రేవంత్ ఫొటోకు ఐలాపురంలో పాలాభిషేకం ఎందుకు జరిగిందో తెలుసు ?
x

రేవంత్ ఫొటోకు ఐలాపురంలో పాలాభిషేకం ఎందుకు జరిగిందో తెలుసు ?

సేవ్‌ఐలాపూర్ నినాదాలతో గ్రామం మారుమోగిపోయింది. టపాకాయలు కాల్చి జనాలు సంతోషాన్ని వ్యక్తంచేశారు.


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫొటోకు ఐలాపురం గ్రామస్తులు క్షీరాభిషేకం చేశారు. గ్రామంలో జనాలంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. సేవ్‌ఐలాపూర్ నినాదాలతో గ్రామం మారుమోగిపోయింది. టపాకాయలు కాల్చి జనాలు సంతోషాన్ని వ్యక్తంచేశారు. రేవంత్ తో పాటు హైడ్రాకు జేజేలు కొట్టారు. ఐలాపురంలో గ్రామస్తులు ఇదంతా ఎందుకుచేశారు ? గ్రామస్తుల సంతోషానికి కారణం ఏమిటి ?

గ్రామస్తుల సంతోషానికి కారణం ఏమిటంటే బీఆర్ఎస్ నేతల పాపాల పుట్టలు బద్దలైనందుకే జనాలు అంత సంతోషాన్ని వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కబ్జాలకు హైడ్రా రూపంలో రేవంత్ ప్రభుత్వం చరమగీతం పాడినందుకే గ్రామస్తులు టపాకాయలు కాల్చింది. కబ్జాలను కూల్చేసి వేలాదికోట్లరూపాయల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా సొంతంచేసుకున్నందుకే గ్రామస్తులు రేవంత్ ఫొటోకు క్షీరాభిషేకం చేసింది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలంలో ఐలాపూర్ గ్రామంలో సంవత్సరాలుగా బీఆర్ఎస్ నేతలు ముఖీం, అజీమ్ సోదరుల కబ్జాలో 40 ఎకరాలున్నాయి. ఈ భూమిలో సోదరులు ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. అలాగే తమ్ముడు అజీమ్ ఏకంగా అపార్ట్ మెంట్లే కట్టేశాడు. బీఆర్ఎస్ హయాంలో నుండే మరికొందరు నేతల కబ్జాలపై స్ధానికులు ఎన్ని ఫిర్యాదులుచేసినా పట్టించుకోలేదు. రాజగోపాల్ నగర్ లో జనాల ప్లాట్లను కూడా మరికొందరు బీఆర్ఎస్ నేతలు కబ్జాచేసి తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. కబ్జాల గురించి ఎవరు మాట్లాడకుండా సోదరులు బెదిరింపులతో ఏళ్ళకేళ్ళు నెట్టుకొస్తున్నారు. సోదరులు, ఇతర నేతలు ఆక్రమించుకున్న భూములపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. అందుకని ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని, నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని 2005లోనే హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినా సరే కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా అజీమ్ లే అవుట్ వేసి, అపార్ట్ మెంట్లు కట్టేసి అమ్మేశాడు. రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం లేదుకాబట్టి నోటరీ ద్వారా ఫ్లాట్లను అమ్మేశాడు.

పూర్తి వివరాలు సేకిరించిన హైడ్రా

వీళ్ళ కబ్జాలపై గ్రామస్తులు హైడ్రాకు అనేక ఫిర్యాదులుచేశారు. దాంతో హైడ్రా గ్రామంలో పర్యటించి కబ్జా ఆరోపణలు వినబడుతున్న భూములకు సంబందించిన వివరాలను సేకరించింది. గ్రామస్తులతో సమావేశమై వివరాలను తీసుకున్నది. రెవిన్యు రికార్డులను పరిశీలించటంతో పాటు కోర్టులో కేసును కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. హైడ్రా సేకరించిన వివరాల ప్రకారం గ్రామంలోని 1263 ఎకరాలు ప్రభుత్వానివిగా తేలింది. ఈ 1263 ఎకరాల్లోనే ముబీం, అజీమ్ కబ్జాలతో పాటు ఇతర నేతల కబ్జాలు కూడా ఉన్నాయి. కబ్జాల నుండి ప్రభుత్వ భూములకు ఏ విధంగా చెరవిడిపించాలనే విషయమై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ ఇతర శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు.

ఐలాపూర్ లో భారీ ఆపరేషన్ చేయకతప్పదని రంగనాధ్ నిర్ణయించారు. అందుకనే వారంరోజుల ముందునుండే హైడ్రా సిబ్బంది ఆక్రమణలకు గురైన భూముల్లో క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. ఈ గ్రామంలోని రాజగోపాల్ నగర్ లే అవుట్ ప్లాట్ల యజమానులే తమకు న్యాయంచేయాలంటు హైడ్రాకు కబ్జాలపై ఫిర్యాదుచేశారు. గ్రామస్తులతో సమావేశమైన రంగనాధ్ తో ముభీం పెద్దఎత్తున వాగ్వాదానికి దిగారు. సర్వేనెంబర్లు 171, 172, 173, 175, 212, 213లోని భూముల్లో గెస్ట్ హౌజ్, ఫామ్ హౌస్ అంతా కోర్టు వివాదాల్లో ఉందన్న విషయాన్ని గ్రామస్తులు హైడ్రాకు ఆధారాలతో సహా చూపించారు. రాజగోపాల్ నగర్ లోని యజమానుల ప్లాట్లను కూడా మరికొందరు నేతలు కబ్జాచేసి అమ్మేసిన విషయం హైడ్రా కమిషనర్ కు అర్ధమైంది. సోదరులపై బీఆర్ఎస్ హయాంలోనే లెక్కకుమించి ఫిర్యాదులు అందినా అప్పటి ప్రభుత్వం సోదరులపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సోదరుల కబ్జాలుచేసి లేఅవుట్లు వేసి అమ్మేసిన భూమితో పాటు ఇతరత్రా కబ్జాలకు గురైన భూమి 861 ఎకరాలుగా హైడ్రా నిర్ధారణకు వచ్చింది.

ఫాస్ట్ గా యాక్షన్లోకి

ఇలా అన్నీ కోణాలనుండి కబ్జాలపై వివరాలను సేకరించిన హైడ్రా కమిషనర్ శనివారం ఉదయమే పోలీసులు, రెవిన్యు, మున్సిపాలిటి తదితర శాఖల అధికారులు, సిబ్బంది 2700 మందితో ఐలాపూర్ లోకి ప్రవేశించారు. జెయింట్ సైజ్ క్రేన్, 12 జేసీబీలు, 3 హిటాచీ మధ్యస్ధాయి జేసీబీలు, 10 టిప్పర్లతో గ్రామంలోకి ప్రవేశించిన హైడ్రా వెంటనే వివిధ చోట్ల ఏకకాలంలో ఆపరేషన్ మొదలుపెట్టేసింది. అపార్ట్ మెంట్లోని జనాలందరినీ బయటకు పిలిపించి 7 అంతస్తులను కూల్చేసింది. అలాగే ఫామ్ హౌస్, గెస్ట్ హౌజ్ ను నేలమట్టంచేసి మొత్తం భూమిని స్వాధీనం చేసుకున్నది.

అజీమ్, ముభీమ్ ఆక్రమించుకున్న 40 ఎకరాల భూమి విలువే సుమారు రు. 720 కోట్లు ఉంటుందని అంచనా. మిగిలిన కబ్జాల్లో ఉన్న భూములకు కూడా బీఆర్ఎస్ నేతలచేతిల్లోనే ఉన్నట్లు తేలటంతో అన్నింటినీ హైడ్రా నేలమట్టం చేసేసింది. దాంతో ఆక్రమణల్లో ఉన్న 861 ఎకరాల భూమికి అప్పటికప్పుడే ఫెన్సింగ్ వేసేసి ప్రభుత్వభూమి అంటు బోర్డులు పెట్టేసింది హైడ్రా. హైడ్రా స్వాధీనం చేసుకున్న 861 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ సుమారు రు. 15 వేల కోట్లుంటుందని అంచనా. సంవత్సరాల తరబడి బీఆర్ఎస్ నేతల కబ్జాల్లో నలిగిపోతున్న ప్రభుత్వభూములను హైడ్రా ఒక్కదెబ్బతో నెలమట్టం చేసేసి తిరిగి స్వాధీనం చేసుకోవటంతో పాటు ఆక్రమణల్లో ఉన్న రాజగోపాల్ నగర్ యజమానుల ప్లాట్లను కూడా చెరనుండి విడిపించి హైడ్రా వాటిని యజమానులకు అందిచింది.

సంవత్సరాల నుండి పడుతున్న బాధలను హైడ్రా ఒక్కదెబ్బతో పటాపంచలు చేసిందన్న ఆనందంతోనే గ్రామస్తులు రేవంత్ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. రేవంత్ తో పాటు హైడ్రా, కమిషనర్ రంగనాధ్ కు జిందాబాదులు కొట్టారు. ఆనందంతో టపాకాయలు పేల్చారు.

Read More
Next Story