
వరి రైతులంతా ‘అంకాపూర్’వైపు చూడాలంటున్న రేవంత్... అంకాపూర్ లో ఏముంది?
తెలంగాణా రిచెస్ట్ విలేజ్ కథ
నిజామాబాద్ జిల్లాలోని‘అంకాపూర్’ గ్రామం మళ్ళీ వార్తలకెక్కింది. తెలంగాణ వరి పండిస్తున్న రైతులంతా అంకాపూర్ వైపు చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. అంకాపూర్ అంటే చాలామందికి అంకాపూర్ చికెన్ కర్రీ గుర్తుకొస్తుంది. ఈ చికెన్ కర్రీ తినేందుకాదు,రైతులు వెళ్లాల్సింది. తెలంగాణాలో మితి మీరి పెరుగుతున్న వరి పంటను అడ్డుకునేందుకు అంకాపూర్ లో పరిష్కారం ఉందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. వరి పంట విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. వరి పంట మోయలేని బరువుయింది.ప్రభుత్వమే విపరీతంగా వరిపంటను ప్రోత్సహించి దేశంలో నెంబర్ వన్ అని ప్రచారం చేసుకుంది. సంక్షోభం రాగానే వరి పంట మానేయాలని పాట పాటడం ప్రభుత్వాలకు మామూలే. ఇదే పని గతంలో కెసిఆర్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి గా ఉన్నపుడు వరి పంట విస్తీర్ణం పెరిగే కొనుగోలు చేసే దిక్కులేనపుడు వరిపంట వేస్తే ఉరితీయాలన్నారు.వరి పంటనుంచి పక్కకు మళ్లాల్సిందే అన్నారు. అపుడు పెద్ద గొడవయింది. చల్లబడింది. పంటల వైవిధ్యం గాలికి కొట్టుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా వరిపంటకే ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో నెంబర్ వన్ ప్రచారం చేసుకున్నారు. ఇపుడు కేంద్రం కనుగోలు చేసే పరిస్థితిలో లేకపోవడం, గల్ఫ్ యుద్ధం కారణం యూరియా దిగుమతులు కష్టం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరిపంటలో సంక్షోభం చూసి రైతులంతా అంకాపూర్ ఊరి వైపు చూడాలంటున్నారు. కారణం, అంకాపూర్ చికెన్ కాదు. ఆవూరి రైతులు వరి పంట వదిలేసి ఇరవైయేళ్లు పైగా అయింది. వరిగింజ పండించకుండాబాగా బతకొచ్చని అంకాపూర్ రైతులు నిరూపించారు. వాళ్లంతా వరి నుంచి విత్తనాల వైపు మళ్లారు. సక్సెస్ అయ్యారు. అంకాపూర్ వరి వదిలేసిన ఒక వూరి సక్సె స్ స్టోరీ.
జనగామ జిల్లా నర్మెట్ట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో అంకాపూర్ వరి రహిత గ్రామం గురించి చెప్పారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల ముడి సరుకుల సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల రాబోయే రోజుల్లో యూరియా కొరత తీవ్రం కానుందని ఆయన హెచ్చరించారు. ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, రైతులు కేవలం వరి సాగుపైనే ఆధారపడటం మానుకోవాలని, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామం చూపిన స్ఫూర్తిదాయక బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. వరి ఇపుడు తెలంగాణకు తలకుమించిన భారం అయింది. ఎందుకంటే, కేంద్రం కొనడం లేదు. నిల్వులు ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో వరి తినే దేశాలన్నింటికి ఎగుమతి చేసినా తెలంగాణ లో ఇంకా చాలా బియ్యం మిగులుతాయి. వీటిని ఏం చేసుకోవాలి. అందుకే ఇక వరి చాలు. వరి వద్దు. వరినుంచి ఇతర పంటలకు మళ్లండి. అదెలా ఉంటుందో అంకాపూర్ ను చూసి నేర్చకొండని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపు నిచ్చారు.
అంకాపూర్ కధేంటో చూద్దామా?
తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు, రైతుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే గ్రామం అంకాపూర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఈ చిన్న గ్రామం నేడు దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పాలకులు, విశ్వవిద్యాలయాల దృష్టిని ఆకర్షిస్తోంది. అంకాపూర్ సాధించిన ఈ అద్భుత ప్రస్థానాన్ని, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రస్తావించడం వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తే, అది కేవలం ఒక గ్రామం కథ కాదని, యావత్ తెలంగాణ రైతులకు ఒక దిక్సూచి అని అర్థమవుతుంది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఎరువుల కొరత, ముఖ్యంగా యూరియా సమస్యను ప్రస్తావిస్తూ అంకాపూర్ మోడల్‌ను ఎందుకు గుర్తుచేశారంటే, అక్కడ రైతులు వరిని విజయవంతగా వదిలేయడం, లాభసాటి ఉండే ఇతర పంటలకు మళ్లడం. ఇది విజయవంతమయింది. దీనితో అంకాపూర్ తెలంగాణలోనే రిచెస్టు విలేజ్ అయింది.
వరిని ‘అంకాపూర్’ ఎలా వదిలేసింది?
అంకాపూర్ గ్రామ ప్రజలు ఒకప్పుడు సాధారణంగా అందరిలాగే వరి సాగు చేసేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు అక్కడి రైతులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకున్నారు. నీటి వినియోగం ఎక్కువగా ఉండే, కేవలం ప్రభుత్వంపై ఆధారపడే వరి సాగును తగ్గించి, మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న విత్తనోత్పత్తి, వాణిజ్య పంటల వైపు మళ్లారు. ముఖ్యంగా ఎర్రజొన్న, మొక్కజొన్న, పసుపు, కూరగాయల సాగులో వీరు సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఈ 'క్రాప్ డైవర్సిఫికేషన్' (పంటల వైవిధ్యం) వల్ల వారు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడమే కాకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. అందుకే యూరియా కొరత వంటి సమస్యలు తలెత్తినప్పుడు, వరిపైనే ఆధారపడకుండా అంకాపూర్ రైతుల వలె ఇతర పంటల వైపు మళ్లాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
అంకాపూర్ గ్రామ సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి ఐకార్, ఇక్రిశాట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు అనేక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా తరలివచ్చాయి. అంకాపూర్‌లో ప్రతి రైతు ఒక శాస్త్రవేత్తలా ఆలోచిస్తాడు. అక్కడ సాగు చేసే విత్తనాలు దేశవ్యాప్తంగా ఉత్తర భారతదేశం వరకు ఎగుమతి అవుతాయి. సొంతంగా విత్తన శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుని, దళారుల ప్రమేయం లేకుండా మార్కెటింగ్‌ను తామే నిర్వహించుకోవడం అంకాపూర్ రైతుల ప్రత్యేకత. అందుకే ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 12,728 గ్రామ పంచాయతీలకు అంకాపూర్ ఒక రోల్ మోడల్ అని కొనియాడారు.
అంకాపూర్ గ్రామ వ్యవసాయం విజయవంతం అవ్వడానికి ఇంకో ప్రధాన కారణం అక్కడ అమలవుతున్న 'క్రాప్ డైవర్సిఫికేషన్' పద్ధతి. దీన్నే పంటల మార్పిడి అంటారు. ఇక్కడి రైతులు ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి వేయరు. ఒక సీజన్‌లో ఎర్రజొన్న వేస్తే, మరో సీజన్‌లో పసుపు, ఆ తర్వాత సోయాబీన్ లేదా విత్తనోత్పత్తికి సంబంధించిన మొక్కజొన్నను సాగు చేస్తారు. దీనివల్ల భూమిలో పోషక విలువలు తగ్గకుండా ఉండటమే కాకుండా, తెగుళ్ల బెడద కూడా తక్కువగా ఉంటుంది. అంకాపూర్‌ను 'మిని నెదర్లాండ్స్' అని కూడా కొందరు పిలుస్తారు, ఎందుకంటే అక్కడ ప్రతి అంగుళం భూమిని శాస్త్రీయంగా వినియోగిస్తారు. విత్తన తయారీలో ఈ గ్రామం సాధించిన ప్రగతి అమోఘం. ఇక్కడ పండించిన విత్తనాలు కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతాయి.
అంకాపూర్ మోడల్‌ను అధ్యయనం చేయడానికి మన దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలే కాకుండా, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు కూడా వచ్చి ఇక్కడి రైతుల నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ గ్రామంలో రైతులు స్వయంగా ఒక సంఘంగా ఏర్పడి, తమ పంటకు తామే ధర నిర్ణయించుకునే స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన పిలుపులో అంతరార్థం ఏమిటంటే, కేవలం సంప్రదాయ పంటలకే పరిమితమై నష్టపోకుండా, ఆధునిక సాంకేతికతను జోడించి అంకాపూర్ రైతుల్లా వ్యాపార దృక్పథంతో వ్యవసాయం చేయమని చెప్పడమే. నీటి కొరత లేదా ఎరువుల కొరత ఉన్నప్పుడు కుంగిపోకుండా, ప్రత్యామ్నాయ పంటల ద్వారా ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో అంకాపూర్ గ్రామం నేడు దేశానికి నేర్పిస్తున్న పాఠం. తెలంగాణలోని ప్రతి గ్రామం అంకాపూర్ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.
* * *

