మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిది ఏడ్వాలో, నవ్వాలో తెలియని పరిస్థితి
x

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిది ఏడ్వాలో, నవ్వాలో తెలియని పరిస్థితి

పార్టీకి దండిగా ఎమ్మెల్యేలు, ఎంపిలున్నా వాళ్ల ప్రభావం మునిసిపల్ ఎన్నికల్లో పెద్దగ కనిపించలేదు


తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ల కు సంబంధించి భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధించినట్లే లెక్క. ఇది 2020 లో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో పోల్చుకుంటేనే. ఆ పోలిక ఇపుడు పనికిరాదు. నాటికి నేటికి రాజకీయాలు చాలా మారిపోయాయి. ఒక అసెంబ్లీ ఎన్నిక, ఒక పార్లమెంటు ఎన్నిక జరిగింది. బిజెపి దూకుడు చూపింది. ఈ దూకుడు ఇపుడు ఏమయింది? ఇదే ప్రశ్న.

2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈ బిజెపి సృష్టించిన హోరును చూస్తే ఈ ఎన్నికలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.పార్టీకి ఎనిమిది ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉన్నారు. కేంద్రం లో ప్రభుత్వం ఉంది. చూపించుకునేందుకు ప్రధాని మోదీ బొమ్మ ఉంది. చెప్పుకునేందుకు బోలెడు కేంద్ర ప్రభుత్వ పథకాలున్నాయి. అయినా సరే, దీనితో పోలిస్తే, బిజెపి పనితీరు అంత గొప్పగా లేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి కొంత పరువు మిగిలింది. ఎందుకంటే, రెండు చోట్ల గౌరవ ప్రదమయిన స్థాయిలో డివిజన్లు గెలిచింది. మొత్తం ఏడు మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండింటిలో అంటే కరీంనగర్, నిజామాబాద్ లలో బిజెపి అధిక్యత సాధించింది. ఈ కార్పొరేషన్లను కైవసం చేసుకునే అవకాశాలు మెరుగుపడాయి. ఏడింటిలో ఒక్కటిలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ ఎస్ గెల్చుకోలేకపోవడం విచిత్రం. బిఆర్ ఎస్ కంటే మేలు అనేది పార్టీకి గర్వకారణం. అయితే, మునిసిపల్ కౌన్సిళ్లలో పనితీరు బాగా లేదు. అందుకే ఈ పార్టీని ఈ ఎన్నికల్లో నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి.

ఉత్తర తెలంగాణలో కీలకమయిన కరీంనగర్‌ కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అతి పెద్ద పార్టీ గా ఎన్నియింది. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పీఠాన్ని కేవసం చేసుకోవడం బిజెపికి చాలా అవసరం. ఎందుకంటే, ఈ పార్లమెంటు సీటు నుంచే బండి సంజయ్ గెలుపొందారు. ఆయన కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రి అయ్యారు. కాబట్టి ఈ కార్పొరేషన్ ను గెలుచుకోవడం కాషాయా పార్టీకి సంస్థాగతంగా, బండి సంజయ్ కు వ్యక్తిగతం అవసరం అదే దృష్టితోనే ఆయన క్యాంపెయిన్ చేశారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు వచ్చినా ఆయన క్యాంపెయిన్ లోనే ఉండిపోయారు. అనుకున్నట్లుగానే బండి సంజయ్‌ సత్తా చాటారు. ఇంతకు ముందు ఈ కార్పొరేషన్ లో 13 స్థానాలకే పరిమితమైన పార్టీని ఆయన ఈసారి 30స్థానాలకు తీసుకువచ్చారు.

కాని కరీంనగర్ మేయర్ పదవి పొందేందుకు అవసరమయిన బలగం రాలేదు. కార్పొరేషన్ లో 66 స్థానాలున్నాయి. మేయర్ పోస్టు గెల్చుకోవాలంటే, 34 స్థానాలు అవసరం. ఈ కార్పొరేషన్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులుదక్కించుకోవాలంటే 34 స్థానాలు కావాల్సి ఉంది.

అయితే, ఫిరాయింపులు ఈ పార్టీని ఆదుకుంటాయి. ఈ ఎన్నికల్లో ఐదురుగు బిజెపి రెబెల్స్ పోటీ చేసి గెలిచారు. వాళ్లు తమ పార్టీ కే సపోర్టు చేస్తారని బిజెపి సీనియర్ నాయకుడొకరు చెప్పారు. “వారంతా పార్టీకి విధేయులే. కాబట్టి పార్టీ కి తిరిగివస్తారు,”అని ఆయన చెప్పారు. ఈ వార్త రాస్తున్నప్పటికి మార్పులు బిజెపికి అనుకూలంగా మారుతున్నాయి.

ఫలితాలు వెలువడిన వెంటనే 13వ డివిజన్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన తెేల్ల లక్ష్మీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోట చేసి గెలిచిన విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. వీరిద్దరూ కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

ఆ తరువాత కొద్దిసేపటికే ఇద్దరు బీజేపీ రెబల్ కార్పొరేటర్లు, మరో ఇండిపెండెంట్ సైతం బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో బీజేపీ సంఖ్య 35కు చేరుకుంది.

కరీంనగర్ గెల్వడం ‘బండి’కి అవసరం

వాస్తవానికి కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేటర్ల సంఖ్య 66. వీరితోపాటు స్థానిక ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్(బీఆర్ఎస్) కవ్వంపల్లి సత్యనారాయణ(కాంగ్రెస్), ఎంపీ బండి సంజయ్ (బీజేపీ) ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. దీంతో బిజెపి మొత్తం సభ్యుల సంఖ్య 39 కి చేరనుంది. “ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 35 కావాలి. బీజేపీ ఇప్పటికే 35కు చేరుకుంది. అవసరమైతే మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య సైతం అవసరమైన పక్షంలో ఎక్స్ అఫీఫియో సభ్యులుగా చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ అవసరం పడే అవకాశాలు కన్పించడం లేదు. ఎందుకంటే మరో 5 గురు ఇండిపెండెంట్, ఏఐబీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రేపు (శనివారం) వారంతా బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు,” అని బండి సంజయ్ సన్నిహితులొకరు తెలిపారు.

కరీంనగర్ లో కాంగ్రెస్ కు కేవలం 14 డివిజన్లు మాత్రమే లభించాయి. ఒకపుడు ఈ జిల్లా బిఆర్ ఎస్ కంచుకోట. అయినా సరే, ఈ ఎన్నికల్లో బిఆర్ ఎస్ కు కేవలం 8 సీట్లు వచ్చాయి. ఇక ఎఐఎంఐఎం కు వచ్చింది కేవలం మూడు సీట్లే. అందువల్ల బిజెపి ఫిబ్రవరి 16 కల్లా మేయర్ పోస్టుకు అవసరమయిన మెజారిటీ సాధిస్తుంది అని బిజెపి నేతలు విశ్వసిస్తున్నారు.

నిజామాబాద్ టెన్షన్

ఇక నిజామాబాద్ విషయానికి వస్తే, ఇక్కడ కూడా బిజెపి మేయర్ పదవి దక్కించుకునేలా ఉంది. 60 సీట్లు ఉన్న ఈ కార్పొరేషన్ లో బిజపి 28 సీట్లు దక్కించుకుని అతి పెద్ద పార్టీ గా అవతరించింది. మరొక మూడు సీట్లు గెల్చుకుని ఉంటే పార్టీకి మేయర్ పదవి సహజంగానే దక్కేది. ఇది ఒక విధంగా పార్టీ సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి నుంచి పార్టీ ఎంపి అర్వింద్ గెలుపొందారు. అయినా సరే, మునిసిపల్ ఎన్నికల్లో పార్టీకి ఆ తీరున మెజారిటీ రాలేదు. ఇక్కడ బిఆర్ ఎస్ బాగా అభాసు పాలయింది. కాంగ్రెస్ కు 17 సీట్లు గెల్చుకుంటే, ఎఐఎంఐఎంకు 14 సీట్లు వచ్చాయి. వీళ్లిద్దరికి కలిపి 31 సీట్లు ఉన్నాయి. ఏదైనా పొరపాటుజరిగితే కాంగ్రెస్-ఎంఐఎం కూటమి చేతికి కార్పొరేషన్ వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అయితే, ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులు బిజెపి ని ఆదుకునే అవకాశం ఉంది. బిజెపి విజేతలతో పాటు ఎక్స్ ఆఫీషియో సభ్యులు అంటే ఎంపి, ఎమ్మెల్యేల పేర్లు కలిపిన జాబితాను కమిషనర్ కు సమర్పిస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు.

ఇక మిగతా మునిసిపాలిటీలలో...

మహబూబ్‌నగర్‌ మినహా మిగతా ఆరు కార్పొరేషన్లలో బిజెపి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ స్థానాలు సాధించింది. ఆ ఆరు కార్పోరేషన్‌లలో 354 డివిజన్లకుగాను బీజేపీ 69 స్థానాలు గెల్చుకోగా బీఆర్‌ఎస్‌ 48 డివిజన్లకే పరిమితమయ్యింది. అయితే, బిజెపికి పార్లమెంటులో అసెంబ్లీలో ఉన్న బలగంతో పోలిస్తే సాధించించింది బాగా తక్కువే అనాలి. ఈ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలున్నా మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫలితాలు దానికి ధీటుగా లేవు. గతంతో పోలిస్తే మునిసిపాలిటీల్లోనూ ఓట్లు, సీట్లు పెంచుకున్నప్పటికీ, చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకునే స్థాయికి రాలేకపోయింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రాల్లో గతంతో పోలిస్తే సీట్లు పెంచుకున్నా, చైర్మన్‌ పదవి దరిదాపుల్లోకి రాలేకపోయింది.

ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నా వారి ప్రభావం మునిసిపల్ ఎన్నికల్లో కనిపించలేదు. దక్షిణ తెలంగాణాలో పలు మునిసిపాలిటీల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. విచిత్రమేమిటంటే, 43 మునిసిపాలిటీల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పార్టీకిఈ దీనావస్థలో పడింది. అయితే. బిజెపికి ఓదార్పు ఏమిటంటే, 2020 ఎన్నికల్లో 239 వార్డుల్లో గెలుపొందితే , ఈసారి సుమారు 350 వార్డుల్లో విజయం సాధించడం. అప్పట్లో 13 శాతం ఓట్లే సాధించింది. ఈసారి 20శాతానికిపైగా ఓట్లు పడ్డాయని చెప్పుకుని పరాజయం బాధను దిగమింగుకోవచ్చు.

బీజేపీ ఎమ్మెల్యేలున్నా, లాభం సున్నా

పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మునిసిపాలిటీలలో ఒక్క ఆదిలాబాద్‌ మాత్రమే ఊరట నిచ్చింది. బిజెపి ఎమ్మెల్యే కె. వెంకటరమణారెడ్డి పలుకుబడి ఉన్న మునిసిపాలిటీలో 49 వార్డులకుగాను 18 చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఇది ఆయన సొంత గొప్పదనం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులు, కెసిఆర్, రేవంత్ రెడ్డి లను ఓడించి ఆయన సంచలనం సృష్టించారు.

ఇక పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌లో ఆయన ప్రభావం పెద్దగా కనిపించలేదు. 42 వార్డులకుగాను బీజేపీ 13 స్థానాలకే పరిమితమైంది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించినప్పటికీ నిర్మల్‌ మునిసిపాలిటీ ఎన్నికలను ఆయన ప్రభావితం చేయలేకపోయారు.

బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పరువు దక్కించుకున్నారు. ఆదిలాబాద్‌ లో 49 వార్డులకుగాను బీజేపీ 21 స్థానాలు సాధించింది. దీనితో మేయర్ ఎన్నిక ఇక్కడ ఆసక్తికరంగా మారుతున్నది. ఆర్మూరు మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను, ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ 8 స్థానాలే సాధించింది. ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పవార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ముథోల్‌ సెగ్మెంటులో కీలకమైనది భైంసా మునిసిపాలిటీ. కమ్యూనల్ గా సెన్సిటివ్ ఏరియా. అయినా సరే, బీజేపీ పట్టు సాధించలేకపోయింది. పాల్వాయి హరీశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్‌పూర్‌లో కమలం 5 స్థానాలు సాధించింది. సూర్యనారాయణగుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌ లో పర్వాలేదు అని అనిపించుకుంది.


Read More
Next Story