
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
నబీన్ నియామకం వెనక మోదీ- షా వ్యూహం ఏంటీ?
పార్టీపై పట్టును పెంచుకుంటున్నారా? వదిలేస్తున్నారా?
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ కు చెందిన నితిన్ నబీన్(Nitin Nabin) ను నియమించడం వెనకు ప్రధాని మోదీ(Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)వెనక వేరే ఉద్దేశ్యాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
పార్టీలో కొత్తతరాన్ని ప్రొత్సహించడంతో పాటు, వచ్చే నాయకత్వం కూడా తమ విధేయులుగా ఉన్నవారికే అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీని తమ అదుపులోనే ఉంచుకోవాలని వ్యూహం ఇందులో మిళితమైనట్లు అర్థమవుతోంది.
బీహార్ యువ నాయకుడే ఎందుకు?
బీహార్ లో నితిన్ నబీన్ నివాసాన్ని గత ఏడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. అప్పట్లోనే ఆయన ఇక్కడకు స్వయంగా ఎందుకొచ్చారో అర్థంకాకున్నా, జాతీయ నాయకత్వం మదిలో కచ్చితంగా ఆయనే పార్టీ అధ్యక్షుడి ఉంటే తమకు లాభిస్తుందని సూచనప్రాయ ప్రణాళిక ఉంది. స్థానికంగా నితిన్ నబీన్ కు క్యాబినేట్ లో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ అవి వాస్తవం కాదని తరువాత అందరికి అర్థం అయింది.
నబీన్ సామర్థ్యం..
జాతీయ నాయకుడిగా నితిన్ నబీన్ కు ఉన్న సామర్థ్యం కంటే.. ఆయన ప్రధానిమోదీ, అమిత్ షాలకు వీర విధేయుడిగా ఉండటం మూలంగానే లభించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నబీన్ మోదీ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, చత్తీస్ గఢ్ లో కేంద్ర నాయకత్వం ఆయనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం కూడా ఆయన జాతీయ నాయకుడిగా ఎదగడానికి కీలక పాత్ర పోషించింది.
ఇదే సమయంలో నితిన్ కు బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉండటం కూడా కలిసి వచ్చింది. 2024 ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీకి అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ 240 సీట్ల మార్క్ దగ్గరే ఆగిపోయింది. ఇందుకు కారణం ఆర్ఎస్ఎస్ సహాయ నిరాకరణ చేయడమే. బీజేపీ వారి సాయాన్ని కోరడానికి ఇష్టపడకపోవడంతో ఆ సంస్థ కూడా పార్టీతో అంటిముట్టనట్లు వ్యవహరించింది.
అప్పటి నుంచి సంఘ్ పెద్దలతో బీజేపీ ప్రస్తుత కేంద్ర నాయకత్వానికి చెడిందని అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నబిన్ ఎంపిక ఆర్‌ఎస్‌ఎస్‌ను మళ్లీ దగ్గర తీసుకునే ప్రయత్నంగా చూడవచ్చని కొందరి అభిప్రాయపడుతున్నారు.
“తమ వ్యక్తి” బీజేపీ అగ్రస్థానంలో ఉండాలన్న ఆకాంక్ష కూడా నితిన్ నియామకంతో పూర్తయినట్లు కనిపిస్తుంది. బయటకు సంఘ్ పరివార్ ప్రభావం పెరిగినట్టు కనిపిస్తున్నా.. నిజానికి పార్టీపై మోదీ–షాల పట్టు మరింత బలపడుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది.
అమిత్ షా మార్క్ లెక్కలు..
నబీన్ బీహార్ లోని ప్రభావవంతమైన కాయస్థ కులాలకు చెందినవారు. ఈయన ఎంపిక చేయడంతో వారితో పాటు వెనకబడిన కులాలకు సులభంగా దగ్గర కావచ్చనే షా మార్క్ కులాల లెక్కలు కూడా ఉన్నాయని పరిశీలకుల వాదన. బీహార్ అంటేనే కుల రాజకీయాలను పేరుగాంచింది. అక్కడ చాలా పార్టీలు కులం ప్రాతిపదికనే ఏర్పాటు అయ్యాయి.
నబీన్ నియామకం బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు బలోపేతం చేయడంతో పాటు కొత్త వర్గాలను ఆకర్షిస్తుందని అమిత్ షా ఆలోచన అనే వాదన వినిపిస్తోంది. నితిన్ నబిన్ నియామకం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే కీలక మలుపు. ఇది నిజంగా యువతకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పడానికి తీసుకున్న నిర్ణయమా? లేక పార్టీపై మోదీ–షాల ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసే వ్యూహమా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.
అసలు నితిన్ ఎవరూ?
పాట్నాలోని బీఐటీ(BIT) కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన నబిన్.. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు పూర్తిచేయలేకపోయారు. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2006 నుంచి బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నబిన్ కుటుంబానికి ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉంది. బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు.
Next Story

