
బీఆర్ఎస్, బీజేపీలను నిరుత్సాహపరిచిన ఉగాది పంచాంగ శ్రవణం
ప్రతిపక్షాల కార్యాలయాల్లో పూజలు చేసిన తర్వాత చదివే పంచాంగంలో ప్రతిపక్షాలకు, వాటి అధినేతలకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పటం రివాజే
ఉగాది పండుగనాడు ఉగాది పచ్చడి ఎంత పాపులరో పంచాంగ శ్రవణం కూడా అంతే పాపులర్. కాకపోతే పంచాంగకర్తల్లో కొందరి వల్ల పంచాంగశ్రవణం అంటే జనాలు నవ్వుకునేస్ధాయికి దిగజారిపోయింది. ఎందుకంటే పంచాంగం చదివి వినిపించేవాళ్ళు రకరకాల కారణాలతో తాము ఏ పార్టీ ఆఫీసులో కూర్చుని పంచాంగం శ్రవణం చేస్తున్నారో ఆ పార్టీలకు, వాటి అధినేతలకు అనుకూలంగా చెబుతున్నారు. అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా పంచాంగం శ్రవణం చేసేవారు బ్రహ్మాండమని, ఆహో...ఓహో అని మోసేస్తుంటారు.
అలాగే ప్రతిపక్షాల కార్యాలయాల్లో పంచాంగం వినిపించేవాళ్ళు పూజలు చేసిన తర్వాత చదివే పంచాంగంలో ప్రతిపక్షాలకు, వాటి అధినేతల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పటం రివాజే. పార్టీలిచ్చే సంభావన కోసం కావచ్చు లేదా పిలిచి పంచాంగం చెప్పించుకుంటున్నపుడు గొప్పగా చెప్పకపోతే బాగోదన్న మొహమాటంతోనే ఏదో చెప్పేస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి పంచాంగంలో ఏముందో అదిమాత్రమే చెబితే అభినందించే నేతలు ఎంతమంది ఉంటారు ? అందుకనే పంచాంగ శ్రవణం చేసే వాళ్ళు కూడా పార్టీల మనసు తెలుసుకునే నడుచుంటుంటారు.
అదేవిధంగా ఈ ఉగాది సందర్భంగా గురువారం నాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక పంచాంగ శ్రవణం జరిగితే బీఆర్ఎస్, బీజేపీ ఆఫీసుల్లో కూడా పంచాంగం చదివి వినిపించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగిన పంచాంగశ్రవణంలో రాష్ట్ర భవిష్యత్తు బ్రహ్మాండమని చెబితే ప్రతిపక్షాల పార్టీల ఆఫీసుల్లో జరిగిన పంచాంగశ్రవణాలు మాత్రం వారిని నిరుత్సాహ పరిచాయనే చెప్పాలి. పై రెండు ఆఫీసుల్లో జరిగిన పంచాంగశ్రవణంలో ఏదో ముక్తసరిగా పంచాంగశ్రవణం జరిగినట్లుగానే అనిపిస్తోంది.
ఎందుకంటే రెండుపార్టీల ఆఫీసుల్లో కూడా దేశానికి చాలామంచి జరుగుతుందని, రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని, దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయని, వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. వర్షాలకు ఢోకా ఉండదని, ఆహార ధాన్యాల ధరలు పెరగచ్చన్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల్లో కొందరు కనుమరుగయ్యే అవకాశాలున్నాయని, ప్రజలు కుంగిపోతారని, పంటలు బాగాపండి రైతులు సంతోషంగా ఉంటారని చెప్పారు. రైతులకు సంతోషం కలిగేలా ప్రభుత్వాన్ని ప్రతిపక్షం హెచ్చరిస్తుందని బీఆర్ఎస్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో చెప్పారు.
రెండు ఆఫీసుల్లోను పండితులు చదివి వినిపించిన పంచాంగంలో ఎక్కడా రాజకీయ సంక్షోభాలు సంభవిస్తాయని లేదా ప్రభుత్వం బలహీనపడుతుందని, ప్రతిపక్షాలు బలపడతాయని, అధినేతలకు తొందరలోనే పదవీయోగం అనే మాటలు చెప్పలేదు. ఏ పార్టీ ఆఫీసులో పంచాంగశ్రవణం జరుగుతుందో ఆ ఆపీసులోని బాసులు మెచ్చేట్లుగా పంచాంగం వినిపించటం పండితులకు బాగా అలవాటు. కాని ఈసారి మాత్రం అలా జరగకుండా రివర్సులో పంచాంగంలో ఏముందో అదిమాత్రమే చదివి వినిపించినట్లు అర్ధమవుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డిని ఆహాఓహో అంటు పండగనాడు ఆకాశానికి ఎత్తేస్తే అదేసమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఆఫీసుల్లో ఏదో ఉగాది పంచాంగశ్రవణం జరిగిందంటే జరిగిందన్నట్లుగా మొదలై ముగిసింది.

