
‘అందుకనే మీనాక్షి మీద కూడా కేసు పెట్టాను’
బక్కపలుచగా, భుజానికి ఒక సంచి వేసుకుని తిరిగే మీనాక్షి నటరాజన్ పేరు ఒక్కసారిగా ఎందుకింతగా పాపులర్ అయ్యింది ?
రాజ్యసభ నామినేషన్ తిరస్కరణతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయారు. గడచిన రెండు రోజులుగా మీనాక్షి పేరు ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. బక్కపలుచగా, భుజానికి ఒక సంచి వేసుకుని తిరిగే మీనాక్షి నటరాజన్ పేరు ఒక్కసారిగా ఎందుకింతగా పాపులర్ అయ్యింది ? కారణం ఏమిటి ? మీనాక్షితో పాటు బాధితురాలి పేరు కూడా బాగా ట్రెండింగులో ఉంది. ఇంతకీ ఈ బాధితురాలికి మీనాక్షికి సంబంధం ఏమిటి ? ఏమిటంటే దీనికి ఒక నేపధ్యం ఉంది. అదేమిటంటే తెలంగాణలో 2022లో నమోదైన ఒక కేసు.
నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుంభా శివకుమార్ రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలతో కాంగ్రెస్ లో బాగా యాక్టివ్ గా ఉండే ఒక యువతి ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు చేసేముందే తనకు న్యాయంచేయండి అని చాలామందిని అడిగినా ఉపయోగంలేకపోయింది. పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసిన ఉపయోగంలేకపోవటంతో ఏకంగా నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేసింది. ఆ కేసులో ప్రతివాదులుగా కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట ఎంఎల్ఏ చిట్టెం పర్నికారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత చిట్టెం అభిజయ్ రెడ్డితో పాటు పార్టీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేరు కూడా చేర్చారు.
నిజానికి పోలీసుస్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు 2022లోనే అయినా కోర్టులో ఆమె పిటీషన్ వేసింది 2025లోనే. 2022, మే 7వ తేదీన పంజగుట్ట పోలీసుస్టేషన్ తో పాటు 2023, జూన్ 28న బెంగుళూరులోని కబ్బన్ పోలీసు స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకనే 2025లో కోర్టులో కేసు వేశారు. పోయిన ఏడాది కోర్టులో వేసిన కేసులో పైన చెప్పిన అందరిపేర్లను బాధితురాలు చేర్చారు. దాంతో కోర్టు అందరికీ నోటీసులు ఇచ్చి సమాధానాలు ఇవ్వమని కోరింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ పెండింగులో ఉంది.
ఇపుడు అసలు విషయానికి వస్తే ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ నుండి 3 సీట్లకు ఎన్నిక జరగాల్సుంది. మూడు సీట్లలో సంఖ్యాబలం రీత్యా రెండు బీజేపీకి ఒకటి కాంగ్రెస్ కు దక్కుతుంది. కాంగ్రెస్ తరపున మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలుచేశారు. అయితే నామినేషన్లో తనపైన తెలంగాణలో నమోదైన కేసు వివరాలు ఇవ్వలేదన్న బీజేపీ నేతల ఫిర్యాదుతో రిటర్నింగ్ అధికారి మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించారు. దాంతో ఇపుడీ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమవుతోంది.
మీనాక్షి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కూడా స్పష్టంచేశారు. అసలు ఆ కేసుతో మీనాక్షికి ఎలాంటి సంబంధంలేదు కాబట్టి ఆమె నామినేషన్ ను తిరస్కరించటం అన్యాయమంటు కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసు దాఖలుచేశారు. ఈ విషయాన్ని కోర్టు, ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది.
ఇదే విషయమై కోర్టులో కేసు దాఖలుచేసిన బాధితురాలు మాట్లాడుతు ‘‘తనకు అన్యాయం జరిగింది కాబట్టే అందరిపైనా కేసు దాఖలుచేశాను’’ అని చెప్పారు. ‘‘పార్టీపరంగా జరిగిన అన్యాయాన్ని తాను ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో చెప్పినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు’’ అన్నారు. ‘‘పార్టీలో ఎవరూ తన గోడును పట్టించుకోనపుడు తాను కోర్టును ఆశ్రయించటం తప్ప వేరే మార్గం ఏముంది’’ అని ఎదురు ప్రశ్నించారు. ‘‘మీనాక్షి తెలంగాణకు ఇంచార్జిగా ఉన్నారు కాబట్టే తన పేరును కూడా చేర్చినట్లు’’ చెప్పారు. ‘‘తాను మీనాక్షిని పార్టీలో పదవులు అడగలేదని, కేవలం తనకు న్యాయం చేయమని మాత్రమే అడిగాను’’ అని బాధితురాలు చెప్పారు. ‘‘తనకు పార్టీలో న్యాయం జరగని కారణంగానే కోర్టులో కేసు వేశానని ఆ కేసు మీనాక్షిని రాజ్యసభ ఎన్నికల్లో ఈ విధంగా ఇబ్బంది పెడుతుందని తాను ఊహించలేదు’’ అని స్పష్టంచేశారు.

