
మున్సిపల్ ఎన్నికలు: చెమటోడ్చిన రేవంత్ !
మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ స్వయంగా ప్రచారం చేయడం రాజకీయంగా ఎందుకు కీలకమయ్యింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. పోలింగ్ జరగడానికి ముందు ప్రచారంలోనే హోరామోరీ పోటీ కనిపించింది. ఈ పోటీలో పోరాడి నెగ్గడం కోసమని సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రచార రథమెక్కారు. సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రంగంలోకి దిగరు, మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ మున్సిపాలిటీల్లో సభలు నిర్వహించారు. వరుసగా ఐదు రోజుల పాటు ఐదు మున్సిపాలిటీల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహించారు. ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల ప్రచార రథాలకు బ్రేకులు పడ్డాయి, మైకులు ఆఫ్ అయ్యాయి. ఈ సమయంలో రేవంత్ ప్రచారం చేయడం ఏంటి అన్నది కీలకంగా మారింది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ చాలా యాక్టివ్‌గా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం స్థాయి ప్రచారం అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం ఎందుకు నేరుగా బాధ్యత తీసుకున్నారన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థుల నుంచి వచ్చిన గట్టి పోటీనే దీనికి కారణంగా చెబుతున్నారు. రేవంత్ నిర్వహించిన సభలు చూస్తే ఈ అంచనాలకు బలం చేకూరుతోంది.
బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి చోటా ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. మరోవైపు బీజేపీ కూడా బలంగా రంగంలోకి దిగింది. కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు పేరుకి మున్సిపల్‌వే అయినా ప్రచారం మాత్రం అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరిగింది. ఈ పోటీ వాతావరణం కాంగ్రెస్‌పై అదనపు ఒత్తిడిని పెంచిందనే చెప్పాలి. రేవంత్ స్వయంగా రంగంలోకి దిగడమే అందుకు నిదర్శనం.
స్థానిక నాయకుల ప్రచారం సరిపోదన్న అభిప్రాయానికి పార్టీ వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే సీఎం స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌ను గెలిపించుకోవడమే లక్ష్యంగా రేవంత్ వరుస సభలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలో 8-ఫిబ్రవరి-2026 తేదీన, వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్‌లో 7-ఫిబ్రవరి-2026 తేదీన, నిజామాబాద్‌లో 6-ఫిబ్రవరి-2026తేదీన, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 5-ఫిబ్రవరి-2026 తేదీన, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 4-ఫిబ్రవరి-2026 తేదీన సభలు నిర్వహించారు.
ప్రతి సభలో ప్రత్యర్థుల వైఫల్యాలను ప్రస్తావించారు. కార్యకర్తలను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. ఓటర్లను నేరుగా చేరుకునేలా ప్రచారం సాగింది. ఈ ప్రచారం ద్వారా కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో స్పష్టంగా కనిపించింది. మున్సిపల్ ఫలితాలు ప్రభుత్వంపై తొలి ప్రజాభిప్రాయంగా మారే అవకాశముందన్న భావన కూడా ఈ ప్రచారానికి నేపథ్యంగా ఉంది.
బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన గట్టి పోటీనే సీఎం రేవంత్‌ను ప్రత్యక్షంగా రంగంలోకి దించిన ప్రధాన కారణంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్థానిక ఎన్నికలైనా, ప్రతిష్టాత్మక పోరాటంగా మారిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ దిశగా వెళ్తాయన్నదే కీలకంగా మారింది. సీఎం స్థాయి ప్రచారం కాంగ్రెస్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఫలితాలే తేల్చనున్నాయి.

