కేసీఆర్ విచారణ నోటీసులో సిట్ తప్పుచేసిందా ?
x
KCR and SIT notice

కేసీఆర్ విచారణ నోటీసులో సిట్ తప్పుచేసిందా ?

ఇద్దరు ప్రముఖ లాయర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలను చూస్తే కేసీఆర్ కు సిట్ అధికారులు జారీచేసిన నోటీసులు చెల్లవు అని తేలిపోయింది


టెలిఫోన్ ట్యాపింగ్ విచారణకు రమ్మని సిట్ అధికారులు కేసీఆర్ కు జారీచేసిన నోటీసులు చెల్లవా ? చెల్లవనే న్యాయనిపుణులు అంటున్నారు. ట్యాపింగ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరవ్వాలని గురువారం మధ్యాహ్నం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. 160 సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసును సిట్ అధికారులు జారీచేశారు. విచారణకు కేసీఆర్ హాజరుకాకుండా వాయిదా కోరగా అందుకు అధికారులు అంగీకరించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శుక్రవారం ఉదయం నుండి కేసీఆర్ కు సిట్ అధికారులు జారీచేసిన నోటీసు చెల్లదనే వాదన మొదలైంది. బీఆర్ఎస్ లాయర్ మోహిత్ రావు మాట్లాడుతు 160 సీఆర్పీసీ ప్రకారం సిట్ అధికారులు కేసీఆర్ కు జారీచేసిన నోటీసు చెల్లుబాటు కాదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్ళు నిండిన వ్యక్తులను వాళ్ళున్న ప్రాంతానికే వెళ్ళి పోలీసులు విచారించాలని చెప్పారు.


అయితే సిట్ అధికారులు మాత్రం కేసీఆర్ ను హైదరాబాద్ పరిధిలోకి రావాలని సూచించటం చట్టప్రకారం చెల్లదన్నారు. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ ఎక్కడకు రమ్మంటే అక్కడకు వచ్చి విచారిస్తామని సిట్ అధికారులు నోటీసులో చెప్పటం చట్టవ్యతిరేకం అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా నోటీసులు జారీచేసి విచారణకు రమ్మని సిట్ కోరటం చెల్లుబాటు కాదని మోహిత్ రావు అన్నారు.

సిట్ నోటీసులు చెల్లవు : రచనారెడ్డి

మరో ప్రముఖ లాయర్ రచనారెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం కేసీఆర్ కు సిట్ అధికారులు జారీచేసిన నోటీసులు చెల్లవు అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. తెలంగాణ ఫెడరల్ తో లాయర్ మాట్లాడుతు ‘‘హైదరాబాద్ పరిధిలోకి కేసీఆర్ ను రమ్మని సిట్ చెప్పటం అసంబద్ధంగా ఉంది’’ అన్నారు. ‘‘కేసీఆర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి విచారణ చేయాల్సిందే’’ అని రచన చెప్పారు. ‘‘65 ఏళ్ళు దాటిన వ్యక్తులను విచారించేటపుడు పోలీసులు వాళ్ళ ప్రాంతానికే వెళ్ళి విచారించాలి’’ అన్నారు.


‘‘విచారణకు సరిహద్దలు నిర్ణయించటమే సిట్ అధికారులు చేసిన తప్పు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘కేసీఆర్ విచారణకు సిట్ అధికారులు మరో నోటీసును జారీ చేయాల్సిందే’’ అని లాయర్ తెలిపారు. ‘‘ఈసారైనా సరైన సెక్షన్లు పెట్టి నోటీసులు జారీచేస్తే అప్పుడు విచారణ సాధ్యమవుతుంది’’ అని అన్నారు. ‘‘హైదరాబాద్ పరిధిలోపు కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి విచారిస్తామని సిట్ అధికారులు చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అన్నారు. ‘‘కేసీఆర్ ను సిట్ అధికారులు చాయ్ తాగటానికి రమ్మంటున్నారా’’ ? అని రచనారెడ్డి ఎద్దేవాచేశారు.

ఇద్దరు ప్రముఖ లాయర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలను చూస్తే కేసీఆర్ కు సిట్ అధికారులు జారీచేసిన నోటీసులు చెల్లవు అని తేలిపోయింది. మరి చెల్లుబాటు కాని సెక్షన్ పెట్టి సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసు ఎందుకు జారీచేసినట్లు ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సిట్ బృందంలో ఒక్కొక్కళ్ళకు 20, 25 ఏళ్ళ అనుభవం ఉన్న అధికారులే ఉన్నారు. సిట్ కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ కు అపారమైన అనుభవం ఉంది. ఇంతమంది అనుభవం ఉన్న అధికారులుండి చివరకు చెల్లుబాటుకాని సెక్షన్ పెట్టి నోటీసు జారీచేయటమే ఆశ్చర్యంగా ఉంది. తాము నోటీసు జారీచేసినట్లుండాలి, కేసీఆర్ విచారణకు హాజరుకానట్లుండాలి అన్న పద్దతిలో నోటీసు జారీ అయ్యిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీఆర్ ను విచారించేందుకు అసలు సిట్ అధికారుల్లో సీరియస్ నెస్ ఉందా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈసారి ఇవ్వబోయే నోటీసుల్లో సిట్ అధికారులు ఎలాంటి సెక్షన్లు పెడతారో చూడాలి.

కల్వకుంట్ల ఫ్యామిలీని శిక్షించాల్సిందే : కూరపాటి

‘‘ట్యాపింగ్ విచారణను తొందరగా పూర్తిచేసి బాధ్యులైన కల్వకుట్ల ఫ్యామిలీని శిక్షించాల్సిందే’’ అని కూరపాటి వెంకటనారాయణ అన్నారు. కాకతీయ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి మాట్లాడుతు ‘‘ట్యాపింగ్ అరాచకం ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణకు చాలా చెడ్డపేరు తెచ్చింది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయ ప్రత్యర్ధులను, అనుమానిత వ్యక్తులను ట్యపింగ్ ద్వారా వేధించటం చాలా అమానుషం’’ అని కూరపాటి మండిపడ్డారు. ‘‘ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి అక్రమంగా చొరబడటానికి కేసీఆర్ ఫ్యామిలీకి అధికారం ఎవరిచ్చారు’’ అని సూటిగా ప్రశ్నించారు. ‘‘కన్నకూతురు, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారంటేనే కేసీఆర్ పాలనలో అరాచకం ఏ స్ధాయిలో జరిగిందో అర్ధమవుతోంది’’ అని కూరపాటి అన్నారు.

కేసీఆర్ సమాధానం ఊహించిందే

టెలిఫోన్ ట్యాపింగ్ లో శుక్రవారం విచారణకు హాజరవటం సాధ్యంకాదని కేసీఆర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులకు రాసిన లేఖ ఆశ్చర్యం కలిగించలేదు. సిట్ అధికారులు అడిగినట్లు విచారణకు హాజరైతేనే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే విచారణకు హాజరవటాన్ని కేసీఆర్ అవమానంగా భావిస్తున్నారు. లేకపోతే సిట్ అధికారులు నోటీసులో చెప్పినట్లుగా విచారణకు ఎందుకు హాజరుకాలేదు ? ఎందుకంటే సిట్ విచారణకు కేసీఆర్ మానసికంగా ప్రపేర్డుగా లేరని అర్ధమవుతోంది. ఇంతకుముందే తన్నీరు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును సిట్ అధికారులు దాదాపు ఏడేసిగంటలు విచారించిన విషయం తెలిసిందే.

తొందరలోనే విచారణ తనదాకా వస్తుందని అనుకున్నారు కాని ఇంత సడెన్ గా విచారణకు పిలుస్తారని ఊహించుండరు. విచారణలో తనను కూడా అన్నేసి గంటలు కూర్చోబెడితే ఏమి సమాధానాలు చెప్పాలనే విషయంలో సిద్ధంగా ఉండివుండరు. అందుకనే నోటీసులు అందగానే ఏమిచేయాలో అర్ధంకాక విచారణను వాయిదా వేయాలని కోరారు. సిట్ కూడా అగీకరించింది కాబట్టి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11వ తేదీ తర్వాత విచారణ తేదీ ఖరారవుతుంది. ఈలోపు సిట్ అడగబోయే ప్రశ్నలు ఏమిటి ? వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలనే విషయంలో కేసీఆర్ ప్రిపేర్ అయ్యేందుకు కావాల్సినంత సమయం దొరికింది. మున్సిపల్ ఎన్నికలు అన్నది కేవలం సాకు మాత్రమే అన్న విషయం అందరికీ అర్ధమవుతోంది.

ఆమధ్య కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కూడా ముందు నోటీసులు అందగానే కేసీఆర్ హాజరుకాలేదు. నోటీసులో పేర్కొన్న రోజున కాకుండా మరో తేదీని అడిగి అప్పుడు విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ట్యాపింగ్ కేసులో ముందే హరీష్, కేటీఆర్, సంతోష్ విచారణ పూర్తయిపోయింది కాబట్టి సిట్ అధికారులు అడగబోయే ప్రశ్నలను ఊహించటం కేసీఆర్ కు పెద్ద కష్టంకాదు. ప్రశ్నలను ఊహించి వాటికి సమాధానాలు సిద్ధంచేసుకోవటానికే కేసీఆర్ సమయం అడిగినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.

వాయిదా కారణం సరైనదేనా ?

విచారణ వాయిదాకు కేసీఆర్ చెప్పిన కారణం సిల్లీగా ఉంది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా కాబట్టి, నామినేషన్లకు శుక్రవారం ఆఖరుతేదీ కాబట్టి విచారణకు హాజరుకాలేనని కేసీఆర్ సిట్ అధికారులకు లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం ఆఖరు రోజైనంత మాత్రాన కేసీఆర్ ఏమిచేస్తారు ? ఫామ్ హౌస్ వదిలి కేసీఆర్ ఎక్కడకూ వెళ్ళరు, ఎవరినీ ఫామ్ హౌస్ లోకి అడుగుపెట్టనీయరని అందరికీ తెలిసిందే. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత కేసీఆర్ ప్రచారానికి వెళ్ళేది కూడా అనుమానమే. పోలింగ్ రోజున విచారణకు రమ్మంటే అప్పుడు సాధ్యంకాదని చెప్పినా అర్ధముంది. అయినా ఎందుకు విచారణ కోరారంటే ప్రిపేర్ అవటం కోసమే అని అర్ధమైపోతోంది. మరి సిట్ తదుపరి నోటీసుకు కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.

Read More
Next Story