
బడ్జెట్ లో తెలంగాణలో ప్రస్తావన ఏదీ?
నిర్మలాసీతారామన్ బడ్జెట్ పై పరిశ్రమల వర్గాల మిశ్రమ స్పందన
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, FTCCI ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిరాశే మిగిల్చింది అని సి.ఐ.ఐ. మాజీ ఛైర్మన్ సి.శేఖర్‌రెడ్డి ఫెడరల్ తెలంగాణాతో అన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణా ప్రాజెక్టులకు నిధుల విడుదల కోసం కేంద్ర ప్రభుత్వానికి అనేక అభ్యర్ధనలు పెట్టుకున్నా, వాటిని 2026-27 బడ్జెట్ లో చోటు దక్కలేని ఆయన అన్నారు. రీజినల్ రింగ్ రోడ్, (Regional Ring Road), హైదరాబాద్ సూవరేజ్ మాస్టర్ ప్లాన్ ( Hyderabad Sewerage Master Plan), నవోదయ కేంద్రీయ విద్యాలయాలు, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజక్టు, ఇతర మునిసిపిల్ ప్రాజక్టులకు ముఖ్యమంత్రియకేంద్ర నిధులను కోరారు. అయితే ఈ బడ్జెట్‌లో వాటి ప్రస్తావనే లేదు,’’ అని శేఖర్ రెడ్డి అన్నారు.
మహిళలకు ఈ బడ్జెట్‌లో పెద్ద పీఠ వేశారని కాన్ఫేడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ ఎం.శ్రీనివాస్ చెప్పారు. "మహిళలు స్వయంగా ఎదగడానికి 'SHE-Marts' అనే ప్రత్యేక కమ్యూనిటీ రీటైల్ దుకాణాలు స్థాపిస్తారు. ఇవి మహిళల నేతృత్వంలోని ఉత్పత్తుల అమ్మకాలను పెంచే ప్లాట్‌ఫారమ్‌లు గా పనిచేస్తాయి. అలాగే Lakhpati Didi పథకం మహిళల ఆదాయం పెంచి వారిని వ్యాపార యజమానులుగా మార్చేందుకు సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ-రహిత రుణాలు పొందే అవకాశం వుంది. ప్రత్యేకంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) వంటి విభాగాల్లో చదువుతున్న మహిళలకు భద్రత, సౌకర్యం ఇవ్వడానికి ప్రతి జిల్లాలో ఒక మహిళా హాస్టల్ ఏర్పాటు చేయడం హర్షనీయం," అని హేమ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
ఈ బడ్జెట్‌లో 10,000 టూరిస్ట్ గైడ్‌లకు శిక్షణ కార్యక్రమం ప్రకటించారు. ఇది హాస్పిటాలిటీ సేవలను మెరుగ్గా చేయడానికి సహాయపడుతుందని ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ టూరిజం కమిటీ ఛైర్మన్ రాంచంద్రన్ తెలిపారు. కేంద్రం 15 పురాతన సైట్‌లను ఎక్స్‌పీరియన్షియల్ డెస్టినేషన్లుగా మార్చే నిర్ణయం తీసుకుంది. "తెలంగాణలోని హైదరాబాదు చుట్టూ ఉన్న పురాతన హెరిటేజ్ ప్రాంతాలకు ప్రోత్సాహం లభించే అవకాశం వుంది. పర్యావరణ స్నేహ పూర్వక ట్రెక్కింగ్ మార్గాలు, ప్రకృతి-ఆధారిత టూరిజం ప్రాజెక్టులు మొదలుపెట్టబోతున్నారు. ఇవి తెలంగాణలోని అరణ్యాల, నైట్‌లైఫ్ & అడ్వెంచర్ అట్రాక్షన్లకు ప్రయోజనం కలుగుతుంది. అయితే ఈ బడ్జెట్‌లో తెలంగాణ టూరిజం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. కానీ రైల్ కనెక్టివిటీ, మెడికల్ హబ్‌లు, హాస్పిటాలిటీ శిక్షణ కార్యక్రమాలు తెలంగాణలో టూరిజం కేంద్రాల అభివృద్ధికి పరోక్షంగా ప్రయోజనాలు ఇవ్వగలవు," అని రాంచంద్రన్ తెలిపారు.
ఈ బడ్జెట్‌లో పరిశ్రమ, తయారీ రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించిందని ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ ఆర్.రవికుమార్ తెలిపారు. "ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంపు మీద ఫోకస్ పెట్టారు. మహిళలు, యువకులు, MSMEs, తయారీ రంగం, గ్రీన్ & టెక్నాలజీ వంటి విభాగాలలో ప్రత్యేక అవకాశాలు కల్పించారు," అని ఆర్.రవికుమార్ తెలిపారు.
ఈ బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలు ఎదురుచూసిన ఆదాయపు పన్ను మినహాయింపులు ఏమీ లేవు అని ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జిఎస్‌టి కమిటీ ఛైర్మన్ మహ్మద్ ఇర్షాద్ అహ్మద్ తెలిపారు. "దేశంలో ఉత్పత్తి, వినియోగం పెరిగేలా ఈ బడ్జెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెక్, MSME, డిజిటల్ ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డాటా సెంటర్స్, బయోఫార్మాగ్రోత్ రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు," అని అహ్మద్ చెప్పారు.
ఈసారి పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ, దశాబ్దాల కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలుకుతూ కొత్త అధ్యాయానికి తెరలేపారని ప్రశంసించారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు కె.కె.మహేశ్వరి. "న్యూ ఇన్‌కంట్యాక్స్ యాక్ట్ -2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకువస్తున్నారు. సామాన్యులు కూడా ఈజీగా అర్థం చేసుకునేలా ఫారమ్‌లను సరళతరం చేయడం శుభపరిణామం. విదేశీ విద్య, వైద్యం కోసం పంపే నిధులపై టీసీఎస్ (TCS)ను 5% నుంచి 2%కి తగ్గించారు," అని కె.కె.మహేశ్వరి తెలిపారు.

