి.వి. షణ్ముగం మాత్రం విల్లుపురం నుంచి మైలంకు మారారు. పార్టీ సీనియర్ నాయకులు తమ కంచుకోటలను నిలుపుకున్నారు - ఎస్పీ వేలుమణి (తొండముత్తూరు), డి. జయకుమార్ (రాయపురం), సెల్లూరు కె. రాజు (మదురై వెస్ట్), సి. విజయభాస్కర్ (వీరలిమలై) ఈ జాబితాలో ఉన్నారు.
జాబితా విడుదల అనంతరం పళని స్వామి మాట్లాడారు. ఎన్డీఏలో అన్ని పార్టీలకు మంచి బాండింగ్ ఉందని, కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలలో కనీసం 210 స్థానాలను తమ కూటమి గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "కూటమి గెలుస్తుంది, ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది," అని ఆయన జోస్యం చెప్పారు.
తమిళ జాతీయవాద పార్టీ అయిన ఎన్‌టికె ఇప్పటికే మొత్తం 234 స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే పేరు పొందిన పార్టీలలో మాత్రం తొలి జాబితాను విడుదల చేసింది అన్నాడీఎంకేనే.
ఎన్నికల హామీలు
మంగళవారం, ఏఐఏడీఎంకే రాబోయే ఎన్నికల కోసం 297 హామీలతో కూడిన సమగ్ర మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే, బియ్యం కేటగిరీ ఉన్న రేషన్ కార్డుదారులకు ఉచితంగా రిఫ్రిజిరేటర్లు ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది.
బియ్యం రేషన్ కార్డుదారులకు ఒక కిలో పప్పు, ఒక లీటరు వంట నూనెను ఉచితంగా ఇస్తామని, అలాగే పన్ను భారం, ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి ప్రతి కుటుంబానికి ఒకేసారి రూ.10,000 గ్రాంటు ఇస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు.
ఫిబ్రవరిలో, పార్టీ దివంగత నాయకురాలు జె. జయలలిత పుట్టినరోజు సందర్భంగా, పళనిస్వామి నెలవారీ నిరుద్యోగ భృతి, చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఉపశమనం, పొంగల్ నగదు బోనస్, చేనేత కార్మికులకు పెరిగిన ఉచిత విద్యుత్, వీధి వ్యాపారులకు రుణమాఫీతో సహా పలు సంక్షేమ హామీలను ప్రకటించారు.
Read More
Next Story