
కేటీఆర్ మెడకు ‘లొట్టపీసు’ బిగుసుకుంటోందా ?
అధికారంలో ఉన్నపుడు అన్నీ నియమాలను, నిబంధనలను తుంగలోతొక్కి తనిష్టారాజ్యంగా చేసుకున్నారు కాబట్టే ఇపుడు మెడకు కేసులు తగులుకున్నాయి
ఫార్ములా ఈ కార్ రేసు అవినీతి కేసులో ఊహించినట్లే జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ కార్ రేసు కేసుఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. కార్‌రేసు కేసులో కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఏ1, ఏ2, ఏ3గా ఏసీబీ నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలుచేసింది. ముగ్గురిలోను కీలకం ఎవరంటే కేటీఆర్ మాత్రమే అనిచెప్పాలి. ఎందుకంటే కేటీఆర్ రాజకీయంగా ప్రధాన ప్రతిపక్షానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారుకాబట్టే. అధికారంలో ఉన్నపుడు అన్నీ నియమాలను, నిబంధనలను తుంగలోతొక్కి తనిష్టారాజ్యంగా చేసుకున్నారు కాబట్టే ఇపుడు మెడకు కేసులు తగులుకున్నాయి.
కేటీఆర్ మొదటినుండి ఈ కేసుగురించి మాట్లాడుతు ఇదో ‘లొట్టపీసు’ కేసు అని తేలికగా కొట్టిపారేస్తున్నారు. లోలోపల ఎంత టెన్షన్‌గా ఉన్నా పైకిమాత్రం భింకం కనబరుస్తు కేవలం కక్షసాధింపుగా మాత్రమే తనపైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదుచేసినట్లు చెబుతున్నారు. కేసును జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో కక్షసాధింపు ఎక్కడా కనబడకపోగా కేటీఆర్ అధికార దుర్వనియోగం, అవినీతి స్పష్టంగా తెలుస్తుంది. ఈ కార్ రేసు నిర్వహణకు బ్రిటన్‌లోని ఫార్ములా ఈఆపరేషన్స్ అనే కంపెనీతో ఒప్పందంచేసుకున్నది మున్సిపల్ శాఖ. నిబంధనలకు విరుద్ధంగా రు. 54 కోట్లను బ్రిటన్ సంస్ధకు హెచ్ఎండీఏ ఖాతానుండి బదిలీచేయించారు. కేటీఆర్ ఆదేశాలు లేకుండా కోట్ల రూపాయలను అధికారులు బదిలీచేయగలరా ? కేటీఆర్ ఆదేశిస్తేనే తాను నిధుల బదిలీకి అనుమతి ఇచ్చినట్లు అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఏసీబీ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.
కేటీఆర్ మెడకుచుట్టుకుంటున్న కేసులో అర్వింద్ కుమార్ వాగ్మూలమే అత్యంత కీలకమైనది. బ్రిటన్ కంపెనీకి నిధుల బదిలీలో ఆర్ధికశాఖ అనుమతి తీసుకోలేదు. క్యాబినెట్ సమావేశంలో చర్చించలేదు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదు. నిధుల బదిలీసమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. ఇన్నిరకాలుగా నియమాలను ఉల్లంఘించినా, నిబంధనలకు విరుద్ధంగా నిధులను బదిలీచేసినా చివరకు రేసు అయితే జరగనే లేదు. ఈవిషయాలన్నీ 2023ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక్కోటి బయటపడ్డాయి. బయటపడిన సాక్ష్యాల ఆధారంగానే కేటీఆర్ పైన ఏసీబీ, ఈడీలు వేర్వేరుగా కేసులు నమోదుచేశాయి. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎప్పుడో అనుమతిచ్చారు. అలాగే అర్వింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేయటానికి డీవోపీటీ కూడా అనుమతిచ్చింది. చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి ఎలాగూ రిటైర్ అయిపోయారు కాబట్టి యాక్షన్ తీసుకోవటానికి ఎవరి అనుమతి అవసరంలేదు.
వీళ్ళమీద ఏసీబీ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుందా అని ఎదురు చూస్తున్న నేపధ్యంలో సడెన్ గా సోమవారం క్రిమినల్ కేసులో ఛార్జిషీటును దాఖలుచేయటం గమనార్హం. ఛార్జిషీట్ దాఖలు చేసింది కాబట్టి తర్వాత స్టెప్ ఏమిటి ? ఏమిటంటే కేటీఆర్, అర్వింద్, రెడ్డిని ఎప్పుడైనా విచారణకు ఏసీబీ పిలవచ్చు. విచారణకు పిలిచి అరెస్టుచేయచ్చు లేదా అరెస్టుచేసి కోర్టులో సబ్మిట్ చేయచ్చు. వీళ్ళను కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్ విధించాలని ఏసీబీ కోరినపుడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కోర్టు వీళ్ళకు రిమాండ్‌విధిస్తే విచారణ కోసమని ఏసీబీ మళ్ళీ ముగ్గురినీ తనకు అప్పగించాలని కోర్టును ఏసీబీ అడగచ్చు. ఏదేమైనా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లొట్టపీసు కేసే చివరకు కేటీఆర్ మెడకు గట్టిగా చుట్టుకుంటోందని.

