
వ్యతిరేకం కాదంటునే మూసీ, గాంధీ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయం లేదా విధానాన్ని వ్యతిరేకించటమే తమపని అని ప్రతిపక్షాలు గట్టిగా నమ్ముతున్నట్లున్నాయి.
తెలంగాణలో ప్రతిపక్షాల వ్యవహారం భలే విచిత్రంగా ఉంటోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏ విషయం టేకప్ చేసినా వెంటనే దాన్ని వ్యతిరేకించటమే పనిగా పెట్టుకున్నాయి. ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయం లేదా విధానాన్ని వ్యతిరేకించటమే తమపని అని ప్రతిపక్షాలు గట్టిగా నమ్ముతున్నట్లున్నాయి. అందుకనే ప్రతిచిన్న విషయం కూడా పెద్దగా వివాదాస్పదమవుతోంది. ఇపుడు విషయం ఏమిటంటే శుక్రవారం మధ్యాహ్నం ఒక హోటల్లో మూసీ నది బ్యూటిఫికేషన్, గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈకార్యక్రమానికి వివిధ రంగాల్లోని ప్రముఖులతో పాటు రాజకీయపార్టీల నేతలను కూడా ఆహ్వానించారు. ఆహ్వానాలు అందుకున్న వారిలో ప్రజంటేషన్ కు ఎంతమంది హాజరయ్యారో తెలీదు కాని బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం వ్యతిరేకించాయి.
మూసీనది సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని ఒకవైపు చెబుతునే మరోవైపు పేదలు కట్టుకున్న ఇళ్ళను కూల్చేయటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. మూసీ పునరుజ్జీవనానికి కాని లేదా మూసీ ప్రాజెక్టుకు కూడా వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్ళు కూల్చటాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటున్నారు. మూసీనదిలో స్వచ్చమైన నీరు ప్రవహించాలట, నదిలోని నీరు పరిశుభ్రంగా ఉండాలట, ఆ నీటితో రైతులు పంటలు పండించాలట. మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ పేరుతో ఆప్రాంతంలో నివసిస్తున్న పేద, మధ్య తరగతి కుటుంబాల ఇళ్ళను కూల్చడం ఆమోదయోగ్యం కాదన్నారు. గుజరాత్ లోని సబర్మతి ప్రాజెక్టు వెనుక ఏమి జరిగిందో తెలుసుకోవాలన్నారు.
పేదల ఇళ్ళు కూల్చలేదా ?
మోదీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సబర్మతి నది ప్రక్షాళన జరిగిందని చెప్పారు. నర్మదానది నీటిని సబర్మతిలోకి మళ్ళించటం ద్వారా ప్రక్షాళన జరిగిందన్నారు. అక్కడే నివసిస్తున్న పేదలకు పునరావసం ఏర్పాటుచేసిన తర్వాతనే సబర్మతి ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు.
రామచంద్రరావు చెప్పింది బాగానే ఉందికాని పేదలకు పునరావసం ఏర్పాటుచేసిన తర్వాతనే మోదీ సబర్మతి ప్రాజెక్టు టేకప్ చేశారు అంటే అర్ధం ఏమిటి ? ప్రాజెక్టు పరిధిలో ఉన్న పేదలను ఇంకోచోటకు తరలించారనే కదా. పేదల ఇళ్ళను స్వాధీనంచేసుకుని ప్రభుత్వం కూల్చేసిందని రామచంద్రరావు అంగీకరిస్తున్నారు కదా.
రేవంత్ మాట ప్రతిపక్షాలు వినటంలేదు
ఇపుడు రేవంత్ ఏమంటున్నారు ? గాంధీ సరోవర్ ప్రాజెక్టు పరిధిలో నివాసాలు ఉంటున్న వారికి ప్రభుత్వమే వేరే స్ధలంలో ఇళ్ళు కట్టిస్తామనే కదా చెబుతున్నది. లేదా స్ధలం ఇచ్చేస్తే చాలు తామే ఇళ్ళు కట్టుకుంటామని అంటే ప్రభుత్వమే అవసరమైన స్ధలం ఇచ్చి ఇళ్ళు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామనే కదా రేవంత్ పదేపదే చెబుతున్నది. మూసీ, ఈసా నదులు కలిసేచోట గాంధీ సరోవర్ ప్రాజెక్టును టేకప్ చేయాలని ప్రభుత్వం అనుకున్న తర్వాత ఇక ఆపే అవకాశం ఎవరికీ లేదు. ప్రతిపక్షాలు ఎంత గోలచేసినా ప్రాజెక్టయితే ఆగదని అందరికీ తెలుసు. కాబట్టి ప్రతిపక్షాలు చేయాల్సింది ఏమిటంటే ప్రాజెక్టు టేకప్ చేయటానికన్నా ముందే బాధితులను గుర్తించి వారు కోరుకున్నట్లుగా ఇళ్ళు కట్టించటమో లేదా స్ధలం కేటాయించి ఇంటి నిర్మాణానికి పరిహారంగా సరిపడా డబ్బులు చెల్లించాలని అడగాలి. అలా అడగకుండా పేదల ఇళ్ళను కూల్చేందుకు లేదని డిమాండ్ చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గ్రహించాలి.
ఇక, మూసీనది విషయంలో కూడా ప్రతిపక్షాలు ఇలాగే చేస్తున్నాయి. మూసీనదికి రెండువైపులా సుమారు 100 అడుగుల పైగా కట్టను జనాలు ఆక్రమించుకుని వేలాది ఇళ్ళు కట్టేసుకున్నారు. మూసీ ఆక్రమణల్లో అన్నీ రాజకీయ పార్టీలూ కారణమనే చెప్పాలి. ఏ పార్టీకి శక్తి ఉంటే ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమణలు జరిగాయి. భారీవర్షాలు కురిసినపుడు నదిలోని నీరంతా ఇళ్ళల్లోకి వచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనివల్ల రోజుల తరబడి ఇళ్ళలో ఉంటున్నవారు నానా అవస్తలు పడుతున్నారు.
ఆక్రమణలు తొలగించకుండా బ్యూటిఫికేషన్ సాధ్యమేనా ?
ఆక్రమణలు తొలగించకుండా మూసీనది బ్యూటిఫికేషన్ ఎలాగ సాధ్యమో ప్రతిపక్షాలే చెప్పాలి. గోదావరి జలాలను మూసీలోకి మళ్ళించేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అలాగే వ్యర్ధాలను మూసీలో కలవకుండా చర్యలు తీసుకుంటోంది. అవసరమైన చోట్ల ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటుచేస్తోంది. ఇదే సమయంలో ఆక్రమణలను తొలగించేందుకు నివాసం ఉంటున్నవారితో చర్చలు కూడా జరుపుతోంది. ప్రభుత్వం హామీతో ఇప్పటికే కొందరు తమ ఇళ్ళను ఖాళీ చేశారు. ఖాళీ చేసిన వారికి ఇందిరమ్మ డబుల్ బెడ్ రూములను ప్రభుత్వం కేటాయించింది.
మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రకటించటమే ఆలస్యం వెంటనే బీఆర్ఎస్, బీజేపీలో రంగంలోకి దిగిపోయాయి. పేదల ఇళ్ళను కూల్చితే ఒప్పుకోమని, పేదలకు అండగా తాము నిలబడతామంటు నానా రచ్చచేశాయి. సంవత్సరాల తరబడి ఉంటున్న ఇళ్ళను ఖాళీచేయాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. సమస్యలతో మూసీ ఒడ్డునే ఇబ్బందులు పడేబదులు ఇందిరమ్మ డబుల్ బెడ్ రూములను తీసుకుని వెంటనే ఇళ్ళను ఖాళీచేయాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఓట్లరాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులను రెచ్చగొట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

