Telangana CM Revanth Reddy
x

‘కేసీఆర్‌ను ఎప్పుడో అరెస్ట్ చేసేటోళ్లం’

ఫోన్ ట్యాపింగ్, కల్వకుంట్ల ఫ్యామిలీపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.


తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఎప్పుడో అరెస్ట్ చేసుండేటోళ్లమన్నారు. కానీ తాము కక్ష సాధింపు రాజకీయాలు చేయడం లేదని, చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షరాజకీయాలు చేస్తోందన్న విమర్శలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడే పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే నిజంగా తాము కక్ష రాజకీయాలు చేసి ఉంటే కేసీఆర్ ఇన్ని రోజులు ఫామ్ హౌస్‌లో ఉండేవాళ్లు కాదని, ఎప్పుడో అందరినీ లోపల వేయించేవాళ్లమని వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించలేదని తెలిపారు. దొంగచాటుగా ఫోన్లు వినడం తమ విధానం కాదన్నారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. పై అధికారుల ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు అంగీకరించాడని తెలిపారు.

ఆయన విచారణ అనంతరం ఒక్కొక్కరికి సిట్ నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ప్రభాకర్ రావును విదేశాల నుంచి తీసుకువచ్చినట్టు వివరించారు. ఎస్ఐబీలో పరికరాలు ధ్వంసం చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరామని తెలిపారు. కేంద్రం ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు ఆదేశించలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కమిటీ నివేదిక తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడని, భారతరత్నకు అర్హుడని పేర్కొన్నారు. 2029లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. తానే దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉంటానని అన్నారు. ప్రభుత్వం చట్టబద్ధంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

Read More
Next Story