కేంద్రం కొర్రీలు.. రాష్ట్రం ఆరోపణలు.. ప్రజలకు తప్పని ఎదురుచూపులు!
x

కేంద్రం కొర్రీలు.. రాష్ట్రం ఆరోపణలు.. ప్రజలకు తప్పని ఎదురుచూపులు!

తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎక్కడ ఆగిపోయాయి?


తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎక్కడ ఆగిపోయాయి? రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు? నిధులు విడుదల కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. విడుదల చేసిన నిధులను రాష్ట్రం సరిగ్గా ఖర్చు చేయడం లేదని కేంద్రం వాదిస్తోంది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక పంచాయితీలో నష్టపోతున్నది మాత్రం సామాన్య ప్రజలేనా?

హైదరాబాద్‌ చుట్టూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు వస్తే ప్రయాణ సమయం తగ్గుతుందని ఎదురుచూస్తున్న ప్రజలు.. మెట్రో విస్తరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్న నగరవాసులు.. వరంగల్‌లో మురుగు సమస్యకు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పరిష్కారం చూపుతుందని భావిస్తున్న ప్రజలు.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

2026–27 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 24 వేల కోట్ల రూపాయలకు పైగా గ్రాంట్లు అందుతాయని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. అయితే అక్టోబర్‌ చివరి నాటికి సుమారు 4 వేల కోట్ల రూపాయలే అందినట్లు నివేదికలు వెల్లడించాయి. అంటే రాష్ట్రం ఆశించిన నిధులకు, ఇప్పటివరకు అందిన మొత్తానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

నిధుల విడుదలలో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు అంటే వినియోగ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో సమర్పించకపోవడం కూడా ఒక కారణమని అక్టోబర్‌ 26న వచ్చిన నివేదిక పేర్కొంది. గతంలో విడుదల చేసిన నిధులను ఏ పనులకు ఖర్చు చేశారు? ఎంత ఖర్చు చేశారు? అనే వివరాలను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాలు సమర్పించడంలో జాప్యం జరిగితే తదుపరి విడత నిధుల విడుదల నిలిచిపోవచ్చు.

అంతేకాదు, కొన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను ముందుగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలోనూ జాప్యం జరిగితే కేంద్ర నిధులు అందడంలో సమస్యలు తలెత్తుతాయి. ఇదే అంశంపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించాలని సూచించారు.

అంటే కేంద్రం నిధులు విడుదల చేయడం ఒక అంశమైతే.. వాటిని పొందేందుకు అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయడం, వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించడం మరో కీలకమైన అంశం.మరి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల సంగతేంటి? తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన 47 కీలక ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు గతంలో వెల్లడించింది. వీటిలో రోడ్లు, రైల్వేలు, మెట్రో, విమానాశ్రయాలు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.

వీటిలో అత్యంత కీలకమైనది రీజినల్‌ రింగ్‌ రోడ్‌.హైదరాబాద్‌ చుట్టూ 362 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్ (RRR) నిర్మించనున్నారు. ఇందులో ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు 161 కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్‌ నుంచి తిరిగి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల మేర ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌లోకి ప్రవేశించకుండానే ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సరుకు రవాణా సులభమవడంతో పాటు రింగ్‌ రోడ్‌ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యాపారాలు, నివాస ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34 వేల కోట్లకు పైగా ఉంది. అయితే నిధుల కేటాయింపు, అనుమతులు, భూసేకరణ వంటి అంశాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది.ఇక హైదరాబాద్‌ మెట్రో రెండో దశ కూడా మరో కీలకమైన ప్రతిపాదన. ఫేజ్‌ 2లోని వివిధ కారిడార్లకు కలిపి సుమారు 44 వేల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని అంచనా. నగరం విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. మెట్రో విస్తరణ పూర్తయితే లక్షలాది మంది ప్రయాణికులకు ఉపయోగపడే అవకాశం ఉంది.

కానీ కేంద్రం నుంచి అవసరమైన ఆమోదాలు, నిధులపై స్పష్టత రావాల్సి ఉంది. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు.. మౌలిక వసతుల నిరీక్షణ!వరంగల్‌ నగరంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది చాలాకాలంగా ఉన్న ప్రతిపాదన. ఇందుకోసం సుమారు 4,170 కోట్ల రూపాయల నిధులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రాజెక్టు అమలైతే నగరంలోని మురుగు నీటి నిర్వహణ మెరుగుపడటంతో పాటు పారిశుద్ధ్య సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

మరోవైపు మూసీ నది ప్రక్షాళన, రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి, బాపూఘాట్‌ అభివృద్ధికి కేంద్ర సహకారం, భూముల బదిలీ వంటి అంశాలు కూడా చర్చలో ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్‌, పాల్వంచ, బసంత్‌నగర్‌ ప్రాంతాల్లో విమానాశ్రయాల ప్రతిపాదనలు, కొత్త జాతీయ రహదారులు, రైల్వే లైన్లు కూడా కేంద్రం పరిశీలనలో ఉన్న అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇవన్నీ కేవలం ప్రభుత్వ ప్రాజెక్టులు మాత్రమే కావు. వీటి వెనుక ప్రజల అవసరాలు ఉన్నాయి.

రోడ్లు లేక ప్రయాణ సమయం పెరుగుతున్న ప్రాంతాలు ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న పట్టణాలు ఉన్నాయి. రవాణా సౌకర్యాలు లేక వ్యాపార అవకాశాలు కోల్పోతున్న ప్రాంతాలు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దక్షిణ తెలంగాణ రైతులకు కీలకమైన ప్రాజెక్టు. ఈ పథకం పూర్తయితే కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్నది లక్ష్యం. అయితే కృష్ణా జలాల వినియోగంపై అంతర్రాష్ట్ర వివాదాలు, కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ పరిధిలో ఉన్న అంశాల కారణంగా ప్రాజెక్టు డీపీఆర్‌పై సాంకేతిక, ఆర్థిక పరిశీలన ముందుకు సాగడం లేదని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. డీపీఆర్‌ను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు కూడా తెలిపింది. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, నీటి కేటాయింపులు, పర్యావరణ సంబంధిత అంశాల్లో జాప్యం కొన‌సాగుతోంది.

కేంద్రం–రాష్ట్రం వాదన‌లు...రాష్ట్ర ప్రభుత్వ వాదన ప్రకారం.. తెలంగాణకు రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు సకాలంలో అందడం లేదు. దీనివల్ల అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయి.కేంద్రం వైపు నుంచి మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు వినియోగ ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంలో జాప్యం చేస్తున్నాయని, కొన్ని పథకాల్లో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయడం లేదని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నిధుల పంచాయితీకి పరిష్కారం ఎప్పుడు? రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు. కేంద్రం ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు ఇవ్వాలి? ఏ ప్రతిపాదనకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఏ పత్రాలు సమర్పించాలి? ఏ ప్రాజెక్టుకు ఎంత రాష్ట్ర వాటా విడుదల చేయాలి? అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.

ఎందుకంటే రీజినల్‌ రింగ్‌ రోడ్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుడికి రాజకీయ ప్రకటనలు అవసరం లేదు. మెట్రో కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగికి హామీలు సరిపోవు. డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వరంగల్‌ ప్రజలకు సమావేశాలు కాదు.. పనులు కావాలి. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు కావాల్సింది నీళ్లు. కేంద్రం–రాష్ట్రం మధ్య నిధుల పంచాయితీ ఎప్పుడు ముగుస్తుంది? పెండింగ్‌ ప్రాజెక్టులు ఎప్పుడు పట్టాలెక్కుతాయి? అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎప్పుడు అందుతాయి? ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేంద్ర‌, రాష్ట్ర‌ ప్రభుత్వాలను అడుగుతున్న ప్రశ్న.

Read More
Next Story