
సంజయ్ కు క్లీన్ చిట్
బీఆర్ఎస్ తరపున గెలిచిన సంజయ్ కాంగ్రెస్ లోకి మారినట్లు బీఆర్ఎస్ ఎలాంటి సాక్ష్యాలు చూపించలేకపోయినట్లు తెలిపారు
ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే సంజయ్ కు బుధవారం క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ తరపున (BRS Defected MLA Sanjay)సంజయ్ 2023 ఎన్నికల్లో జగిత్యాల్ నుండి ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో(Revanth) భేటీ అయిన తర్వాత పూర్తి సమయం కాంగ్రెస్ తోనే గడుపుతున్నారు. (BRS)బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అందుకనే తనపై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. మొత్తం పదిమంది ఎంఎల్ఏల ఫిరాయింపుల మీద సుప్రింకోర్టులో తన ఎంఎల్ఏలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR)కేటీఆర్ కేసులు వేయించిన విషయం తెలిసిందే.
ఎంఎల్ఏలపై యాక్షన్ తీసుకునే బాధ్యత స్పీకర్ మీద ఉందని చెప్పిన సుప్రింకోర్టు అనర్హత విషయాన్ని తేల్చాలని స్పీకర్ ను ఆదేశించింది. ఇప్పటికే 7 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ ముగ్గురు ఎంఎల్ఏల విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ముగ్గురిలో సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారు. అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్వహించిన విచారణకు సంజయ్ హాజరై చాలా కాలమైంది. ఇంతకాలం పెండింగులో పెట్టిన స్పీకర్ ఈరోజు సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన సంజయ్ కాంగ్రెస్ లోకి మారినట్లు బీఆర్ఎస్ ఎలాంటి సాక్ష్యాలు చూపించలేకపోయినట్లు తెలిపారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది దానం, కడియం విషయంలో మాత్రమే.
దానం విచారణ కూడా పూర్తయ్యింది. దానంను విచారించేటపుడు ఎంఎల్ఏ తరపున లాయర్ హాజరయ్యారు. ఈరోజు కడియం శ్రీహరిని స్పీకర్ విచారించబోతున్నారు. దానం, కడియం విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు కూడా సంజయ్ తాను బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అంటున్నారు. అసెంబ్లీలో బిల్లులు ఓటింగ్ వచ్చినపుడు విప్ జారీచేస్తే తాను బీఆర్ఎస్ కే ఓటేస్తానని ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది.
ఇక సంజయ్ విషయానికి వస్తే ఈనెల 11వ తేదీన జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ఎంఎల్ఏ ర్యాలీలో పిలుపిచ్చారు. అలాగే జగిత్యాల్, రాయికల్ మున్సిపాలిటీల్లోని వార్డులకు పోటీచేయబోతున్న అభ్యర్ధుల్లో తన మద్దతుదారులకే ఎక్కువ టికెట్లు ఇప్పించుకున్నారు. ఈ విషయాలన్నీ మీడియా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయినా స్పీకర్ దృష్టికి ఈ విషయాలు వెళ్ళలేదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎంఎల్ఏ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎలా ప్రచారం చేస్తున్నారు ? అన్నది పాయింట్. స్పీకర్ తాజా నిర్ణయంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎంఎల్ఏల్లో స్పీకర్ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినట్లయ్యింది. మిగిలిన దానం, కడియం విషయంలో ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.

