
పిచ్చెక్కిస్తున్న దానం నాగేందర్
బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఇపుడు చెప్పుకుంటున్న దానం మరి 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎలా పోటీచేశారు ?
బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ రాజకీయ అజెండా ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. రోజుకో ప్రకటనతో దానం అందరికీ పిచ్చెక్కిస్తున్నారు. ఒకరోజు తాను కాంగ్రెస్ లోనే ఉన్నాను చెప్పారు. ఇపుడేమో తాను బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అంటున్నారు. ఆమధ్య రేవంత్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రాజీనామాచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇపుడేమో రాజీనామా చేయాల్సిన అవసరమే లేదంటున్నారు.
తాను కాంగ్రెస్ లోకి ఫిరాయించానని జరుగుతున్న ప్రచారం, బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువే అని ఎదురుదాడి మొదలుపెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. శుక్రవారం విచారణలో తనను వ్యక్తిగతంగా హాజరుకావాలని అసెంబ్లీ స్పీకర్ నోటీసులో లేదన్నారు. ఇలా రోజుకో విధంగా దానం ఎందుకు మాట్లాడుతున్నారు ? అన్నదే అర్ధంకావటంలేదు.
బీఆర్ఎస్ తరపున గెలిచిన తాను కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలవటం, కాంగ్రెస్ పార్టీ మీటింగులో పాల్గొనటం తన వ్యక్తిగతమని అన్నారు. రేవంత్ ను కలిసినా, కాంగ్రెస్ మీటింగులో పాల్గొన్నా పార్టీ ఫిరాయించినట్లు ఎలాగ అవుతుందని గడుసుగా నిలదీస్తున్నారు.
స్పీకర్ విచారణలో తన లాయర్ అన్నీ విషయాలను వివరిస్తారు అన్న ధీమాను వ్యక్తంచేశారు. తనను బీఆర్ఎస్ దూరంపెట్టడం వల్లే తాను నాయకత్వానికి దూరంగా ఉంటున్నట్లు విచిత్రమైన లాజిక్ వినిపించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే రేవంత్ ను కలిస్తేనో లేకపోతో కాంగ్రెస్ మీటింగుకు హాజరైతేనో దానం కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు అనుకునేందుకు లేదు. అయితే బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటూ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీచేయటాన్ని ఏమనుకోవాలి ? బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఇపుడు చెప్పుకుంటున్న దానం మరి 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎలా పోటీచేశారు ? కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేయటాన్ని దానం ఎలా సమర్ధించుకుంటారో కాస్త చెబితే విని అందరూ సంతోషిస్తారు.

