టెక్నికల్ కారణాలతోనే వేటునుండి ఎంఎల్ఏలు బయటపడ్డారా ?
x
Speaker Gaddam Prasad Kumar and alleged BRS defected MLAs

టెక్నికల్ కారణాలతోనే వేటునుండి ఎంఎల్ఏలు బయటపడ్డారా ?

తాజా తీర్పుతో పదిమంది ఎంఎల్ఏల్లో ఎవరు కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని స్పీకర్ తీర్పు ఇచ్చినట్లయ్యింది


మొత్తం 10మంది ఫిరాయింపు ఎంఎల్ఏలు అనర్హత వేటునుండి బయటపడిపోయారు. ఎనిమిదిమంది ఎంఎల్ఏలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలోనే క్లీన్ చిట్ ఇవ్వగా బుధవారం దానం నాగేందర్, కడియం శ్రీహరికి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చేశారు. తాజా తీర్పుతో పదిమంది ఎంఎల్ఏల్లో ఎవరు కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని స్పీకర్ తీర్పు ఇచ్చినట్లయ్యింది. తాజా తీర్పుతో సుమారు ఏడాదికాలంగా పదిమంది ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయించాలన్న బీఆర్ఎస్ పే.....ద్ద పోరాటం అసెంబ్లీలో ముగిసినట్లే. ఇక మిగిలింది సుప్రింకోర్టులో విచారణ మాత్రమే.

ఫిరాయింపులపై అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, కేపీ వివేకానందగౌడ్ న్యాయస్ధానాల్లో పెద్ద పోరాటమే చేస్తున్నారు. సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, హైకోర్టులో పోరాటం అయిపోయి ఇపుడు సుప్రింకోర్టులో జరుగుతోంది. ఫిరాయింపుల అనర్హత వేటుపై గురువారం సుప్రింకోర్టులో విచారణ జరగబోతోంది. అందుకనే ఒక్కరోజు ముందు స్పీకర్ బుధవారమే అందరికీ క్లీన్ చిట్ ఇస్తు తీర్పిచ్చేశారు. కాబట్టి స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ కోర్టులో సవాలు చేస్తు మరో పిటీషన్ వేయాల్సుంటుంది. సరే, సుప్రింకోర్టు విచారణ ఏ విధంగా జరుగుతుంది ? చివరకు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అన్నది అప్రస్తుతం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టెక్నికల్ కారణాలతోనే ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల్ ఎంఎల్ఏ సంజయ్ కుమార్, గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి అనర్హత వేటునుండి బయటపడినట్లు అర్ధమవుతోంది.

ఇంతకీ వీళ్ళు బయటపడిన ఆ సాంకేతిక అంశాలు ఏమిటి ? ఇందులో ప్రధానంగా నాలుగు పాయింట్లున్నాయి. అవేమిటంటే పదిమందిపైన అనర్హత వేటు వేయాలని పార్టీపరంగా అధినేత కేసీఆర్ అధికారికంగా స్పీకర్ కు ఫిర్యాదు చేయలేదు. ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు చేసిన వారంతా వ్యక్తిగత హోదాలోనే ఫిర్యాదులు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ వుండగా వ్యక్తిగత హోదాలో ఎంఎల్ఏలు ఫిరాయింపులపై అనర్హత వేటుకు ఫిర్యాదులు చేసినా చెల్లదని ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ చెప్పారు.

రెండో పాయింట్ ఏమిటంటే అసెంబ్లీనుండి పదిమంది ఎంఎల్ఏలకు అందుతున్న జీతాల్లో నుండి ప్రతినెలా పార్టీఫండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ రు. 5 వేలు మినహాయించుకుంటున్నది. ఒకవైపు పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపిస్తు మరోవైపు ఈ 10మంది తమ పార్టీవారు కాదని కేటీఆర్, ఎంఎల్ఏలు ఎలా చెప్పగలరు ? 10మంది ఎంఎల్ఏల జీతాల్లోనుండి ప్రతినెలా రు. 5 వేలు మినహాయిస్తున్నారంటేనే వాళ్ళంతా తమపార్టీ ఎంఎల్ఏలని అంగీకరిస్తున్నట్లే కదా.

మూడో పాయింట్ ఏమిటంటే అసెంబ్లీలో జరిగిన చర్చలు లేదా ఓటింగులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ఓటింగ్ చేయాలనే విప్ ను బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పుడూ జారీచేయలేదు. కాబట్టే చర్చల సందర్భంగా తాము స్వేచ్చగా వ్యవహరించినట్లు దానం, కడియంశ్రీహరి చెప్పారు. స్పీకర్ పరిధిలో తాను ఎప్పుడూ పొరబాటు చేయలేదని దానం స్పష్టంచేశారు. తమపై యాక్షన్ తీసుకునే లేదా ఫిర్యాదులు చేసే అధికారం కేవలం అధినేత కేసీఆర్ కు తప్ప ఇంకెవరికీ లేదన్నారు.

ఇక నైతికత గురించిన ప్రశ్నే అవసరంలేదు. ఎందుకంటే ఫిరాయింపులకు అసలు తెరలేపిందే కేసీఆర్. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్, టీడీపీ నుండి 18మంది ఎంఎల్ఏలను, 23మంది ఎంఎల్సీలను, 4 ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. వీరిలో కొందరికి మంత్రులను కూడా చేశారు. ఇదే విషయాన్ని దానం ప్రస్తావిస్తు కేసీఆర్ కు వర్తించని నైతికతను తాము మాత్రం ఎందుకు పట్టించుకోవాలని ఎదురు ప్రశ్నించారు. అలాగే ఒకపార్టీ ఎంఎల్ఏగా ఉంటూ మరో పార్టీ తరపున ఎంపీగా పోటీచేయకూడదని ఏ చట్టంలో ఉందో చూపించాలని కూడా దానం అడిగాడు. స్వతంత్రపౌరుడిగా తనకు ఉన్న సంపూర్ణ స్వేచ్చ ఆధారంగానే తాను వ్యవహరించినట్లు దానం క్లారిటి ఇచ్చారు. కాబట్టి దానం చెప్పింది విన్నతర్వాత తర్వాత పార్టీలు మిథ్య..ఫిరాయింపులు మిథ్య స్పీకర్ క్లీన్ చిట్ ఒక్కటే వాస్తవం అన్నది అర్ధమవుతోంది.

Read More
Next Story