స్ధానికఎన్నికల్లో బీఆర్ఎస్ ను వెంటాడబోతున్న కవిత
x
Telangana Jagruthi President Kavitha

స్ధానికఎన్నికల్లో బీఆర్ఎస్ ను వెంటాడబోతున్న కవిత

ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్(AIFB) పార్టీ చిహ్నం సింహగుర్తుపైనే జాగృతి(Telangana Jagruthi) అభ్యర్ధులు కూడా పోటీచేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) డిసైడ్ చేశారు


తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీచేయబోతోంది. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీతో ఎన్నికల పోటీపై జాగృతి పొత్తుపెట్టుకుంది. అందుకనే మున్సిపల్ ఎన్నికలు తర్వాత జరగబోయే పరిషత్ ఎన్నికల్లో(Local body elections) ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్(AIFB) పార్టీ చిహ్నం సింహగుర్తుపైనే జాగృతి(Telangana Jagruthi) అభ్యర్ధులు కూడా పోటీచేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) డిసైడ్ చేశారు. జాగృతి పేరుమీదే రాజకీయపార్టీని రిజిస్టర్ చేసి, ప్రత్యేకంగా గుర్తుతెచ్చుకుని ఎన్నికల్లో పోటీచేయాలంటే ఇంకా సమయంపడుతుంది. ఎందుకంటే జాగృతిపార్టీ పేరుతో రాజకీయపార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తవ్వటానికి ఇంకా సమయం పడుతుంది.

అందుకనే ఏఐఎఫ్బీతో పొత్తుపెట్టుకుని ఆ పార్టీ ఎన్నికల గుర్తునే తాత్కాలికంగా జాగృతి తరపున పోటీచేయబోతున్న అభ్యర్ధులు ఉపయోగించుకునేట్లుగా నిర్ణయమైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబవ్రరి 11వ తేదీన వస్తుందని అనుకుంటున్నారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. తర్వాత 650 జిల్లా పరిషత్తులు, 5656 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి పై రెండు ఎన్నికల్లోను జాగృతి తరపున అభ్యర్ధులు పోటీచేయటం ఖాయమైపోయింది. కాకపోతే ఓటర్లు జాగృతి అభ్యర్ధులకే ఏఐఎఫ్బీ గుర్తయిన సింహంగుర్తుకు ఓట్లేయాల్సుంటంది.

స్ధానికసంస్ధల ఎన్నికల బరిలో దిగాలని కవిత నిర్ణయించుకోవటం కీలకమనే చెప్పాలి. ఎలాగంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, క్యాడర్ ను కలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటి స్ధానాలను గెలవాలని, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైన జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని నిరూపించేందుకు చాలా కష్టపడుతున్నారు.

తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పదనే అందరు అనుకుంటున్నారు. అధికార కాంగ్రెస్-ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్-ప్రతిపక్ష బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఎక్కడైనా స్వతంత్రులు పోటీచేస్తే చేయచ్చు. అయితే అంచనాలను తల్లకిందులు చేస్తు జాగృతి కూడా ఎన్నికల రంగంలోకి దిగబోతుండటంతో ఇపుడు త్రిముఖ పోరుకాస్త చతుర్ముఖ పోటీగా మారబోతోంది.

మామూలుగా అయితే ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేక ఓట్లు అయితే బీఆర్ఎస్ కు లేకపోతే బీజేపీకి పడతాయి. అలాగే ప్రతిపక్షాల మీద ఓటర్లలో వ్యతిరేకత ఉంటే అది అధికారపార్టీకి ప్లస్ అవుతుంది. అయితే ఇక్కడ నాలుగోపార్టీగా జాగృతి అభ్యర్ధులు కూడా రంగంలో ఉండటంవల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు జాగృతి పార్టీ కూడా చీల్చుకుంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే మొదటినష్టం బీఆర్ఎస్ కే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇప్పటికే కేటీఆర్, హరీష్ తో పాటు చాలామంది నేతలపైన మండిపోతున్న కవిత రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే దాన్ని తట్టుకోవటం కారుపార్టీ నేతలకు బాగా ఇబ్బంది అవుతుంది. కవిత కొద్దిరోజులుగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బీఆర్ఎస్ హయాంలో సామాజిక తెలంగాణ సాకారంకాలేదని, బీఆర్ఎస్ హయాంలో చాలామంది అవినీతికి పాల్పడ్డారని చేసిన ఆరోపణలకు కారుపార్టీ కీలకనేతలు నోరుకూడా విప్పలేకపోతున్నారు. కాబట్టి ఇవే ఆరోపణలతో కవిత రేపటి ఎన్నికల ప్రచారం కూడా చేయటం ఖాయం. అప్పుడు ఇబ్బందిపడేది ముందు బీఆర్ఎస్సే. ఆ ఇబ్బందులను కారుపార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాల్సిందే.

Read More
Next Story