
తొర్రూరులో చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తత
16 వార్డుల మున్సిపాలిటీలో 10 ఓట్లే గెలుపు ప్రమాణం. బీఆర్ఎస్–కాంగ్రెస్ సమబలం, పోలీసులు భారీ మోహరింపు. జగిత్యాల, కామారెడ్డిలో కొత్త మలుపులు.
తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఛైర్మన్ పదవుల హీట్ పెరిగింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పుడు ఛైర్మన్ ఎన్నికలు కీలకంగా మారాయి. తొర్రూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాసేపట్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక జరగనుండగా కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తాజా పరిణామాలతో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది.
సమబలం.. మ్యాజిక్ ఫిగర్ 10
ఈ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 18 ఓట్లు ఉన్నాయి. గెలుపు కోసం 10 ఓట్లు అవసరం. తాజా ఫలితాల్లో బీఆర్ఎస్ 9 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ 7 వార్డులు సాధించింది. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో పోటీ సమానంగా మారింది.
బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ మారే అవకాశముందని ప్రచారం జరిగింది. దీనిని అడ్డుకునేందుకు ఆ పార్టీ జనసమీకరణకు దిగింది. ఎన్నికల సమయంలో రెండు పార్టీల శ్రేణులు కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది.
స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలు భారీగా గుమికూడారు. పోటాపోటీ నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
జగిత్యాల స్పష్టత.. కామారెడ్డిలో ట్విస్ట్
ఇక జగిత్యాలలో నెలకొన్న అధిపత్య పోరుకు తెరపడింది. మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కేటాయించినట్టు పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దాంతో సమిండ్ల వాణిని చైర్మన్‌గా ఎంపిక చేశారు. వైస్ చైర్మన్ పదవిని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చారు. ఆ స్థానానికి పర్వీన్‌ను ఎన్నుకున్నారు.
జెడ్పీ, మార్కెట్ కమిటీ పదవులను కూడా జీవన్ రెడ్డి వర్గానికి కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల్లో తాము కూడా కృషి చేశామని జీవన్ రెడ్డి వర్గం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. చివరకు వైస్ చైర్మన్ పదవి కేటాయించడంతో ఇరువర్గాలు తాత్కాలికంగా శాంతించాయని చర్చ సాగుతోంది.
మరోవైపు కామారెడ్డిలో కీలక మలుపు చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఇప్ప ఉమారాణి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఫలితాల అనంతరం ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వబోమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం.
దాంతో కాంగ్రెస్ పార్టీ ఇప్ప ఉమారాణి పేరును ప్రతిపాదించింది. వైస్ చైర్మన్ స్థానం కోసం బీఆర్ఎస్ నేతలు కోరారు. హఫీజ్ లేదా కాసర్ల గోదావరిలో ఒకరికి ఆ అవకాశం దక్కే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడు మున్సిపాలిటీల్లోనూ రాజకీయ సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తుది ఫలితాల అనంతరం స్పష్టత రానుంది.

