
రోడ్డున పడిన తెలంగాణ బీజేపీ పరువు
తమను ప్రతిపక్షంలో కూర్చోమని ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామని ప్రకటన చేసుంటే బీజేపీ మీద ఓటర్లలో గౌరవం పెరిగేది
బీజేపీ పెద్దల వ్యవహారం ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న’ సామెత లాగుంది. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల తాలూకు వివాదం తెలంగాణను కుదిపేస్తోంది. పొద్దునలేస్తే సిద్దాంతాలు, నీతి, నిజాయితీల గురించి మాట్లాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పదవుల కోసం అవకాశం ఉన్నచోట్ల ఒకదానితో మరొకటి కుమ్మక్కయిపోయాయి. పార్టీలు కుమ్మకైన వ్యవహారంపై జనాలు ఆశ్చర్యపోయారు. కొన్నిమున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం పార్టీలన్నీ కుమ్మకైపోయిన విషయం పార్టీల అధిష్ఠానాలకు తెలిసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను వదిలేస్తే బీజేపీ పెద్దలు మాత్రం మండిపోయారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు, వెంటనే రిపోర్టు పంపించాలని ఆదేశించారు అనే వార్తలు చక్కర్లు కొట్టడమే ఆశ్చర్యంగా ఉంది.
అవసరమైన మున్సిపాలిటీల్లో పదవుల కోసం బీజేపీ కొన్నిచోట్ల బీఆర్ఎస్ తో మరికొన్నిచోట్ల కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నది. పదవుల కోసం రాజకీయ ప్రత్యర్ధులతో తమనేతలు పొత్తులుపెట్టుకుంటున్నారు అన్నవిషయం అధిష్ఠానంకు ముందే తెలుసు. అయినా అప్పుడేమీ నోరిప్పలేదు. అంతా అయిపోయి రెండు మున్సిపాలిటీల్లో బీజేపీ లాభపడిన తర్వాత తీరిగ్గా అధిష్ఠానం సీరియస్ అంటే అర్ధమేంటి ? జనాల దృష్టిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ముద్ర ఉన్నట్లే బీజేపీ పైన కూడా అనైతిక పార్టీయే అని ముద్రపడిపోయింది.
రెండుపార్టీలతో బీజేపీ కలిసిపోయింది
ఎంఎల్ఏల ఫిరాయింపులను యధాశక్తి ప్రోత్సహించటం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అధికారం అందుకోవటంతప్ప వేరేసిద్ధాంతం లేదు అని జనాలు నిర్ధారణకొచ్చారు. పై రెండుపార్టీలు చెప్పే సిద్ధాంతాలు, నీతులు నేతిబీరకాయలో నెయ్యి ఉన్నట్లే అని జనాలకు అర్ధమైపోయింది. అందుకనే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఫిరాయింపులను జనాలు పట్టించుకోవటం మానేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే పరిస్ధితుల ప్రకారం ఓట్లేస్తున్నారు. కాని బీజేపీ విషయం అలాకాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కన్నా కాస్త మెరుగనే అభిప్రాయం జనాల్లో మొన్నటివరకు ఉండేది. తాజా మున్సిపల్ ఎన్నికలతో అది కాస్త పోయింది.
దీనికి కొన్ని ఉదాహరణలను చెప్పుకోవాలి. భైంసా మున్సిపాలిటి చాలాకాలంగా ఏఐఎంఐఎంకు కంచుకోట. అలాంటి మున్సిపాలిటీలో 26 వార్డులున్నాయి. వీటిల్లో ఎంఐఎం 12 చోట్ల గెలిచింది. మిగిలిన వార్డులను కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. ఎంఐఎంకు ఛైర్మన్ పదవి దక్కకూడదు అన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, ఇండిపెండెంట్లతో బీజేపీ చేతులు కలిపింది. ఫలితంగా బీజేపీ కౌన్సిలర్ దత్తారాం ఛైర్మన్ అవగా, ఎంఐఎం తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసిన సిద్ధికి వైస్ ఛైర్మన్ అయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎంకు వ్యతిరేకంగా బీజేపీ చేతులు కలిపింది. అలాగే ఎంఐఎం తిరుగుబాటు అభ్యర్ధి సిద్ధికీకి మద్దతుగా ఓట్లేసి వైస్ ఛైర్మన్ను చేసింది.
అవకాశం ఉన్నచోట్ల చేతులు కలిపింది
నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 వార్డుల్లో గెలిచాయి. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్+బీజేపీలు ఏకమైపోయాయి. కాంగ్రెస్ ఛైర్మన్ కు ఓట్లేసి తాను వైస్ ఛైర్మన్ పదవిని తీసుకున్నది. మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్ధి ఛైర్మన్ అవటానికి వీలుగా బీజేపీ కౌన్సిలర్లు పోలింగుకు దూరంగా ఉండిపోయారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు వ్యతిరకంగా బీఆర్ఎస్ తో బీజేపీ చేతులు కలిపింది. ఇక్కడ బీఆర్ఎస్-కాంగ్రెస్ కు చెరిసమానంగా వార్డులు దక్కటంతో మెదక్ బీజేపీ ఎంపీ ఎం. రఘునందనరావు తన కో ఆప్షన్ ఓటుతో బీఆర్ఎస్ ను గెలిపించారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతు తమ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఆదేశాల ప్రకారమే తాను బీఆర్ఎస్ కు ఓటేసినట్లు చెప్పటం సంచలనంగా మారింది.
జిన్నారం మున్సిపాలిటీలో 18 వార్డులున్నాయి. వీటిల్లో బీఆర్ఎస్ 8, బీజేపీ 4, కాంగ్రెస్ 6 వార్డుల్లో గెలిచాయి. కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ తో బీజేపీ చేతులు కలిపింది. బీఆర్ఎస్ కు ఛైర్మన్ పోస్టు దక్కితే బీజేపీకి వైస్ ఛైర్మన్ పదవి దక్కింది. రంగారెడ్డి జిల్లా అమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. ఇందులో కాంగ్రెస్ 1 చోట, బీఆర్ఎస్ 8, బీజేపీకి 6 వార్డులు దక్కాయి. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే ఉద్దేశ్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్, ఎంఎల్ఏ ఎక్స్ అఫీషియో ఓటును బీజేపీ చేతులు కలిపింది. ఛైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్ధి, వైస్ ఛైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ ప్రమాణ స్వీకారంచేశారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏకమైపోయి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకున్నారు.
బీజేపీ మీద గౌరవం పెరిగేది
అవసరానికి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తులు పెట్టుకున్న ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పైన చెప్పిన మున్సిపాలిటీల్లో బీజేపీ ఏపార్టీతోను చేతులు కలపకపోయినా జరిగే నష్టం ఏమీలేదు. ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోమని ఇచ్చిన తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటన చేసుంటే బీజేపీ మీద ఓటర్లలో గౌరవం పెరిగేది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బీజేపీ కౌన్సిలర్లు చలించకుండా ఉండుంటే కనీసం వచ్చేఎన్నికలో అయినా బీజేపీ కొన్ని మున్సిపాలిటీల్లో అయినా జనాలు ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించేవారేమో. అలాంటిది అవకాశం దొరికింది కదాని అవసరమైన చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టేసుకుని పదవులు అందుకోవటంతో మూడుపార్టీలకు తేడా ఏమీలేదని జనాలకు అర్ధమైపోయింది.
డ్యామేజీ జరిగిపోయింది
జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిన తర్వాత తీరిగ్గా అనైతిక మద్దతుపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం అని వార్తలు రాయించుకుంటే ఏమిటి ఉపయోగం ? తాము గెలుచుకున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు బీజేపీ నేతలు రాజీనామాలు చేస్తారా ? పార్టీ చేయించగలదా ? ఒకవేళ రాజీనామాలు చేసినా లేకపోతే చేయించినా పార్టీ ఇమేజికి డ్యామేజి అయితే జరిగిపోయింది కదా. పదవుల కోసం ఇతర పార్టీలకు బీజేపీ మద్దతు ఇవ్వటంపై జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుతో బుధవారం నబీన్, పార్టీ సంస్ధాగత వ్యవహారల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చర్చించారు.
ప్రధానంగా అమన్ గల్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక అంశంపైనే ఫోన్లో రామచంద్రరావును నబీన్, సంతోష్ నిలదీశారు. బీజేపీ తెలంగాణలో బలపడుతున్న సమయంలో ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వటం ద్వారా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిన నేతలు ఎవరు, ప్రజాప్రతినిధులు ఎవరు ? అని తీవ్రంగా ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణ అధ్యక్షుడు ఆదేశాల ప్రకారమే తాను ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కు ఓటేసినట్లు ఎంపీ రఘునందనరావు చెప్పిన విషయం నబీన్, సంతోష్ దృష్టికి వెళ్ళిందా ? తెలీదు. ఫోన్లో మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలపై రామచంద్రరావు ఒక రిపోర్టు తయారుచేసి నబీన్, సంతోష్ కు పంపినట్లు పార్టీవర్గాల సమాచారం. రిపోర్టుపై జాతీయ నాయకత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
రామచంద్రరావు ఆగ్రహం
ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్న స్ధానిక నేతలపైన రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారన్న వార్తలే పెద్ద జోక్. 13వ తేదీ ఫలితాలు వెలువడిన తర్వాత అదేరోజు సాయంత్రం నుండి ఎవరి మద్దతును ఎవరు కోరుకుంటున్నారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతున్నారనే విషయమై సోషల్ మీడియా, మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. 14, 15 తేదీల్లో ఈ వార్తలపై క్లారిటి వచ్చేసింది. అవకాశాన్ని బట్టి కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ తో బీజేపీ నేతలు పొత్తులు పెట్టుకున్నారన్న వార్తలు బహిరంగమైపోయింది. మీడియా, సోషల్ మీడియాలో వార్తలు రామచంద్రరావుకు తెలీకుండానే ఉంటుందా ? అప్పుడు స్పందించని రామచంద్రరావు ఇపుడు తీరిగ్గా స్ధానిక నేతలపై ఆగ్రహం అంటే ఎవరైనా నమ్ముతారా ? తనకు తెలీకుండానే కొందరు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని రామచంద్రరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారట.
మెదక్ ఎంపీ రఘునందనరావును బీఆర్ఎస్ కు ఓటువేయమని అధ్యక్షుడు చెప్పలేదా ? అనే విషయం అయోమయంగా తయారైంది. ఒకవేళ చెప్పకపోతే మరి ఎంపీ అలా ఎందుకు మీడియాతో చెప్పారు ? తనంతట తాను నిర్ణయం తీసుకుని అధ్యక్షుడి ఆదేశాల ప్రకారమే తాను బీఆర్ఎస్ కు ఓటేశానని చెప్పినందకు ఎంపీ మీద పార్టీ యాక్షన్ తీసుకోగలదా ? ఒకవేళ రామచంద్రరావు ఆదేశాల ప్రకారమే ఎంపీ బీఆర్ఎస్ ఓటు వేయటం నిజమైతే అధ్యక్షుడి మీద పార్టీ యాక్షన్ తీసుకోవాలి కదా ? తీసుకుంటుందా ? మొత్తంమీద మున్సిపల్ ఎన్నికల పుణ్యమాని బీజేపీ పరువు రోడ్డుమీద పడిపోయిందన్నది వాస్తవం.

