
దానంకు కౌంట్ డౌన్ త్రీడేసేనా ?
బుధవారం బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ కు స్పీకర్ ఆఫీసు జారీచేసిన నోటీసుతోనే ఈ విషయం అర్ధమవుతోంది
సుప్రింకోర్టు ఆదేశాలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన గట్టిగానే ప్రభావం చూపుతున్నట్లుంది. బుధవారం బీఆర్ఎస్(BRS) ఖైరతాబాద్(Khairatabad)ఎంఎల్ఏ దానం నాగేందర్ కు స్పీకర్ ఆఫీసు జారీచేసిన నోటీసుతోనే ఈ విషయం అర్ధమవుతోంది. ఈనెల 30వ తేదీన విచారణకు హాజరవ్వాలని (Danam)దానంకు స్పీకర్ కు నోటీసులు జారీచేయటం కలకలం రేపుతోంది. ఇంత సడెన్ గా స్పీకర్ కార్యాలయం దానంకు ఎందుకు నోటీసు జారీచేసినట్లు ? ఎందుకంటే ముగ్గురు ఫిరాయింపు ఎంఎల్ఏలు దానం నాగేందర్, (Kadiyam Srihari)కడియం శ్రీహరి, సంజయ్ విషయంలో స్పీకర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఏడుగురు పార్టీ మారలేదని, వాళ్ళంతా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు సాంకేతిక కారణాలను స్పీకర్ చూపించారు. అందుకనే ఏడుగురు ఎంఎల్ఏలపై ఫిరాయింపు ఆరోపణలను స్పీకర్ కొట్టేశారు.
స్పీకర్ లెక్కప్రకారమే ఏడుగురు ఎంఎల్ఏలు పార్టీ మారలేదని అనుకుందాము, మరి మిగిలిన ముగ్గురి విషయాన్ని స్పీకర్ ఎందుకు ఇప్పటివరకు తేల్చలేదు ? ఈ ముగ్గురు కూడా పార్టీ మారలేదనో లేకపోత మారారనో ఏదో ఒకటి ఫైనల్ చేయాలికదా. ఏమీ తేల్చకపోవటంతోనే స్పీకర్ మీద సుప్రింకోర్టు చాలా సీరియస్ అయి రెండువారాల గడువిచ్చింది. సుప్రింకోర్టు ఇచ్చిన రెండువారాల గడువు ఒకటిరెండు రోజుల్లో అయిపోతుంది. అందుకనే ఇపుడు అర్జంటుగా దానంకు స్పీకర్ కార్యాలయం విచారణకు రమ్మని నోటీసులు జారీచేసింది.
సరే, ఇపుడు దానం విషయాన్నే తీసుకుంటే ఈ ఎంఎల్ఏ మీద అనర్హత వేటుపడటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సుప్రింకోర్టు ఆగ్రహంనుండి తప్పించుకోవాలంటే మిగిలిన ముగ్గురి విషయంలో స్పీకర్ ఏదోక నిర్ణయం ప్రకటించాల్సిన అగత్యం వచ్చింది. ఏదో ఒక నిర్ణయం అంటే మిగిలిన ఏడుగురు ఎంఎల్ఏల విషయంలో పార్టీ మారలేదని సింపుల్ గా దానం విషయంలో తేల్చేసేందుకు లేదు. ఎందుకంటే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్న దానం సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీచేయటమే కారణం. ఒకపార్టీ ఎంఎల్ఏగా ఉంటు మరో పార్టీ ఎంపీగా పోటీచేయటం ఏమిటి కక్కుర్తి కాకపోతే. దానం ఎలా పోటీచేయాలని అనుకున్నారు ? దానంకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇలాగ ఇచ్చిందో ఇప్పటికీ అర్ధంకావటంలేదు. ఇక్కడే దానం పార్టీ ఫిరాయింపు క్లియర్ గా బయటపడింది.
కాబట్టే దానంపైన అనర్హత వేటుపడటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఇక్కడే మరోప్రచారం కూడా మొదలైపోయింది. అదేమిటంటే స్పీకర్ తనపైన అనర్హత వేటు వేసేముందే తానే రాజీనామా చేయాలని దానం డిసైడ్ అయ్యారు అని. అనర్హత వేటుపడినా, రాజీనామా చేసినా తొందరలోనే ఖైరతాబాద్ సీటు ఖాళీ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇపుడు దానంపైన అనర్హత వేటు వేయకపోతే సుప్రింకోర్టుకు స్పీకర్ సమాధానం చెప్పుకోవాల్సుంటుంది. దానంపైన స్పీకర్ అనర్హత వేటు వేయకపోయినా సుప్రింకోర్టు అనర్హత వేటు వేస్తే స్పీకర్ పరువుపోతుంది. అనర్హత వేటు నిర్ణయమేదో స్పీకరే తీసుకుంటే పరువు కాపాడుకున్నట్లవుతుంది, సుప్రింకోర్టు ఆగ్రహం నుండి తప్పించుకున్నట్లూ అవుతుంది. అనర్హత వేటుపడితే అప్పుడు దానం న్యాయపోరాటం చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
ఏదేమైనా క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే దానంకు కౌంట్ డౌన్ మూడురోజులు మాత్రమే అన్న విషయం అర్ధమైపోతోంది. మరి కడియం, సంజయ్ విషయంలో స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి పెరిగిపోతోంది.

