
ఎస్ఐఆర్‌కు తెలంగాణ రెడీ.. పార్టీలతో సీఈఓ కీలక భేటీ
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పార్టీలతో సీఈఓ సమావేశం నిర్వహించి బీఎల్‌ఏల నియామకంపై స్పష్టత ఇచ్చారు.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణకు తెలంగాణ పూర్తిగా సిద్ధమవుతోంది. తాజా పరిణామంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయి సమన్వయమే ఎస్ఐఆర్ విజయానికి ఆధారమని ఈ సమావేశంలో స్పష్టం చేశారు.
ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందే ప్రతి పోలింగ్ స్టేషన్‌కు తప్పనిసరిగా ఒక బూత్ లెవల్ ఏజెంట్ ఉండాలని సీఈవో పార్టీలకు సూచించారు. బీఎల్‌ఏలు ఆ పోలింగ్ ప్రాంతానికి చెందిన స్థానికులై ఉండాలని చెప్పారు. బూత్ లెవల్ అధికారులతో దగ్గరగా పనిచేస్తే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మరింత కచ్చితంగా సాగుతుందని వివరించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతోందని సీఈవో తెలిపారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ తెలంగాణకు కూడా వర్తిస్తుందని చెప్పారు. ఇది 2026 ఏప్రిల్ లేదా మే నెలల్లో వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత సమయం పరిమితంగా ఉండటంతో రాష్ట్రంలో ముందస్తు ఏర్పాట్లు మొదలైనట్లు వెల్లడించారు.
సన్నాహక చర్యల్లో భాగంగా 2025 ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను 2002లో నిర్వహించిన ఎస్ఐఆర్ డేటాతో అనుసంధానిస్తూ టేబుల్‌టాప్ మ్యాపింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ కొనసాగుతోందని చెప్పారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివాసాల గుర్తింపు కోసం బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సందర్శనలు చేస్తున్నారని వివరించారు.
ఎస్ఐఆర్ సమయంలో ప్రతి పోలింగ్ ప్రాంతాన్ని బీఎల్‌ఓలు మూడు నుంచి నాలుగు సార్లు సందర్శిస్తారని సీఈవో చెప్పారు. మొదటి సందర్శనలో ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు. అందుబాటులో లేని కుటుంబాలను తరువాతి సందర్శనల్లో కవర్ చేస్తారని వివరించారు. సన్నాహక దశలో మ్యాపింగ్ కాకపోయిన ఓటర్లు కూడా ఎస్ఐఆర్ సమయంలో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ మొత్తం ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం చాలా కీలకమని సీఈవో గుర్తు చేశారు. బూత్ స్థాయిలో సమన్వయం బలపడితే ఫిర్యాదులు తగ్గుతాయని చెప్పారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడడం లక్ష్యమని వివరించారు. ఈ సమావేశానికి అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ సీఈవో హరి సింగ్ సహా ఇతర అధికారులు హాజరయ్యారు.

