
హరీష్ బృందం అర్జంటుగా ఢిల్లీకి ఎందుకెళ్ళింది ?
ప్రతిష్టాత్మకమైన బహిరంగసభను వదిలేసి అంత అర్జంటుగా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఈ బృందానికి ఏమొచ్చింది అన్నదే అర్ధంకావటంలేదు
అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. సోమవారం ఉదయం తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందం అర్జంటుగా ఢిల్లీకి వెళ్ళింది. జగిత్యాలలో ఈరోజు సాయంత్రం ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగసభ జరగబోతోంది. ఆ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరవబోతున్నారు. ఉదయమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులతో కలిసి హరీష్ కూడా జగిత్యాలలోనే మకాం వేయాల్సుంది. అలాంటిది అధినేత ఆదేశాలతో హుటాహుటిన ఉదయమే బయలుదేరి హరీష్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బహిరంగసభను వదిలేసి అంత అర్జంటుగా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఈ బృందానికి ఏమొచ్చింది అన్నదే అర్ధంకావటంలేదు.
పార్టీవర్గాలు చెబుతున్నది ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు, ఫిరాయింపు ఎంఎల్ఏలకు సంబంధించిన న్యాయ సలహాలు, సంప్రదింపుల కోసం సీనియర్ న్యాయవాదులతో మాట్లాడేందుక హరీష్ బృందం ఢిల్లీకి చేరుకున్నదని. మీడియా, సోషల్ మీడియాలో ఇలాగే ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై హైకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన తీర్పును బుధవారం హైకోర్టు ఇవ్వబోతోంది. అలాగే ఫిరాయింపు ఎంఎల్ఏలపై విచారణ జరిపిన హైకోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కూడా నోటీసులు జారీచేసింది.
నిజానికి పై రెండు అంశాల్లో ఏదికూడా సోమవారం తీర్పు రావటంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను కేసీఆర్, హరీష్ తదితరులు వేర్వేరుగా వ్యతిరేకిస్తు కేసులు వేశారు. అందరి వైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పు బుధవారం వెలువడనున్నది. తీర్పు రాకుండానే హరీష్ బృందం ఢిల్లీకి వెళ్ళి సుప్రింకోర్టు న్యాయవాదులతో ఏమి మంతనాలు చేస్తుంది ? జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ రిపోర్టు చెల్లదని కేసీఆర్ తదితరులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ విషయంలో తమ అభ్యంతరాలను హైకోర్టు కొట్టేస్తుందని కేసీఆర్ కు అనుమానం వచ్చిందా ? లేదా ఎక్కడినుండైనా ఉప్పందిందా ? తెలీదు. ఒకవేళ తీర్పు కేసీఆర్ తదితరులకు వ్యతిరేకంగా వచ్చిందనే అనుకుందాము. తీర్పు వచ్చిన తర్వాత కదా ఢిల్లీకి వెళ్ళి సుప్రింకోర్టులో కేసు వేసే విషయాన్ని చర్చించాల్సింది.
అలాగే ఫిరాయింపులపైన కూడా ఢిల్లీకి వెళ్ళి లాయర్లతో చర్చించాల్సినంత అవసరం ఏమొచ్చిందో అర్ధంకావటంలేదు. ఫిరాయింపు ఎంఎల్ఏలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటంపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తంచేస్తు హైకోర్టులో కేసులు దాఖలుచేసింది. ఫిరాయింపుల కేసులు సుప్రింకోర్టు నుండే హైకోర్టుకు బదిలీ అయ్యింది. ఫిరాయింపు ఎంఎల్ఏలు అందరికీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వగానే కేసును సుప్రింకోర్టు క్లోజ్ చేసేసింది. దాన్ని బీఆర్ఎస్ సవాలు చేయగా హైకోర్టులో తేల్చుకోమని చెప్పటంతోనే మళ్ళీ హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి.
బీఆర్ఎస్ అభ్యంతరాలపైన స్పందించిన హైకోర్టు ఫిరాయింపు ఎంఎల్ఏలతో పాటు స్పీకర్ కు కూడా నోటీసులు జారీచేసి కౌంటర్లు దాఖలు చేయమని చెప్పి సమయం ఇచ్చింది. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు హరీష్ బృందం ఢిల్లీకి వెళ్ళి సుప్రింకోర్టు లాయర్లతో మాట్లాడేది ఏమీ ఉండదు. అయినా అత్యవసరంగా ఉదయం బయలుదేరి ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ? పైన జరుగుతున్న ప్రచారం కన్నా లోలోపల ఇంకేదైనా విషయం ఉండుంటుందా ? అన్నదే అందరికీ అనుమానంగా ఉంది.

