కేసీఆర్‌కు పట్టిన గతే విజయన్‌కూ పడుతుంది: రేవంత్
x

కేసీఆర్‌కు పట్టిన గతే విజయన్‌కూ పడుతుంది: రేవంత్

కేరళ ప్రచారంలో రేవంత్ రెడ్డి విజయన్‌పై విమర్శలు చేశారు. మోదీతో అవగాహన, కేసులపై కీలక వ్యాఖ్యలు వెలువరించారు.


తెలంగాణలో కేసీఆర్‌కు పట్టిన గతే కేరళలో పినరయి విజయన్‌కు పడుతుందని, అందులో సందేహం లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్.. హుషారుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్ నెల ఆరంభంలో రెండు రోజులు ప్రచారం చేసిన రేవంత్.. ఇప్పుడు మరోసారి కేరళలో కాంగ్రెస్ ప్రచార రథాలను ఎక్కారు. ఇందులో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. వీటిలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్, ప్రధాని మోదీ భాయ్ భాయ్ అన్నారు. అందుకే పినరయిని ఏ దర్యాప్తు సంస్థ టచ్ చేయడం లేదని, మోదీనే పినరయిని కాపాడుకుంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ ప్రచారం సందర్బంగా పినరాయి విజయన్ తనకు ఓ లేఖ రాసినట్లు రేవంత్ చెపప్పారు. ఆ లేఖలో 2014 నుంచి 2023 మధ్య జరిగిన అంశాలను ప్రస్తావించారని తెలిపారు. ఆ సమయంలో విజయన్‌కు సన్నిహితుడైన కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆ లేఖలో పినరయి ప్రస్తావించిన అన్ని తప్పులు తెలంగాణలో జరిగాయని, వాటిని గ్రహించిన ప్రజలు కేసీఆర్‌ను గద్దె దించేశారని అన్నారు రేవంత్. ఇప్పుడు కేరళలో కూడా అదే పరిస్థితి రానుందని జోస్యం చెప్పారు.

విజయన్‌పై శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఈ కేసుల నుంచి ఆయనను నరేంద్ర మోదీ రక్షిస్తున్నారని విమర్శించారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై మాత్రం వివిధ కేసులు పెడుతున్నారని, అదే సమయంలో అర్వింద్ కేజ్రీవాల్ వంటి నేతలను ఈడీ కేసులతో అరెస్టు చేస్తున్నారని అన్నారు. కానీ విజయన్ విషయంలో అలాంటి చర్యలు లేవని ప్రశ్నించారు. మోదీ, విజయన్ మధ్య అవగాహన ఉందని ఆరోపిస్తూ, దీనిని కేరళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ మార్పు కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story