కవిత పార్టీవల్ల ఎవరికి నష్టం ?
x
Kalvakuntla kavitha

కవిత పార్టీవల్ల ఎవరికి నష్టం ?

పార్టీల వ్యవహారాలను బట్టిచూస్తే కవిత పార్టీవల్ల ముందు ఏదైనా నష్టం జరిగితే అది బీఆర్ఎస్ కే అనిచెప్పాలి


తొందరలోనే రాజకీయపార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు కల్వకుంట్ల కవిత చెప్పారు. మేనెలలో మంచి ముహూర్తంచూసుకుని పార్టీ పేరును ప్రకటిస్తానని మీడియా సమావేశంలో తెలిపారు. పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మునన్సిపల్ ఎన్నికల నాటికి పార్టీ ఏర్పాటు జరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. కాబట్టి పై రెండు ఎన్నికల్లోను తమపార్టీ పేరుమీదే అభ్యర్ధులు పోటీ చేస్తారని కూడా చెప్పారు. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుమీద మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచినవాళ్ళు కవితకు పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ గుర్తుమీద 8 మంది కౌన్సిలర్లు గెలవగానే వారంతా కవిత నాయకత్వంలోని జాగృతి నేతలే అనే ప్రచారం విపరీతంగా జరిగింది. అందరు నిజమే అనుకున్నారు.

అయితే సాయంత్రానికి గెలిచిన కౌన్సిలర్లో వడ్డీపేల్లి శ్రీనివాస్ మాట్లాడుతు తమ గెలుపుకు, కవితకు ఎలాంటి సంబంధంలేదని తేల్చేశారు. తామలో ఎవరం జాగృతి నేతలం కాదని అందరం ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నేతలమే అని స్పష్టంగా ప్రకటించారు. అలా ప్రకటించటమే కాకుండా మరుసటి రోజు ఉదయానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో అందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. వడ్డేపల్లి వ్యవహారంతో కవితకు పెద్ద షాక్ తగిలింది. బహుశా ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పరిషత్, గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుమీదే అభ్యర్ధులు పోటీచేస్తారని ప్రకటించింది.

సరే, పోటీచేయటం, గెలుపోటములను పక్కనపెట్టేస్తే కవిత పెట్టబోయే పార్టీ వల్ల ఇపుడున్న పార్టీల్లో దేనికి నష్టం జరుగుతుంది ? ఏ పార్టీని కవిత పార్టీ టార్గెట్ చేస్తుంది ? అన్న చర్చలు మొదలయ్యాయి.

పార్టీల వ్యవహారాలను బట్టిచూస్తే కవిత పార్టీవల్ల ముందు ఏదైనా నష్టం జరిగితే అది బీఆర్ఎస్ కే అనిచెప్పాలి. ఎందుకంటే మొదటినుండి కవిత బీఆర్ఎస్ మనిషే కాబట్టి. బీఆర్ఎస్ నుండి బయటకు గెంటేయటం వల్లే కవిత కొత్తపార్టీ పెట్టబోతున్నారు. ఇపుడు జాగృతిలో ఉన్నవారిలో అత్యధికులు ఒకపుడు బీఆర్ఎస్ లో కవిత మద్దతుదారులుగా పనిచేసినవారే. కవిత పార్టీ పెట్టిన తర్వాత నేతలు ఎవరైనా చేరితే వాళ్ళల్లో అత్యధికులు బీఆర్ఎస్ వాళ్ళే అయ్యుంటారు. ఎన్నికల్లో కవితపార్టీకి పడే ఓట్లలో అత్యధికం బీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లే అయ్యుంటాయి అనటంలో సందేహంలేదు. కాబట్టి కవిత పార్టీవల్ల మొదటిదెబ్బ పడితే బీఆర్ఎస్ కు పడటానికే ఎక్కువ అవకాశం ఉంది.

ఇక రెండోకోణంలో నుండి చూస్తే కవితపార్టీవల్ల నష్టంజరిగితే అది బీజేపీకే అనుకోవాలి. ఎందుకంటే బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో కాని పట్టణ ప్రాంతాల్లో కాని చెప్పుకోదగ్గ మద్దతుదారులు లేరు. ఈమధ్యనే జరిగిన పంచాయతీ ఎన్నికలు, తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలే ఈ విషయాన్ని రుజువుచేశాయి. 12,752 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే సుమారు 500 పంచాతీల్లో మాత్రమే బీజేపీ మద్దతుదారులు గెలిచారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో 2996 వార్డులుంటే ఇందులో బీజేపీ గెలిచింది సుమారు 300 వార్డులే.

దీన్ని బట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా బీజేపీకి పెద్దగా మద్దతుదారులు లేరని. పరిషత్ ఎన్నికల్లో పోటీచేయటానికి బీజేపీతో పోల్చుకుంటే కవిత పార్టీ తరపున పోటీచేయటానికి ఎక్కువమంది ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఎలాగంటే కవిత పార్టీ లోకల్ కాబట్టి.

పరిషత్, గ్రేటర్ ఎన్నికల్లో కవితపార్టీ గెలుచుకునే సీట్లను బట్టి ఆ పార్టీకి ఆధరణ ఉంటుందా ఉండదా అనేది తేలుతుంది. కాంగ్రెస్ పార్టీమీద కవితపార్టీ ప్రభావం పెద్దగా ఉంటుంది అనుకునేందుకు లేదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీఆర్ఎస్-బీజేపీ-కవితపార్టీల మధ్య చీలిపోతుంది. ప్రభుత్వ వ్యతిరేకఓట్లు ఎంతచీలితే అధికారపార్టీకి అంత లాభం అన్న విషయం తెలిసిందే. కాబట్టి కవిత పార్టీవల్ల కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్, బీజేపీకే నష్టాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ముచ్చటకూడా పరిషత్, గ్రేటర్ ఎన్నికల్లో పడే ఓట్లను బట్టి తేలిపోతుంది.

ఎలాంటి నష్టం ఉండదు : రామచంద్రరావు

కవిత పెట్టబోయే పార్టీవల్ల తమపార్టీకి ఎలాంటి నష్టం జరగదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు తెలిపారు. కవిత కామెంట్లపై మీడియాతో మాట్లాడుతు 2019 పార్లమెంటు ఎన్నికల్లో కవిత ఏ పార్టీవల్ల ఓడిపోయిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఎద్దేవాచేశారు. ఆ ఎన్నికల్లో కవితను బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ ఓడించారు. అందుకనే రామచంద్రరావు ఆ విషయాన్ని కవితకు గుర్తుచేశారు. ఎన్నిపార్టీలు వచ్చినా తమకు జరిగే నష్టం ఏమీలేదని తెలంగాణ అధ్యక్షుడు స్పష్టంచేశారు.

Read More
Next Story