
మున్సిపల్ ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదం
పెండింగ్‌లో ఉన్న వార్డులు, డివిజన్‌ల విభజన వంటి అంశాలపైనా ఫోకస్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించింది క్యాబినెట్. ఈ క్రమంలోనే పెండింగ్‌లో ఉన్న వార్డులు, డివిజన్‌ల విభజన వంటి అంశాలపైనా ఫోకస్ పెట్టారు. వాటిని వీలయినంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో జరిగిన 27వ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలకు ఆమోదం లభించింది. స్థానిక పాలనను మరింత బలంగా తీర్చిదిద్దడం, ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా చేరేలా చేయడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డులు–డివిజన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో, వచ్చే ఫిబ్రవరి నెలలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న వార్డుల విభజన వంటి ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభజన చేపట్టాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన విభజనలో ఉన్న లోపాలను సరిచేసి, ప్రజలకు మరింత చేరువగా ఉండేలా జిల్లాల సరిహద్దులు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగేందుకు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అభిప్రాయాలు, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగానే జిల్లాల తుది రూపం ఖరారవుతుంది.
కేబినెట్ భేటీ అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. చరిత్రలో తొలిసారిగా మేడారంలో కేబినెట్ సమావేశం జరగడం విశేషమని వారు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు అవసరమైన 14 ప్రాంతాల్లో భూముల కేటాయింపుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.
అదే విధంగా 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నారు. దీనిపై ఫిబ్రవరి 15లోపు కన్సల్టెన్సీ నివేదిక అందనుంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 (ఏ, బి) విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం రూ.2,787 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో సాగునీటి అవసరాలు తీర్చేందుకు పొట్లపూర్ ఎత్తిపోతల పథకానికీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

