‘కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్ళల్లో కలిసిపోయాయి’
x
Kaleswaram Project

‘కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్ళల్లో కలిసిపోయాయి’

కేసీఆర్, హరీష్ తో పాటు ఇంకా చాలామందిని బాధ్యులుగా గుర్తించినట్లు చెప్పింది


కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎంతకాలమైనా చర్చలకు మాత్రమే పరిమితమవుతోంది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో దాదాపు లక్షన్నర కోట్లరూపాయల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం కూలిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయిందన్నది వాస్తవం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తో విచారణ చేయించింది. కమిషన్ కేసీఆర్, హరీష్ తో పాటు ప్రాజెక్టులో పనిచేసిన సుమారు 140మందిని దాదాపు ఏడాదికాలం విచారించింది. చివరగా ఇచ్చిన నివేదికలో కేసీఆర్, హరీష్ తో పాటు ఇంకా చాలామందిని బాధ్యులుగా గుర్తించినట్లు చెప్పింది. వీళ్ళంతా ఏ విధంగా బాధ్యులో కూడా కమిషన్ తన రిపోర్టులో తేల్చింది. రిపోర్టయినా, ఆరోపణలైనా అన్నీ అంతిమంగా చూపుతున్నది కేసీఆర్ వైఫల్యాన్నే. అయితే కేసీఆర్ మాత్రం కాళేశ్వరం వైఫల్యంలో తనకు ఎలాంటి సంబంధంలేదని అనటమే ఆశ్చర్యంగా ఉంది.

తన హయాంలో, తన నేతృత్వంలో మొదలుపెట్టి పూర్తిచేసిన అంతపెద్ద ప్రాజెక్టు చివరకు తాను సీఎంగా ఉన్నపుడే పనికిరాకుండా పోయినా తమకు సంబంధంలేదంటు బుకాయించటం కేసీఆర్, హరీష్ కు మాత్రమే చెల్లింది. కమిషన్ నియామకంపైన, రిపోర్టు అమలుపైన కేసీఆర్, హరీష్ తదితరులు వేర్వేరుగా హైకోర్టులో పిటీషన్లు వేశారు. ఆ పిటీషన్లపై కోర్టులో విచారణ జరుగుతున్నది.

ఇపుడు విషయం ఏమిటంటే పార్లమెంటు ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తు కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చుచేసిన లక్ష కోట్లు నీళ్ళల్లో కొట్టుకుపోయాయని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తు కాళేశ్వరంపై రు. 30 వేల కోట్ల ఖర్చుపెట్టిన తర్వాత రాష్ట్రప్రభుత్వం దాని ఎప్రైజల్ కోసం తమ శాఖ దగ్గరకు వచ్చినట్లు చెప్పారు. కేంద్రంనుండి ప్రాజెక్టు కోసం ఎలాంటి నిధులు తీసుకోలేదని కూడా మంత్రి చెప్పారు. ప్రాజెక్టు మీద ప్రభుత్వం చేసిన లక్ష కోట్లరూపాయలు నీళ్ళల్లోనే కొట్టుకుపోయిన విషయం దేశానికంతా తెలుసని మంత్రి సెటైర్లు కూడా వేశారు. అవినీతిపై అధ్యయనంచేస్తున్న ఏజెన్సీల పనితీరు చాలా నిదానంగా సాగుతోందని కూడా మంత్రి చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై కాగ్ నివేదికకు సంబంధించి చర్యలు తీసుకునే అంశం రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిది అని తేల్చిచెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమంతా నాసిరకంగా జరిగిందని కంటికి కనబడుతోంది. నాసిరకంగా నిర్మించి ప్రాజెక్టు పనికిరాకుండాపోవటానికి కారణం కేసీఆర్, హరీష్ అన్న విషయం అందరికీ తెలుసు. అయినా సరే వీళ్ళిద్దరితో పాటు బాధ్యులైన ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులపై ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయింది. అలాగే కాళేశ్వరం అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగిస్తు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం జరిగి సుమారు 7 నెలలైనా ఇఫ్పటివరకు కేంద్రహోంశాఖ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. కాగ్ నివేదిక మీద యాక్షన్ తీసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానిదే అని అంటున్న కేంద్రమంత్రి పాటిల్ మరి సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సిఫారసు గురించి మాత్రం నోరెత్తటంలేదు. కేసీఆర్ అవినీతిపైన సీబీఐ విచారణ మొదలుపెట్టబోతోందని కేంద్రం ఎందుకు ప్రకటించటంలేదన్నది సమాన్య జనాలకు అర్ధంకావటంలేదు.

కాళేశ్వరంపై కేసీఆర్ కుటుంబం మీద యాక్షన్ తీసుకోవటం రేవంత్ ప్రభుత్వానికి చేతకాకపోతే కేసును సీబీఐకి అప్పగించండి 48 గంటల్లో అందరిపైనా కేసులు నమోదుచేసి లోపలేస్తామని కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎన్నిసార్లు చాలెంజులు చేశారో. అలాంటిది రేవంత్ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన తర్వాత నుండి కాళేశ్వరం అవినీతిపైన బండి, కిషన్ నోరెత్తితో ఒట్టు. ఇదే విషయాన్ని రేవంత్, మంత్రులు ఎంతగా అడుగుతున్నా కేంద్రమంత్రులు అసలు సమాధానమే చెప్పటంలేదు. కేసీఆర్ ను రక్షించటానికే కేంద్రమంత్రులు సీబీఐ విచారణకు అప్పగించమని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా విచారణపై హైకోర్టులోని కేసులు తెమలవు, కేంద్రప్రభుత్వం సీబీఐ విచారణ విషయంలో నిర్ణయం తీసుకోదు. అందుకనే బీఆర్ఎస్-బీజేపీ చాకటిబంధంపై జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్నే రేవంత్, మంత్రులు పదేపదే జనాలకు చెబుతున్నారు. పై రెండుపార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలాగ ఉపయోగించుకుంటోందని స్వయంగా నరేంద్రమోదీ, అమిత్ షా నే బహిరంగసభల్లో ఆరోపణలు చేశారు. అయినా కేసీఆర్ అవినీతిపై సీబీఐతో విచారించాలని రేవంత్ ప్రభుత్వం సిఫారసుచేస్తే కేంద్రంలో ఉలుకు పలుకులేదు. ఈ నేపధ్యంలోనే కాళేశ్వరం ప్రజాక్టులో అవినీతి జరిగిందని కేంద్రమంత్రి సాక్ష్యాత్తు పార్లమెంటులోనే అంగీకరించటం గమనార్హం. అయినా తప్పుచేసిన వారిపై చర్యలకు మాత్రం కేంద్రం వెనకాడుతోంది. బాధ్యులపై చర్యలకు కేంద్రం ఎప్పుడు రెడీ అవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story